కౌంట్ డౌన్ షురూ | Count down | Sakshi
Sakshi News home page

కౌంట్ డౌన్ షురూ

Published Fri, Feb 13 2015 3:27 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

Count down

రేపటి నుంచే ప్రపంచకప్ మ్యాచ్‌లు
 నెల్లూరు(క్రైమ్): ప్రపంచకప్ క్రికెట్‌కు కౌంట్‌డౌన్ షురూ అయింది. కోట్లాది అభిమానులను ఉర్రూతలూగించే పండగ మరో 48 గంటల్లో ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఈసారి అభిమానులు అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈసారి ఏ దేశం జగజ్జేతగా నిలిచి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంటుందోనని ఇప్పటినుంచే పెద్దఎత్తున బెట్టింగ్‌లు మొదలయ్యాయి. బ్యాట్స్‌మన్ కొట్టే బౌండరీలు, సిక్స్‌లు, బౌలర్ తీసే ప్రతి వికెట్‌పై రూ. కోట్లలో బెట్టింగ్‌లు నిర్వహించేందుకు బుకీలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. బుకీలకు అధికారపార్టీ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే బెట్టింగ్‌లపై ఉక్కుపాదం మోపేందుకు జిల్లా పోలీసు యంత్రాగం సిద్ధమైంది. ఫిబ్రవరి 14న మ్యాచ్‌లు ప్రారంభమై మార్చి 29న ముగియనున్నాయి.
 
  సుమారు 44 రోజుల పాటు నిరాటంకంగా మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలిమ్యాచ్ శ్రీలంక, న్యూజి లాండ్ జట్ల మధ్య జరగనుంది. రెండో మ్యాచ్ ఈనెల 15న పాకిస్తాన్, ఇండియాల నడుమ జరగనుంది. ఈ మ్యాచ్‌పై ఇప్పటికే అభిమానుల అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. అలాగే కప్ విజేత విషయమై కొందరు సౌతాఫ్రికా అని...ఇంకొందరు ఆస్ట్రేలియా అని....మరికొందరు జగజ్జేతగా భారత్ ప్రపంచకప్‌ను మరోసారి కైవసం చేసుకొంటుందని భారీ అంచనాలతో ఉన్నారు.
 పల్లెలను తాకిన బెట్టింగ్ సంస్కృతి
 ఇప్పటినుంచే ప్రపంచకప్ కైవసం చేసుకొనే జట్లపై బెట్టింగ్‌లు పెట్టేందుకు కొం దరు సిద్ధమవుతున్నారు. ఇదే అదనుగా భావించిన బుకీలు చక్రం తిప్పి జేబులు నింపుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన కొందరు ప్రధాన బుకీలు ఇతర రాష్ట్రాల్లో మకాం వేసి జిల్లాలోని అన్నీ ప్రధాన కేంద్రాల్లో సబ్ బుకీలను ఏర్పాటు చేసుకొని బెట్టింగ్ లు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు.
 
 వీరికి అధికారపార్టీతో పాటు కొందరు పోలీసు సిబ్బంది అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత 20-20 వరల్డ్‌కప్‌లోనే పట్టణాలతో పాటు పల్లెలను తాకిన బెట్టింగ్ సంస్కృతి ప్రస్తుతం రెట్టింపయ్యే అవకాశం ఉంది. ఆనందంగా వీక్షించాల్సిన ప్రపంచకప్ పోటీలను సొమ్ముచేసుకొనేందుకు బుకీలు పావులు కదుపుతున్నారు. ప్రారంభంలో ఓ మోస్తరుగా మొదలైన బెట్టింగ్‌లు ఫైనల్ దగ్గరపడేకొద్దీ భారీస్థాయికి చేరవచ్చని పోలీసులు సైతం ఆందోళనవ్యక్తం చేస్తున్నారు.
 
 సిద్ధమవుతున్న హోటల్స్, బార్‌లు...
 ప్రపంచకప్ క్రికెట్ పోటీలు 44రోజుల పాటు జరగనున్నాయి. అందివచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకొనేందుకు హోటల్స్, బార్లు సిద్ధమవుతున్నాయి. హోటల్స్, బార్లలో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. అంతేకాకుండా ప్రత్యేక ఆఫర్లను సైతం ఇస్తున్నాయి. గతంలో బెట్టింగ్‌లు హోట ల్స్, బార్లలో జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు క్రికెట్ మ్యాచ్‌ల ప్రసారాలను వాటిలో నిలిపివేశారు. దీంతో కొద్దిమేర బెట్టింగ్‌లు తగ్గుముఖం పట్టాయి. అయితే తర్వాత పోలీసుల పట్టుసడలించడంతో తిరిగి బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి.
 
 తల్లిదండ్రుల్లో ఆందోళన...
 ప్రపంచకప్ క్రికెట్‌తో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. క్రికెట్ పోటీలు జరిగే సమయంలోనే టెన్త్ పరీక్షలు రావడం విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. క్రికెట్ పిచ్చి ఉన్న విద్యార్థులు ఆవైపే ఎక్కువ దృష్టిసారించే ప్రమాదం ఉంది.
 
 బెట్టింగ్‌లపై ఉక్కుపాదం....
 బెట్టింగ్‌లపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసు అధికారులు చర్యలు చేపట్టారు.  గతంలో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతూ పోలీసులకు పట్టుబడిన వారి వివరాలను సేకరించి వారందరినీ అదుపులోకి తీసుకుంటున్నారు. వారిని తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేయిస్తున్నారు. దీంతోపాటు ప్రధాన బుకీలుగా చెలామణి అయ్యే వ్యక్తులు, సబ్ బుకీల జాబితాను సిద్ధం చేసి వారిపై నిఘా ఉంచుతున్నారు.  బెట్టింగ్‌ల సమాచారం ఉంటే డయల్ 100కు లేదా, 9494626644కు సమాచారం అందించాలని పోలీసు ఉన్నతాధికారులు కోరుతున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement