మన ఐకాన్.. త్రిష!
అంతర్జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లోరాణిస్తున్న క్రీడాకారిణి
భద్రాద్రి నుంచి భారత జట్టు వరకు పయనం
ఏషియా కప్‌లో ప్రతిభ.. ప్రపంచ్ కప్‌కు ఎంపిక
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఫిబ్రవరి 2 వరకు మలేషియాలో జరగబోయే ఇంటర్నేషనల్ ఉమెన్ అండర్ – 19, టీ 20 వరల్డ్ కప్ పోటీలకు జిల్లాకు చెందిన గొంగడి త్రిష ఎంపికైంది. 2022లో దక్షిణాఫ్రికాలో జరిగిన టోర్నీలోనూ ఆమె తనదైన ప్రతిభ చాటింది.
ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ..
ఈనెల 15న పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఒత్తిడికి గురైన త్రిష ఓపెనర్‌గా దిగి పరుగులేమీ చేయకుండానే డకౌట్ అయ్యింది. ఆ తర్వాత పసికూన నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 17 పరుగులతో నాటౌట్‌గా నిలిచి క్రీజులో లయను అందుకుంది. తర్వాత జరిగిన బంగ్లాదేశ్, శ్రీలంక మ్యాచ్‌లలో వరుసగా 58 నాటౌట్, 32 పరుగులతో రాణించింది. చివరగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విలువైన 52 పరుగులు జోడించి, భారత్ గెలుపులో కీలకంగా మారింది. దీంతో ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డులు తన ఖాతాలో వేసుకుంది.
శిక్షణలో రాటుదేలి..
సికింద్రాబాద్‌లో ఇప్పించిన ప్రత్యేక శిక్షణలో రాటుదేలిన త్రిష 12 ఏళ్ల వయసులోనే అండర్ – 19 హైదరాబాద్ జట్టుకు ఎంపికై ంది. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ అండర్ –19 ఇండియా జట్టుకు ఎంపికై దక్షిణాఫ్రికాలో జరిగిన టోర్నమెంట్‌లో పాల్గొంది. ఆ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. బ్యాటింగ్‌తో పాటు లెగ్ స్పిన్నర్‌గా టోర్నీ గెలుపులో త్రిష తనవంతు పాత్రను సమర్థంగా పోషించింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు భారత ఏ జట్టులో ఆడుతూ సీనియర్ జట్టులో చోటు కోసం శ్రమిస్తోంది.
భద్రాచలం టు సికింద్రాబాద్..
భద్రాచలానికి చెందిన గొంగడి రామిరెడ్డి ఫిట్‌నెస్ ట్రైనర్‌గా ఐటీసీలో పని చేస్తూనే పట్టణంలో సొంతంగా రామ్స్ జిమ్ నిర్వహించేవారు. అంతర్జాతీయ స్థాయిలో క్రికెటర్‌గా రాణించాలనే ఆయన కల నెరవేరలేదు. అయితే ఆ లోటు తీర్చేందుకు అన్నట్టుగా కూతురు త్రిష చిన్నతనం నుంచే క్రికెట్‌పై ఆసక్తి చూపించింది. దీంతో క్రికెట్‌ను కెరీర్‌గా మలచాలని భావించిన రామిరెడ్డి ఉత్తమ శిక్షణ కోసం సికింద్రాబాద్‌కు మకాం మార్చాలని నిర్ణయించుకున్నారు. అలా త్రిషకు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడే ఐటీసీలో ఫిట్‌నెన్ ట్రైనర్ ఉద్యోగానికి రాజీనామా చేసి, పట్టణంలో ఉన్న జిమ్ సెంటర్‌ను అమ్మేసి 2013లో రాష్ట్ర రాజధానికి చేరుకున్నారు. అక్కడ సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో కోచింగ్ మొదలైంది.
ఐపీఎల్ లెగ్ బ్రేక్..
భద్రాచలం నుంచి సికింద్రాబాద్ వెళ్లింది మొదలు రెండేళ్ల క్రితం వరకు క్రికెట్‌లో త్రిష ప్రయాణం ఎదురులేకుండా సాగింది. హైదరాబాద్ అండర్ – 19 నుంచి భారత ఏ జట్టు వరకు ప్రయాణం సాఫీగా సాగింది. అయితే క్రికెట్ వరల్డ్‌లో క్రేజీ టోర్నమెంట్‌గా పేరున్న ఉమెన్ ఐపీఎల్ త్రిషకు కలిసి రాలేదు. ఈ టోర్నీ కోసం జరిగిన వేలంలో త్రిషను తీసుకునేందుకు ఐపీఎల్ యాజమాన్యాలు ఆసక్తి చూపించలేదు. దీంతో టోర్నమెంట్ గెలుపులో తాను ఒకరిగా ఉండడం కంటే మెరుగైన ప్రదర్శన చేయడమే మేలనే నిర్ణయానికి వచ్చింది. కఠోర సాధన చేసింది. దాని తాలూకూ ఫలితాలు ఈ డిసెంబర్‌లో జరిగిన అండర్ 19, టీ 20 ఏషియా కప్ టోర్నమెంట్‌లో కనిపించాయి.
ఎన్నికల ప్రచారకర్తగా..
తెలంగాణ ఎన్నికల సంఘం గొంగడి త్రిషను ఐకాన్‌గా గుర్తించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎలక్షన్ ఐకాన్‌గా, ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ ఐకాన్‌గా పని చేసింది. 2023లో తెలంగాణ ఉమెన్ అవార్డును రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వీకరించింది. ఈ విజయ పరంపరను ఇలాగే కొనసాగిస్తూ త్వరలోనే ఇండియన్ ఉమెన్ క్రికెట్‌లో సీనియర్ జట్టుకు ఆడాలని జిల్లా వాసులు ఆకాంక్షిస్తున్నారు.
ఇండియా జట్టుకు ఆడాలి
అండర్ –19 విభాగంలో మూడేళ్లుగా భారత జట్టుకు ఆడుతున్నా. ఇటీవల భారత ఏ జట్టుకు వైస్ కెప్టెన్‌గా కూడా ఆడాను. ఏషియా కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ రావడం, ఆ కప్ దేశానికి అందించడం సంతోషాన్ని ఇచ్చింది. ఇండియా మహిళల జట్టుకు ఆడాలన్నదే నా లక్ష్యం.
– గొంగడి త్రిష
Comments
Please login to add a commentAdd a comment