పశ్చిమగోదావరి ,ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : ఉపాధ్యాయుల కొరతతో అభ్యసనంలో విద్యార్థులు వెనుకబడిపోతున్నారనే విమర్శలు ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా అనేక పాఠశాలల్లో ఈ పరిస్థితి నెలకొని ఉంది. అయితే ఉపాధ్యాయులతో సంబంధం లేకుండా విద్యార్థులు పాఠాలు నేర్చుకునే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరుగుతోంది. వర్చువల్ క్లాసెస్ అంటూ కేంద్ర ప్రభుత్వం విద్యా రంగంలో విన్నూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఒకేసారి జిల్లాలోని వివిధ పాఠశాలల్లో ఒకే తరగతికి చెందిన విద్యార్థులకు ఒకే పాఠాన్ని విడమరిచి విపులంగా బోధించే ప్రక్రియ అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో విజయవంతగా అమలు జరుగుతున్న ఈ విద్యా విధానాన్ని మన రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టింది. విద్యావ్యవస్థలో నూతన శకానికి నాందిగా ‘ఎర్నెట్’ సంస్థ ద్వారా ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు.
ఫిబ్రవరి నుంచి ప్రారంభం
కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ఈ విద్యావిధానం జిల్లాలో గత ఫిబ్రవరి నెలలో ప్రారంభించారు. ఈ విధానంలో ప్రతి పాఠాన్ని ప్రత్యేకతలు కలిగిన నిష్ణాతులతో ఆన్‌లైన్ ద్వారా బోధిస్తారు. ఇప్పటివరకూ అమలులో ఉన్న డిజిటల్ క్లాసుల విధానంలో విద్యార్థులకు బోధించాల్సిన పాఠ్యాంశాలను ముందుగానే పొందుపరిచి ఉంచుతారు. కానీ ఈ వర్చువల్ క్లాసుల విధానంలో ఆన్‌లైన్‌లోనే అప్పటికప్పుడు పాఠ్యాంశాలను బోధిస్తారు. ఇందుకోసం ఎంపిక చేసిన పాఠశాలల్లో ఇప్పటికే కెమెరాలు, మానిటర్లు వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు.
జిల్లాలో 67 పాఠశాలల్లో అమలు
ఈ ఆన్‌లైన్ తరగతుల విధానం విద్యార్థులకు అందుబాటులో ఉంచడానికి జిల్లావ్యాప్తంగా ఉన్న 67 పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిలో 61 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉండగా, 6 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటన్నింటినీ నల్లజర్ల మండలం దూబచర్లలో ఉన్న డైట్ (జిల్లా విద్యాశిక్షణ సంస్థ) కళాశాలకు అనుసంధానం చేశారు. వర్చువల్ క్లాసులు డైట్ కళాశాల నుంచే నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పాఠ్యాంశాల షెడ్యూళ్లను నెలనెలా రూపొందించి ముందుగానే ఆయా పాఠశాలలకు అందచేస్తారు. ఆయా షెడ్యూళ్ల ప్రకారం వివిధ తరగతుల విద్యార్థులు శిక్షణకు సమాయత్తం అవుతారు.
ఆండ్రాయిడ్ ఆప్షన్ తరహాలో..
జిల్లాలోని విద్యార్థులంతా ఒకేసారి వీక్షిస్తూ తమ అభిప్రాయాలను ఏకకాలంలో వెల్లడించే సౌలభ్యం ఈ విధానంలో అందుబాటులో ఉంది. రకరకాల బొమ్మలు, పలు రకాల ప్రయోగాలను చేసి చూపుతూ విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలిస్తూ, వారి అనుమానాలను నివృత్తి చేస్తూ సాగే ఈ విధానం విద్యార్థుల్లో కూడా ఆసక్తిని రేపుతోంది. ఆరో తరగతి నుంచి డీఎడ్ విద్యార్థుల వరకూ ఈ విధానంలో బోధన ఎంతో ఉపయోగకరంగా ఉంటోంది. ఈ తరగతుల పాఠాలను యూట్యూబ్‌లో పెడుతున్నందున విద్యార్థులు ఎప్పుడైనా, ఎక్కడైనా తమ మొబైళ్లలో కూడా చూసి తెలుసుకునే అవకాశంముంటుంది.
ప్రధాన, అనుసంధాన కేంద్రాల్లో సౌకర్యాలిలా..
వర్చువల్ క్లాసుల నిర్వహణకు ప్రధాన కేంద్రాల్లో హెచ్‌డీ ప్రాజెక్టర్, 360 డిగ్రీల కెమెరా, బోధనకు డిజిటల్ వైట్‌బోర్డ్, కంప్యూటర్, వైసీడీసీఈ టెలివిజన్, యూపీఎస్, వేగవంతమైన ఇంటర్నెట్‌సర్వీస్ అందించే కేబుల్స్‌ను వినియోగిస్తారు. రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, చిత్తూరు ఈ మూడు జిల్లాల్లోని డైట్ కళాశాలలను ఎంపిక చేశారు. మిగిలిన డైట్ కళాశాలలు, జెడ్పీ కళాశాలల్లో మాత్రం వీటిలో సగం సామర్థ్యమున్న పరికరాలను ఏర్పాటు చేశారు. ప్రధాన కేంద్రాల్లోని పరికరాలకు రూ.6 లక్షలు, రిలే కేంద్రాల్లోని పరికరాలకు రూ.3 లక్షల విలువైన పరికరాలు అమర్చారు.
లీనమవుతున్న విద్యార్థులు
వర్చువల్ క్లాసుల్లో బోధించే పాఠ్యాంశాలతో విద్యార్థులు లీనమౌతున్నారు. ఈ విధానం వారిలో కొత్త ఆలోచనలను రేకెత్తిస్తోంది. వారికున్న సందేహాలను నిర్భయంగా అడిగి తెలుసుకుంటున్నారు. నెలకు సరిపడా షెడ్యూల్‌ను ముందుగానే సిద్ధం చేసి ఆయా పాఠశాలలకు పంపుతున్నాం. ప్రతి రోజూ రెండు సబ్జెక్టుల చొప్పున ఉదయం ఒక తరగతి విద్యార్థులకు, మధ్యాహ్నం నుంచి మరొక తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తున్నాం. కొన్ని సబ్జెక్టుల్లో విద్యార్థులు సాధారణ తరగతుల్లో కలిగిన సందేహాలను కూడా ఈ వర్చువల్ క్లాసుల్లో నివృత్తి చేసుకుంటున్నారు. ఇప్పటివరకూ 113 వర్చువల్ క్లాసులు నిర్వహించాం. – కె.చంద్రకళ, డైట్ కళాశాల ప్రిన్స్‌పాల్, దూబచర్ల