సింఫెరోపోల్: రష్యా ఆక్రమిత క్రిమియా బుధవారం కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఇక్కడి కెర్చ్ పట్టణంలో ఉన్న ఒకేషనల్ కాలేజీలో ఓ విద్యార్థి విధ్వంసం సృష్టించాడు. బాంబు పేల్చి, తర్వాత విచక్షణారహితంగా తుపాకీతో గుళ్లవర్షం కురిపించాడు. ఈ ఘటనలో కాలేజీలోని 19 మంది ప్రాణాలు కోల్పోగా, 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన రష్యన్ ఇన్వెస్టిగేటివ్ కమిటీ అధికారులు.. కాల్పులకు పాల్పడింది కళాశాలలో నాలుగో ఏడాది చదువుతున్న వ్లాదిల్సవ్ రోస్ల్యకోవ్ (18)గా గుర్తించారు.
కాల్పుల ఘటన అనంతరం కళాశాల లైబ్రరీలో బుల్లెట్ గాయాలతో రోస్ల్యకోవ్ మృతదేహం కనిపించింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం ఈ దారుణం జరిగింది. కాల్పులు జరిపిన అనంతరం రోస్ల్యకోవ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. దాడి సందర్భంగా రోస్ల్యకోవ్ కాలేజీలోకి వస్తూనే బస్సుపై కాల్పులు జరిపాడు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ప్రమాదంపై స్పందిస్తూ.. ‘బాంబు పేలడం కారణంగానే ఎక్కువ మంది చనిపోయారు. ఇది కాల్పుల ఘటన మాత్రమే.. ఉగ్రదాడి ఎంతమాత్రం కాదు’ అని తెలిపారు. ఇక్కడి టీచర్లు చాలా చెడ్డవారని, వారిపై పగ తీర్చుకుంటానని రోస్ల్యకోవ్ చెప్పేవాడని మరో విద్యార్థి వెల్లడించాడు.
Comments
Please login to add a commentAdd a comment