Vocational college
-
ఒకేషనల్ కాలేజీకి ఓకే
సాక్షి, హైదరాబాద్: ఇటీవల నర్సింగ్ కళాశాలను ప్రారంభించిన ఆర్టీసీ సంస్థ మరో ముందడుగు వేసింది. ఈ విద్యాసంవత్సరం నుంచే ఒకేషనల్ కాలేజీని అందుబాటులోకి తెస్తోంది. తార్నాకలోని రవాణా సంస్థ ఆసుపత్రికి అనుబంధంగా దీనిని ఏర్పాటు చేస్తోంది. తార్నాక ఆసుపత్రిని సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌గా మారుస్తున్న విషయం తెలిసిందే. 200 పడకల ఈ ఆసుపత్రిలో ఇంతకాలం కేవలం ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు మాత్రమే చికిత్స చేసేవారు. ఇప్పుడు సాధారణ ప్రజలకు కూడా విస్తరించనున్నారు. ఈ క్రమంలో దానికి అనుబంధంగా ఒకేషనల్ కాలేజీని ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నిర్ణయించారు. 2022–23 విద్యాసంవత్సరం నుంచే అడ్మిషన్ల ప్రక్రియ చేపడుతున్నారు. ఒకేషనల్ కళాశాలలో తొలుత మెడికల్ లెబొరేటరీ టెక్నాలజీ(ఎంఎల్టీ), ఫిజియోథెరపీ(పీటీ), మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కోర్సులను ప్రారంభిస్తున్నారు. రెండేళ్ల వ్యవ«ది ఉండే ఈ కోర్సులకు 30 చొప్పున సీట్లను కేటాయించారు. ఇందులో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కోర్సు పూర్తిగా యువతులకే కాగా, మిగతా రెండింటిని కో–ఎడ్యుకేషన్ క్లాసెస్గానే నిర్వహించనున్నారు. దరఖాస్తుల ఆహ్వానం పదో తరగతి ఉత్తీర్ణులైనవారు ఈ కోర్సుల్లో చేరటానికి అర్హులు. మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలోనే ఈ కళాశాల కొనసాగుతుంది. ఇటీవల ఇక్కడ ప్రారంభించిన నర్సింగ్ కాలేజీలో ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం 5 సీట్లు రిజర్వు చేసిన విషయం తెలిసిందే. కానీ, ఒకేషనల్ కాలేజీలో మాత్రం అలాంటి వెసులుబాటు కల్పించలేదు. ఫీజు రూ.15 వేల నుంచి రూ.20 వేలు ఈ కోర్సులకు ఇంకా ఫీజులను నిర్ధారించలేదు. కానీ, ఫీజులు రూ.15 వేల నుంచి రూ.20 వేల మధ్య ఉండే అవకాశం ఉందని సమాచారం. నర్సింగ్ కాలేజీ కోసం అదే ప్రాంగణంలో ప్రత్యేకంగా హాస్టల్ వసతి కల్పించగా, ఒకేషనల్ కాలేజీకి మాత్రం ఆ వెసులుబాటు లేదు. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోండి ఒకేషనల్ కాలేజీని ఈ విద్యాసంవత్సరమే ప్రారంభిస్తున్నాం. ఆసక్తి ఉన్న అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు 73828 35579, 95736 37594 నంబర్లలో సంప్రదించవచ్చు. లేదంటే నేరుగా తార్నాక ఆర్టీసీ ఆసుపత్రికి వచ్చి సంప్రదించవచ్చు. – శైలజ, ఆర్టీసీ ఆసుపత్రి సూపరింటెండెంట్ -
క్రిమియా కాలేజీలో ఉన్మాది కాల్పులు
సింఫెరోపోల్: రష్యా ఆక్రమిత క్రిమియా బుధవారం కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఇక్కడి కెర్చ్ పట్టణంలో ఉన్న ఒకేషనల్ కాలేజీలో ఓ విద్యార్థి విధ్వంసం సృష్టించాడు. బాంబు పేల్చి, తర్వాత విచక్షణారహితంగా తుపాకీతో గుళ్లవర్షం కురిపించాడు. ఈ ఘటనలో కాలేజీలోని 19 మంది ప్రాణాలు కోల్పోగా, 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన రష్యన్ ఇన్వెస్టిగేటివ్ కమిటీ అధికారులు.. కాల్పులకు పాల్పడింది కళాశాలలో నాలుగో ఏడాది చదువుతున్న వ్లాదిల్సవ్ రోస్ల్యకోవ్ (18)గా గుర్తించారు. కాల్పుల ఘటన అనంతరం కళాశాల లైబ్రరీలో బుల్లెట్ గాయాలతో రోస్ల్యకోవ్ మృతదేహం కనిపించింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం ఈ దారుణం జరిగింది. కాల్పులు జరిపిన అనంతరం రోస్ల్యకోవ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. దాడి సందర్భంగా రోస్ల్యకోవ్ కాలేజీలోకి వస్తూనే బస్సుపై కాల్పులు జరిపాడు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ప్రమాదంపై స్పందిస్తూ.. ‘బాంబు పేలడం కారణంగానే ఎక్కువ మంది చనిపోయారు. ఇది కాల్పుల ఘటన మాత్రమే.. ఉగ్రదాడి ఎంతమాత్రం కాదు’ అని తెలిపారు. ఇక్కడి టీచర్లు చాలా చెడ్డవారని, వారిపై పగ తీర్చుకుంటానని రోస్ల్యకోవ్ చెప్పేవాడని మరో విద్యార్థి వెల్లడించాడు. -
విద్యార్థినికి అండగా నిలిచిన వైఎస్సార్ సీపీ
-
విద్యార్థినికి అండగా నిలిచిన వైఎస్సార్ సీపీ
సాక్షి, విశాఖపట్నం : విశాఖ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో గతవారం జరిగిన అత్యాచారయత్నం ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధిత విద్యార్థికి అండగా నిలిచింది. విద్యార్థినిపై అత్యాచార యత్నం చేసిన కళాశాల కరస్పాండెంట్ వెంకట సత్య నరిసింహ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించింది. ఈ మేరకు బాధితురాలు, కాలేజీ విద్యార్థులతో కలిసి వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కలెక్టర్‌కు సోమవారం వినతి పత్రం ఇచ్చారు. కాగా, మాయ మాటలు చెప్పి ఇంటికి రప్పించుకున్న కరస్పాండెంట్ ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిపై గత సోమవారం లైంగిక వేధింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. -
స్టూడెంట్ ని ఇంటికి పిలిచి..కరస్పాండెంట్ కీచక చర్య
విశాఖపట్నం ,అల్లిపురం : కీచక కరస్పాండెంట్‌ను శిక్షించాల్సిందే అంటూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతతకు దారి తీసింది. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల డాబాగార్డెన్స్‌లో ప్రేమసమాజం ఎదుట గల విశాఖ ఒకేషనల్ జూనియర్ కాలేజీ విద్యార్థులు మంగళవారం కోపోద్రిక్తులయ్యారు. కళాశాలలో చదివే విద్యార్థినులతో కరస్పాండెంట్ గాది వెంకట సత్య నరిసింహ కుమార్ అలియాస్ కుమార్ కీచకుడిలా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. మంగళవారం విద్యార్థులంతా కలిసి కళాశాలలో కుమార్‌ను నిలదీశారు. బాధితురాలి కథనం ప్రకారం... విశాఖ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చదువుతున్న బాధితురాలు కైలాసపురంలో గల కళాశాల హాస్టల్లో ఉండేది. అయితే హాస్టల్లో సౌకర్యాలు బాగోలేవని ఇటీవల బయట అద్దె గది తీసుకుని ఉంటోంది. ఈ నేపథ్యంలో ఇటీవల కుమార్ తల్లి కాలం చేయడంతో ఇంటి పనులున్నాయని బాధితురాలిని శుక్రవారం కుమార్ ఇంటికి పిలిపించాడు. ఇంటికి వెళ్లిన తర్వాత ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించి లైంగిక దాడికి యత్నించాడు. దీంతో ఆమె అతని కాళ్లు పట్టుకుని బతిమలాడి అక్కడి నుంచి బయటపడింది. జరిగిన విషయాన్ని సోమవారం కళాశాలలో సహ విద్యార్థినులకు చెప్పి... తాను చచ్చిపోవాలనుకుంటున్నట్లు తెలియజేసింది. దీంతో విద్యార్థులంతా విషయాన్ని కళాశాలలో మరో ఉపాధ్యాయుడు సురేష్‌కు వివరించారు. ఆత్మహత్య చేసుకుని సాధించేదేముంది అంటూ బాధితురాలిని వారించారు. మంగళవారం ఉదయం కళాశాలకు వచ్చిన తర్వాత విద్యార్థులంతా కరస్సాండెంట్ కుమార్ కార్యాలయంలోకి వెళ్లి నిలదీశారు. ఆ సమయంలో కళాశాల ప్రిన్సిపాల్ గ్లోరీ కూడా అక్కడే ఉన్నారు. ఆమె కుమార్‌ని హెచ్చరించాల్సిందిపోయి మద్దతుగా నిలవడంతో విద్యార్థులు కోపోద్రోక్తులయ్యారు. కుమార్‌పై వారంతా తిరగబడేసరికి టూ టౌన్ పోలీసులు విషయం తెలుసుకుని అక్కడకు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో విద్యార్థులు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితుడిపై గతంలో మూడు కేసులు నిందితుడు కుమార్ గతంలో నర్సీపట్నంలో కూడా కళాశాలలు నడిపినట్లు అతని భార్య సాయిలక్ష్మి తెలిపింది. అతనిపై అక్కడ కూడా లైంగిక వేధింపులపై మూడు కేసులు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. అక్కడి కళాశాలలు మూసివేసి ఇక్కడకు చేరుకున్నాడని, అతడిని కళాశాల ప్రిన్సిపాల్ గ్లోరీ వెంట తిప్పుకుంటుందని భార్య తీవ్రస్థాయిలో ఆరోపించింది. తన భర్తను తనకు కాకుండా చేస్తోందని ఆరోపించింది. వారికి శిక్ష పడేలా చూడాలని ఆమె డిమాండ్ చేసింది. విద్యార్థులకు పలువురి మద్దతు బాధిత విద్యార్థినితో పాటు కళాశాల విద్యార్థులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నగర అధ్యక్షుడు కొండా రాజీవ్‌గాంధీతో పాటు ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు, ఐద్వా నగర కార్యదర్శి ప్రియాంక అండగా నిలబడ్డారు. కళాశాల విద్యార్థులతో కలిసి డాబాగార్డెన్స్ నుంచి ర్యాలీగా రైల్వే స్టేషన్ వరకు వెళ్లారు. అక్కడి నుంచి ఆటోలలో కంచరపాలెం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని బైఠాయించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఎస్ఐ ఉమా వెంకటేశ్వరరావుని కోరారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నగర అధ్యక్షుడు కొండా రాజీవ్‌గాంధీ మాట్లాడుతూ కళాశాలకు గుర్తింపులేదన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు నష్టపోకుండా వేరే కళా శాల ద్వారా పరీక్షలు రాసే అవకాశం కల్పించా లని డిమాండ్ చేశారు. లేకుంటే జీవీఎంసీ వద్ద భారీ ధర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు. కంచరపాలెం పోలీసుల అదుపులో నిందితుడు బాధితురాలు ఫిర్యాదు మేరకు కంచరపాలెం ఎస్ఐ ఉమ వెంకటేశ్వరరావు కేసు నమోదు చేశా రు. నిందితుడిని విచారిస్తున్నట్లు ఆయన తెలిపా రు. ఈ మేరకు నగర పోలీస్ కుమార్ మహేష్‌చంద్ర లడ్డా నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అతని ఆదేశాల మేరకు కంచరపాలెం పోలీసులు నిందితుడుపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల ప్రవర్తనపై విద్యార్థుల ఆగ్రహం ఫిర్యాదు తీసుకోకపోవడంతో టూ టౌన్ పోలీసులపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు నిందితుడికి కొమ్ము కాస్తున్నారని, అతడిని తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని బైఠాయించారు. మరోవైపు ఎస్ఐ మహేష్ విద్యార్థులకు అండగా ఉన్న అధ్యాపకుడు సురేష్ పట్ల దురుసుగా ప్రవర్తించడం, ఏ1గా సురేష్ పేరు పెడతామనడంతో పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. విషయం తెలుసుకున్న ఈస్ట్ ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి స్టేషన్ వద్దకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. సంఘటన జరిగింది కైలాసపురం అయినందున అది ఐదో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందన్నారు. నిందితుడిని, బాధితులను అక్కడకు పంపిస్తామన్నారు. బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకుని నిందితుడిని అరెస్ట్ చేస్తామని చెప్పడంతో విద్యార్థులు అక్కడి నుంచి నిష్క్రమించారు. అనంతరం విద్యార్థులు కళాశాల వద్దకు చేరుకుని ఫ్లెక్సీలను చించివేశారు. కళాశాల అద్దాలు పగలగొట్టటంతో పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థులను అక్కడి నుంచి పంపించి వేశా>రు. కళాశాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఆన్లైన్లో పాఠాలు
పశ్చిమగోదావరి ,ఏలూరు (ఆర్ఆర్ పేట) : ఉపాధ్యాయుల కొరతతో అభ్యసనంలో విద్యార్థులు వెనుకబడిపోతున్నారనే విమర్శలు ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా అనేక పాఠశాలల్లో ఈ పరిస్థితి నెలకొని ఉంది. అయితే ఉపాధ్యాయులతో సంబంధం లేకుండా విద్యార్థులు పాఠాలు నేర్చుకునే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరుగుతోంది. వర్చువల్ క్లాసెస్ అంటూ కేంద్ర ప్రభుత్వం విద్యా రంగంలో విన్నూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఒకేసారి జిల్లాలోని వివిధ పాఠశాలల్లో ఒకే తరగతికి చెందిన విద్యార్థులకు ఒకే పాఠాన్ని విడమరిచి విపులంగా బోధించే ప్రక్రియ అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో విజయవంతగా అమలు జరుగుతున్న ఈ విద్యా విధానాన్ని మన రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టింది. విద్యావ్యవస్థలో నూతన శకానికి నాందిగా ‘ఎర్నెట్’ సంస్థ ద్వారా ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఫిబ్రవరి నుంచి ప్రారంభం కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ఈ విద్యావిధానం జిల్లాలో గత ఫిబ్రవరి నెలలో ప్రారంభించారు. ఈ విధానంలో ప్రతి పాఠాన్ని ప్రత్యేకతలు కలిగిన నిష్ణాతులతో ఆన్లైన్ ద్వారా బోధిస్తారు. ఇప్పటివరకూ అమలులో ఉన్న డిజిటల్ క్లాసుల విధానంలో విద్యార్థులకు బోధించాల్సిన పాఠ్యాంశాలను ముందుగానే పొందుపరిచి ఉంచుతారు. కానీ ఈ వర్చువల్ క్లాసుల విధానంలో ఆన్లైన్లోనే అప్పటికప్పుడు పాఠ్యాంశాలను బోధిస్తారు. ఇందుకోసం ఎంపిక చేసిన పాఠశాలల్లో ఇప్పటికే కెమెరాలు, మానిటర్లు వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 67 పాఠశాలల్లో అమలు ఈ ఆన్లైన్ తరగతుల విధానం విద్యార్థులకు అందుబాటులో ఉంచడానికి జిల్లావ్యాప్తంగా ఉన్న 67 పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిలో 61 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉండగా, 6 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటన్నింటినీ నల్లజర్ల మండలం దూబచర్లలో ఉన్న డైట్ (జిల్లా విద్యాశిక్షణ సంస్థ) కళాశాలకు అనుసంధానం చేశారు. వర్చువల్ క్లాసులు డైట్ కళాశాల నుంచే నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పాఠ్యాంశాల షెడ్యూళ్లను నెలనెలా రూపొందించి ముందుగానే ఆయా పాఠశాలలకు అందచేస్తారు. ఆయా షెడ్యూళ్ల ప్రకారం వివిధ తరగతుల విద్యార్థులు శిక్షణకు సమాయత్తం అవుతారు. ఆండ్రాయిడ్ ఆప్షన్ తరహాలో.. జిల్లాలోని విద్యార్థులంతా ఒకేసారి వీక్షిస్తూ తమ అభిప్రాయాలను ఏకకాలంలో వెల్లడించే సౌలభ్యం ఈ విధానంలో అందుబాటులో ఉంది. రకరకాల బొమ్మలు, పలు రకాల ప్రయోగాలను చేసి చూపుతూ విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలిస్తూ, వారి అనుమానాలను నివృత్తి చేస్తూ సాగే ఈ విధానం విద్యార్థుల్లో కూడా ఆసక్తిని రేపుతోంది. ఆరో తరగతి నుంచి డీఎడ్ విద్యార్థుల వరకూ ఈ విధానంలో బోధన ఎంతో ఉపయోగకరంగా ఉంటోంది. ఈ తరగతుల పాఠాలను యూట్యూబ్‌లో పెడుతున్నందున విద్యార్థులు ఎప్పుడైనా, ఎక్కడైనా తమ మొబైళ్లలో కూడా చూసి తెలుసుకునే అవకాశంముంటుంది. ప్రధాన, అనుసంధాన కేంద్రాల్లో సౌకర్యాలిలా.. వర్చువల్ క్లాసుల నిర్వహణకు ప్రధాన కేంద్రాల్లో హెచ్డీ ప్రాజెక్టర్, 360 డిగ్రీల కెమెరా, బోధనకు డిజిటల్ వైట్‌బోర్డ్, కంప్యూటర్, వైసీడీసీఈ టెలివిజన్, యూపీఎస్, వేగవంతమైన ఇంటర్నెట్సర్వీస్ అందించే కేబుల్స్‌ను వినియోగిస్తారు. రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, చిత్తూరు ఈ మూడు జిల్లాల్లోని డైట్ కళాశాలలను ఎంపిక చేశారు. మిగిలిన డైట్ కళాశాలలు, జెడ్పీ కళాశాలల్లో మాత్రం వీటిలో సగం సామర్థ్యమున్న పరికరాలను ఏర్పాటు చేశారు. ప్రధాన కేంద్రాల్లోని పరికరాలకు రూ.6 లక్షలు, రిలే కేంద్రాల్లోని పరికరాలకు రూ.3 లక్షల విలువైన పరికరాలు అమర్చారు. లీనమవుతున్న విద్యార్థులు వర్చువల్ క్లాసుల్లో బోధించే పాఠ్యాంశాలతో విద్యార్థులు లీనమౌతున్నారు. ఈ విధానం వారిలో కొత్త ఆలోచనలను రేకెత్తిస్తోంది. వారికున్న సందేహాలను నిర్భయంగా అడిగి తెలుసుకుంటున్నారు. నెలకు సరిపడా షెడ్యూల్‌ను ముందుగానే సిద్ధం చేసి ఆయా పాఠశాలలకు పంపుతున్నాం. ప్రతి రోజూ రెండు సబ్జెక్టుల చొప్పున ఉదయం ఒక తరగతి విద్యార్థులకు, మధ్యాహ్నం నుంచి మరొక తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తున్నాం. కొన్ని సబ్జెక్టుల్లో విద్యార్థులు సాధారణ తరగతుల్లో కలిగిన సందేహాలను కూడా ఈ వర్చువల్ క్లాసుల్లో నివృత్తి చేసుకుంటున్నారు. ఇప్పటివరకూ 113 వర్చువల్ క్లాసులు నిర్వహించాం. – కె.చంద్రకళ, డైట్ కళాశాల ప్రిన్స్‌పాల్, దూబచర్ల -
కాలేజీ క్యాంటీన్లలో జంక్ ఫుడ్ నిషిద్ధం
వృత్తి విద్యా కాలేజీలకు ఏఐసీటీఈ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: వృత్తి విద్యా కాలేజీల్లో జంక్ ఫుడ్‌ను నిషేధించాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) స్పష్టం చేసింది. జంక్‌ఫుడ్ తినడం వల్ల విద్యార్థులు ఒబెసిటీతోపాటు ఇతర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని, అందుకే కాలేజీ క్యాంటీన్లలో, ఆవరణలో జంక్ ఫుడ్‌ను విక్రయించడానికి, వండటానికి వీల్లేదని పేర్కొంది. ఈ నిబంధనను తమ పరిధిలోని అన్ని ఇంజనీరింగ్, ఫార్మసీ, నర్సింగ్, మేనేజ్మెంట్ కాలేజీ యాజమాన్యాలు కచ్చితంగా అమలు చేయాలని వెల్లడించింది. కాలేజీల ఆవరణలో విక్రయించే ఆహార పదార్థాలను ఆయా యాజమాన్యాలే నియంత్రించాలని, విద్యార్థులు వాటిని తినకుండా చూడాల్సిన బాధ్యత కాలేజీలదేనని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న 10 వేల కాలేజీల్లో ఈ నిబంధనల అమలుకు యాజమాన్యాలు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించింది. దీనిని రాష్ట్రంలో 500కు పైగా ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్, నర్సింగ్ కాలేజీ యాజమాన్యాలు అన్నీ అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. సిగరెట్, గుట్కా, డ్రగ్స్ నిషేధం విద్యాలయాల ఆవరణలో సిగరెట్, గుట్కా, డ్రగ్స్ నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలని ఏఐసీటీఈ పేర్కొంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దెబ్బతీసే పదార్థాలు కాలేజీల ఆవరణలో ఉండటానికి వీల్లేకుండా చర్యలు చేపట్టాలని సూచించింది. వాటిని వినియోగించకుండా విద్యా ర్థులకు అవగాహన కల్పించాలని పేర్కొంది. కాలేజీల్లోని ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ యూనిట్ల నేతృత్వంలో విస్తృత అవగాహన , ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని వివరించింది.