
ఎన్‌ఏడీ జంక్షన్ (విశాఖ పశ్చిమ): అక్కాచెల్లెళ్లైన ఇద్దరు బాలికలపై ఇద్దరు బాలురు అత్యాచారానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన గోపాలపట్నం పోలీసులు నిందితులిద్దరినీ అరెస్టు చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. సింహాచలం కొండ దిగువన పైడితల్లమ్మ ఆలయం సమీపంలో మైనర్ బాలికలైన అక్కాచెల్లెళ్లు కుటుంబంతో నివాసముంటున్నారు. అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్ బాలురు వీరితో స్నేహం నటించి వలలో వేసుకున్నారు.
మాయ మాటలు చెప్పి నమ్మించారు. నాలుగైదు రోజుల క్రితం వీరిని సామర్లకోట తీసుకెళ్లారు. అక్కడ వీరితో సన్నిహితంగా మెలిగారు. అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లారు. ఈలోగా తమ ఇద్దరమ్మాయిలు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గోపాలపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో బాలికలు, బాలురు నర్సీపట్నంలో ఉన్నట్టు గుర్తించారు. బాలికలతో పాటు వీరిని మంగళవారం పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. బాలికలపై అత్యాచారం జరిగినట్టు విచారణలో తేలడంతో మైనర్ బాలురను అరెస్టు చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు. బాలికలను వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. నిందితులలో ఒక మైనర్ బాలుడు గతంలో ఒక కేసులో ముద్దాయిగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment