కదులుతున్న డొంక
నగర పాలక సంస్థలో నకిలీ డీడీల బాగోతం
అనంతపురం న్యూసిటీ/క్రైం : నగర పాలక సంస్థలో నకి లీ డీడీల డొంక కదులుతోంది. ఈ నెల 8న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు జానకి, బోయ గిరిజమ్మ తమ డివిజన్‌లలో నకిలీ డీడీలు వేశారంటూ కమిషనర్ చల్లా ఓబులేసుకు ఫిర్యాదు చేశారు. రూ.10 లక్షల వర్కులకు సంబంధించి విజయబ్యాంకు పేరు మీద డీడీలు తీశారన్నారు. నకిలీ డీడీలు సృష్టించిన లక్ష్మినారాయణ, చంద్రశేఖర్, ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదు చేయాలన్నారు. దానిపై ఎస్‌ఈ సురేంద్రబాబు విచారణ చేయగా నకిలీగా తేలాయి. దీంతో కమిషనర్ చల్లా ఓబులేసు.. టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండ్రోజుల క్రితమే టూటౌన్ పోలీసులు నకిలీ డీడీలతో ప్రమేయం ఉన్న లక్ష్మినారాయణ, చంద్రశేఖర్, ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.
మేయర్ మదమంచి స్వరూప బావ రాజశేఖర్ ప్రమేయంతోనే ఈ వ్యవహారం చోటు చేసుకుందన్న వార్తలు వినబడుతున్నాయి. సోమవారం పోలీసులు మేయర్ బావను విచారించారని తెలియడం ఈ వార్తకు బలం చేకూరుస్తోంది. మేయర్ బంధువుపైనే విమర్శలు రావడంతో ప్రతిపక్ష, వామపక్ష పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని దుమ్మెత్తిపోస్తున్నాయి. దీనిపై కలెక్టర్, ఎస్పీ చొరవ చూపాలని డిమాండ్ చేస్తున్నాయి.
మేయర్ బావపై ఆరోపణలు వస్తుండడంతో ఇందులో మేయర్ పాత్ర ఏమైనా ఉందా అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ విషయం నగరపాలక సంస్థలో చర్చనీయాంశమైంది. ఏదిఏమైనా నకిలీ డీడీల వ్యవహారం మేయర్ మెడకు చుట్టుకుంటోందన్న వార్తలు వినబడుతున్నాయి.
పోలీసుల అదుపులో మేయర్ బంధువు
నకిలీ డీడీల కుంభకోణంలో మేయర్ కుటుంబ సభ్యుడు రాజశేఖర్‌ను టూటౌన్ పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ కుంభకోణంలో ఇప్పటికే ఇంటర్‌నెట్ సెంటర్‌కు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. విచారణలో భాగంగా వారు వెల్లడించిన వివరాల మేరకు... మేయర్ కుటుంబ సభ్యుడైన రాజశేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. రాజశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నప్పటి నుండి మేయర్ వర్గంలో ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది. మరోవర్గం వారు సన్నిహితంగా ఉంటూనే ఈ వ్యవహారంలో రాజశేఖర్‌ను ఇరికించారని మేయర్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.