నెల్లూరురూరల్, న్యూస్‌లైన్ : నగరంలోని లేక్యూకాలనీలో పదో వీధిలో బద్దెపూడి శ్రీనివాసులు ఇంట్లో నకిలీ వ్యవహారం బట్టబయలు కావడంతో ఒక్కొక్కటిగా నకిలీలు వెలుగు చూస్తున్నాయి. నగర శివారుప్రాంతంలో నివేశ స్థలాల ధరలు ఆకాశాన్నంటడంతో పేద, మధ్యతరగతి వారికి సొంతింటి కల నెరవేర్చుకోవడం నానాటికి కరువవుతోంది. పేదల ఆశలను కొందరు దళారులు సొమ్ము చేసుకుంటున్నారు.
నకిలీ పట్టాలు అధికారులకు చిక్కడంతో దళారుల వద్ద తాము తీసుకున్న నివేశ స్థలాల పట్టాలు, భూముల పట్టాలు బోగస్ అని వెల్లడవడంతో లబోదిబోమంటున్నారు. వరదకాలువలు, పంట కాలువలు, ప్రభుత్వ శివాయి భూములకు నకిలీ పట్టాలు సృష్టించి అధికారుల నుంచి ఇప్పిస్తున్నట్టు దళారులు నమ్మబలికి అందినంత దోచుకుంటున్నారు.
నకిలీ గుట్టురట్టు కావడంతో తాము మోసపోయినా బయటకు చెప్పుకోలేక అంతర్మథనం చెందుతున్నారు. కొత్తూరు పరిధిలోని చంద్రబాబునగర్, ఎన్‌జీఓ లేఅవుట్, శ్రామికనగర్ వద్ద ఉన్న నెల్లూరు చెరువుకు వెళ్లే వరదకాలువ, రవిచంద్ర గిరిజనకాలనీ సమీపంలోని కనుపూరుకాలువ పోరంబోకు స్థలాలకు కొందరు దళారులు ఒక్కొక్క పట్టాకు రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేశారు. ఎవరైనా పట్టాలపై సందేహాలు వ్యక్తం చేసినా తహశీల్దార్ కార్యాలయం వద్దకు వెళ్లి వాటిని చూపించుకోండంటూ తెలివిగా తప్పించుకు తిరిగేవారు. కొత్తూరు, కల్లూరుపల్లి, పడారుపల్లి, ఆమంచర్ల, కొండాయపాళెం తదితర ప్రాంతాల్లో నకిలీ పట్టాలు వెలుగుచూస్తున్నాయి.
తహశీల్దార్ కార్యాలయంలోని కొందరు కిందిస్థాయి సిబ్బందికి నకిలీ పట్టాలు తయారీ ముఠాతో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. వీరు పరోక్షంగా ముఠా సభ్యులకు తోడ్పాటు అందించటం, దీనికితోడు అధికారపార్టీ అండదండలు మెండుగా ఉండటంతో నకిలీ పట్టాల తయారీదారులు యథేచ్ఛగా చెలరేగిపోయారు. నగర శివారు ప్రాంతాల్లో ఏ స్థలానికి అధికారులు ధ్రువీకరించిన పట్టా ఉందో, ఏ పట్టా నకిలీదో తెలుసుకోలేని సంకటస్థితిలో స్థలాల యాజమానులు కొట్టుమిట్టాడుతున్నారు.
అధికారపార్టీ నాయకుల ఒత్తిళ్లతో అధికారులు నకిలీ పట్టాల తయారీదారులను తప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టు విమర్శలున్నాయి. ఉన్నతస్థాయిలో విచారణ చేపట్టి నకిలీ పట్టాలతయారీ ముఠా గుట్టును బహిర్గతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయమై తహశీల్దార్ నరసింహులను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా తమ కార్యాలయ సిబ్బంది దళారులకు సహకరించిన విషయం తనకు తెలియదన్నారు. పరారీలో ఉన్న బద్దెపూడి శ్రీనివాసులు పోలీసులకు దొరికితే వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు.
నకిలీలలు కోకొల్లలు
Published Thu, Jan 2 2014 3:22 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement