మాస్కో: రష్యాలోని పెర్మ్ నగరంలోని విశ్వవిద్యాలయం సోమవారం కాల్పులతో దద్దరిల్లింది. దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆరుగురు చనిపోగా మరో 28 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. దుండగుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పులకు తెగబడింది వర్సిటీ విద్యార్థేనని రష్యా దర్యాప్తు కమిటీ తెలిపింది. ఘటనకు కారణాలను వెల్లడించలేదు. కాల్పుల చప్పుళ్లకు కొందరు విద్యార్థులు భయపడి భవనం రెండో అంతస్తులోని కిటికీల నుంచి కిందికి దూకుతున్న దృశ్యాలు స్థానిక వార్తా చానెళ్లు ప్రసారం చేశాయి.
కాల్పుల సమాచారం అందుకున్న ఘటనా స్థలికి ముందుగా చేరుకున్న ట్రాఫిక్ పోలీసులపైకి దుండగుడు కాల్పులు తెగబడ్డాడు. ప్రతిగా పోలీసులు జరిపిన కాల్పుల్లో అతడు గాయపడ్డాడని, నిరాయుధుడిని చేసి అదుపులోకి తీసుకున్నట్లు అంతరంగిక శాఖ వెల్లడించింది. పెర్మ్ యూనివర్సిటీలో మొత్తం 12వేల మంది చదువుకుంటుండగా ఘటన సమయంలో సుమారు 3వేల మంది ఉన్నట్లు అంచనా. వర్సిటీలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులంతా క్షేమంగానే ఉన్నారని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఈ ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment