జీలుగుమిల్లి వ్యవసాయ కార్యాలయంలో అన్నదాత సుఖీభవ దరఖాస్తులు ఆన్‌లైన్ చేస్తున్న దృశ్యం
ఎన్నికలకు రెండునెలల ముందు తెలుగుదేశం ప్రభుత్వం రైతులపై ప్రేమ నటిస్తూ ‘అన్నదాత సుఖీభవ’ పథకం ప్రవేశ పెట్టింది. రైతుల వెబ్ ల్యాండ్ ఖాతా నంబరు, ఆధార్‌కు ఎకౌంట్ నంబరు అనుసంధానం ఆధారంగా లబ్ధిదారులకు నగదు జమ చేస్తోంది. అయితే ఈ పథకంలో అర్హులమాట ఎలా ఉన్నా.. సెంటు భూమి లేని వారు, స్కూల్ పిల్లలు లబ్ధిదారుల జాబితాలో ఉండటం విస్మయానికి గురిచేస్తోంది.
సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి, ఏలూరు/జీలుగుమిల్లి: భూమి ఉండి వ్యవసాయం చేసుకునే చాలామంది రైతులు సుఖీభవ పథకం సొమ్ముల కోసం వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు. భూములు ఉండి వ్యవసాయం చేసేవారి పేర్లు జాబితాలో లేకపోవడంతో వ్యవసాయ అధికారులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. నగదు పడిన జాబితాలో కాని, పడాల్సిన జాబితాలో కాని చాలామంది భూములు ఉన్న రైతుల పేర్లు లేవు.ఉద్యోగులూ, మైనర్లూ రైతులే.. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో రైతులను ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు సొమ్ములు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. అయితే ఇది ఒక పద్ధతి లేకుండా ఇష్టం వచ్చిన రీతిలో చేస్తున్నారు. ఉద్యోగుల ఖాతాల్లోనూ ‘అన్నదాత సుఖీభవ’ పథకం సొమ్ములుజమ చేస్తున్నారు. అంతే కాకుండా మైనర్లు (18 సంవత్సరాలు కూడా నిండని వారు) కూడా రైతులే అని లెక్క తేల్చారు. వారి ఖాతాల్లోనూ సొమ్ములు జమ చేస్తున్నారు. ఈ పథక నిబంధనల్లో రిటైర్డ్ ఉద్యోగులకు ఎటువంటి సొమ్ములు జమకావని చెప్పినా ఆ నిబంధనలనూ తుంగలోకి తొక్కేస్తున్నారు.
ఒకే కుటుంబంలో ఎందరికో
వాస్తవానికి అన్నదాత సుఖీభవ పథకంలో ఒక కుటుం బాన్ని యూనిట్‌గా తీసుకుని కుటుంబంలో ఒక్కరికి మాత్రమే సొమ్ములు జమ చేయాల్సి ఉంది. అయితే అవేమీ చూడకుండానే ఒకే కుటుంబంలో ఇద్దరు, ముగ్గురి ఖాతాల్లో సొమ్ములు జమ చేసి లబ్ధి చేకూరుస్తున్నారు.
ఆర్‌టీజీఎస్ అసలు సమస్యా..?
ఆర్‌టీజీఎస్ ద్వారానే సమస్య ఏర్పడుతుందనీ, దీని కారణంగానే నిధులు దుర్వినియోగం అవుతున్నాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీని కారణంగానే రైతులు కాకపోయినా నేరుగా రిజర్వ్ బ్యాంకుతో అనుసంధానం కారణంగా నిధులు బ్యాంకు ఖాతాలకు జమ అవుతున్నాయని చెబుతున్నారు. కనీసం వ్యవసాయాధికారులు అర్హులైన వారిని గుర్తించేందుకు కానీ, క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేందుకు కానీ ఎటువంటి అవకాశం ఇవ్వకపోవడంతో అర్హులకు నిధులు చేకూరడం లేదని తెలుస్తోంది.
ఆధార్ సీడింగ్‌లో అవకతవకలు
అన్నదాత సుఖీభవ పథకానికి వెబ్‌ల్యాండ్‌లో ఆధార్ నెంబరు సీడింగ్ అయిన వారినే ప్రభుత్వం లబ్ధిదారులుగా గుర్తించింది.
జిల్లాలో మొత్తం 4,70,433 మంది రైతులు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వీరు కాక భూములు ఉండి కంప్యూటరీకరణ కాని వారు, ఆధార్ లింక్ కాని వారు, కౌలు రైతులు అనేక మంది ఉన్నారు. ప్రభుత్వం మాత్రం 3,10,700 మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం నగదు జమ చేసింది. భూములున్న రైతులకు ఆధార్ నంబర్లు సీడింగ్ చేయడంతో అధికారులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడంతో ఈ పథకం కింద లబ్ధిదారుల జాబితాలో భూమిలేని వారి పేర్లు, స్కూలు పిల్లల పేర్లు వచ్చాయని తెలుస్తోంది. కొన్ని చోట్ల అర్హులైన రైతుల సొమ్ములు వేరొకరి ఖాతాకు జమ కావడానికి కూడా ఇదే కారణమని రెవెన్యూ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
భూముల కంప్యూటరీకరణ కాకుంటే...
ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల సాగులో ఉన్న భూములకు గాని, పోడు భూములకు గాని ఈ పథకం వర్తించడం లేదు. అదే విధంగా భూములు ఉండి సాగు చేసుకునే రైతుల భూములు కంప్యూటరీకరణ కాని కారణంగా ఈ పథకం పలువురు రైతులకు దరి చేరలేదు.
అనర్హులకు నగదు జమ
పోలవరం ప్రాజెక్టు భూసేకరణకు జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, వేలేరుపాడు, కుక్కునూరులో భూములు అమ్ముకున్న రైతులకు అన్నదాత సుఖీభవ నగదు జమ అయింది. అదే వి«ధంగా చింతలపూడి ఎత్తిపోతల కాలువలో భూములు కోల్పోయిన రైతులకు కూడా ఈ పథకంలో నగదు జమ చేశారు.
భూ వివరాలు ఆన్‌లైన్ చేసినా డబ్బు రాలేదు
నా బ్యాంకు ఖాతాలో అన్నదాత సుఖీభవ పథకం నగదు పడలేదు. నగదు పడని జాబితాలో కూడా నా పేరు లేదు. నా భూమికి ఆన్‌లైన్ చేశాను. అడంగల్, ఒన్ బి అన్నీ ఉన్నా నాకు నగదు జమ కాలేదు. మరి ఈ పథకం ఎవరి కోసం పెట్టినట్టో తెలియడం లేదు. కాళ్ళు అరిగేలా కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నా ఎవరూ సమాధానం చెప్పడం లేదు.– తెల్లం రాముడు, గిరిజన రైతు, వంకవారిగూడెం
నా భూమికి వేరే ఆధార్ నంబరు సీడింగ్ చేశారట
నాకు సర్వే నెంబరు 169–1లో 3.18 సెంట్లు భూమి ఉంది. ఇందులో ఆయిల్‌పామ్ తోట ఉంది. అన్నదాత సుఖీభవ పథకం కింద నగదు నాకు రాలేదు. అయితే మా గ్రామంలోనే సెంటు భూమి లేని మరో రైతు ఎకౌంట్‌లో మాత్రం నగదు పడ్డాయి. నా భూమికి అతను ఆధార్ నెంబరు సీడింగ్ చెయ్యడం వల్ల నగదు అతనికి జమయ్యాయని తెలుస్తోంది.– బుద్దా వీర్రాజు, రైతు, పి.నారాయణపురం
ఉన్నతాధికారులకు రిమార్కులు రాసి పంపుతున్నాం
అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల జాబితాలో భూమిలేని వ్యక్తుల పేర్లు, స్కూలు పిల్లల పేర్లు వచ్చాయి. వాటికి రిమార్క్స్ రాసి పంపుతున్నాం. సుఖీభవ పథకానికి అర్హత ఉండీ జాబితాలో పేరు లేని వారు చాలా మంది ఉన్నారు. వారిò దరఖాస్తులపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం.– కుంజా పార్వతి, వ్యవసాయ అధికారి జీలుగుమిల్లి
ఇప్పటి వరకూ 3.7లక్షల మందికి అందించాం
వాస్తవానికి జిల్లా వ్యాప్తంగా ఐదు ఎకరాల లోపు 4.60 లక్షల కుటుంబాలుఉన్నట్లు గుర్తించాం. ఈ మేరకు ఇప్పటి వరకూ 3.7 లక్షల మంది ఖాతాల్లోసొమ్ములు జమ అయ్యాయి. మిగిలిన వారికి వారి సమస్యలు పరిష్కారం అయ్యాక జమ చేస్తున్నాం. ఆర్‌టీజీఎస్ ద్వారా సొమ్ములు బదిలీ అవుతున్నాయి. ఈనేపథ్యంలో అర్హులకు మాత్రమే నిధులు బదిలీ అవుతాయి తప్ప అనర్హులకుబదిలీ కావు.– గౌసియా బేగం, వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment