ఇంత అవినీతి ఎక్కడా లేదు | Corruption in sitampet ITDA | Sakshi
Sakshi News home page

ఇంత అవినీతి ఎక్కడా లేదు

Published Thu, Jul 17 2014 3:04 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

ఇంత అవినీతి ఎక్కడా లేదు - Sakshi

ఇంత అవినీతి ఎక్కడా లేదు

 సీతంపేట: ‘‘ సీతంపేట ఐటీడీఏలో ఉన్నంత అవినీతి ప్రపంచంలో ఎక్కడా లేదు. గత ఐదేళ్లుగా దీనిని భ్రస్టు పట్టించారు, గిరిజనుల అభివద్ధికి ప్రభుత్వం తరుపున వస్తున్న పథకాలు సక్రమంగా అమలు చేయడంలేదు. ఒకరిద్దరు ఉద్యోగులపై చర్యలు తీసుకుంటే గానీ ఇక్కడి వ్యవస్థ బాగుపడదు’’ అంటూ రాష్ట్ర కార్మిక, క్రీడలశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఐటీడీఏ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక పీఎంఆర్‌సీలో బుధవారం ఐటీడీఏ పథకాలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. గిరిజన సంక్షేమశాఖ ద్వారా చేపడుతున్న పనుల్లో నాణ్యతా లోపాలు ఉన్నా.
 
 గామాభివృద్ది కమిటీల(వీటీడీఏ) ముసుగులో బినామి కాంట్రాక్టర్లు పనులు చేయడంతో నాణ్యత లోపిస్తుందన్నారు. కొంతమంది ఇంజినీర్లు కూడా కాంట్రాక్టర్ల అవతారమెత్తుతున్నారన్నారని ఈ మాట వాస్తవమా కాదా అని మంత్రి ఇంజనీరింగ్ ఈఈ శ్రీనివాసరావును నిలదీయగా నిజమేనని ఆయన అంగీకరించారు. వీటీడీఏలకు ఆర్ధిక స్తోమత లేకపోతే టెండర్లు పిలవాలని, బినామీలు పనులు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మాట్లాడుతూ రూ.49 కోట్లతో 204 రోడ్లు గతంలో మంజూరు చేశారని పనులకు సంబందించి కొన్ని రోడ్లుకు రూ.25 లక్షలకు నామినేషన్ ఇచ్చారన్నారు. ఇప్పటివరకు ప్రారంభంకాని రోడ్లను రద్దు చేయాలన్నారు. బంద చెరువుపై పూర్తి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
 
 ఎస్‌ఎంఐ పనులపై విచారణకు జేసీ నియామకం...
 ఐటీడీఏ ద్వారా జరుగుతున్న ఎస్‌ఎంఐ (స్మాల్ మైనర్ ఇరిగేషన్) పనుల్లో చెరువులు, చెక్‌డ్యాంల నిర్మాణాల్లో నాణ్యత, పర్యవేక్షణ పూర్తిగా లోపించిందని మంత్రి అచ్చెన్న ఆగ్రహించారు. ఈ శాఖపై అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. నందిగాం మండలంలో ఒకే ఒక పనిచేశారు, ఆ పనికి ఎంత ఖర్చు చేశారని ఈఈ ఎం.వీ.రమణను ప్రశ్నించగా ఆయన సమాధానం చెప్పలేకపోయారు. ఎమ్మెల్యే కలమట మాట్లాడుతూ తామరగడలో 50 సెంట్లు విస్తీర్ణంలో చెరువు ఉంటే ఆ చెరువులో మూడు చెక్‌డ్యాంలు ఎందుకు నిర్మించారని ప్రశ్నించారు. ఎస్‌ఎంఐ పనులపై పూర్తిస్థాయిలో విచారణ చేసి పదిరోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరగా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ దీనిపై జేసీ వీరపాండియన్‌ను విచారణాధికారిగా నియమిస్తున్నట్లు తెలిపారు.
 
 ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం..
 ఏనుగులను ఇక్కడి నుంచి తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని, దీనికి శాశ్వత పరిష్కారం చూపిస్తామని మంత్రి అచ్చెన్న హామీ ఇచ్చారు. ఈవిషయమై సీఎంతో కూడా చర్చించామన్నారు. వీఎస్‌ఎస్‌ల పనితీరుపై ప్రభుత్వ విప్ కూన రవికుమార్ డీఎఫ్‌వో విజయ్‌కుమార్‌తో చర్చించారు. గతంలో వీరఘట్టంలో ఏనుగుల దాడిలో నాగరాజు అనే విలేకరి మృతి చెందాడని ఆ కుటుంబానికి కేవలం రూ.లక్ష మాత్రమే ఇచ్చారని ఎమ్మెల్యే కలమట తెలిపారు. రెండున్నర ఎకరాల భూమి, ఉద్యోగం ఇచ్చేలా ఆ కుటుంబానికి గతంలో మంత్రి హామీ ఇచ్చారని ఆ హామీ నెరవేరలేదని డీఎఫ్‌వోను ఎమ్మెల్యే ప్రశ్నించారు.
 వైద్యులు స్థానికంగా ఎందుకు
 
 నివాసం ఉండడంలేదు.. ?
 వైద్యులు స్థానికంగా ఎందుకు ఉండడంలేదంటూ డీఎంఅండ్‌ెహ చ్‌వో గీతాంజలీ, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో జె.కృష్ణమోహన్‌ను మంత్రి అచ్చెన్న ప్రశ్నించారు. వైద్యుల పోస్టులు త్వరగా భర్తీ చేయూలని, అవసరమైతే హెల్త్ కమిషనర్‌తో మాట్లాడుతానని అచ్చెన్న అన్నారు.  పాలకొండలో మత్తుమందు డాక్టర్‌ను నియమించాలని జెడ్‌పీటీసీ దామోదర్ కోరారు. పాతపట్నం పీహెచ్‌సీలో ఒకే ఒక డాక్టర్ ఉంటే డెప్యుటేషన్ ఎందుకు వేశారని ఎమ్మెల్యే కలమట ప్రశ్నించారు. మంత్రి అచ్చెన్న కలుగజేసుకుని పీహెచ్‌సీల్లో అన్ని డెప్యుటేషన్లను రదు ్దచేయాలన్నారు. విద్యాశాఖపై నిర్వహించిన చర్చలో బాలికల వసతి గృహాల్లో మరుగుదొడ్లు లేక ఎక్కడెక్కడ ఇబ్బందులు పడుతున్నారో నివేదిక ఇవ్వాలని,
 
 వసతిగృహాల్లో మెనూ సక్రమంగా లేదని ఎప్పటికప్పుడు సందర్శించి ప్రక్షాళన చేయూలని పీవో సత్యనారాయణ, గిరిజన సంక్షేమ శాఖ డీడీ కొమరం నాగోరావుకు ఆదేశించారు.బెల్టు షాపులను ఏజెన్సీలో నిర్మూలించాలని ఎక్సైజ్ అధికారులకు ఆదేశించారు. అనంతరం ఐకేపీతో పాటు ఇతర శాఖలపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ధనలక్ష్మి, నరసన్నపేట, ఇచ్చాపురం ఎమ్మెల్యేలు బగ్గులక్ష్మణరావు, బెందాలం అశోక్, పాలకొండ, టెక్కలి ఆర్డీవోలు తేజ్‌భరత్, శ్యాంసుందర్, జెడ్‌పీ కోఆప్షన్ సభ్యులు ముఖలింగం, పాలకొండ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ నిమ్మక జయకృష్ణ, వివిధ మండలాల జెడ్‌పీటీసీలు, ఎంపీపీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement