
మృత్యువులోనూ...ఒకరికి ఒకరై
‘నాతిచరామి’ అనే మంత్రం పఠించి వివాహబంధంతో ఒక్కటయ్యే దంపతులు..ఎంతమంది ఆ మంత్రానికి కట్టుబడి ఉంటున్నారో తెలియదు కానీ..నిరక్షరాస్యులైన ఈ దంపతులు మాత్రం అచ్చంగా కట్టుబడి ఉన్నారని చెప్పొచ్చు. కష్టసుఖాల్లో ఒకరికి ఒకరై దాంపత్య జీవనం సాగించిన ఆ దంపతులు మరణంలోనూ ఒకరిని ఒకరు వీడలేదు. విద్యుత్ అనే మృత్యువు ఒడిలో ఇద్దరూ కలిసే కన్నుమూశారు. పాడిగేదెను పెంచుకుంటూ కుటుంబ జీవనాన్ని సాగిస్తున్న వ్యవసాయ కూలీ దంపతులు పచ్చగడ్డి కోయడానికి కలిసి వెళ్లి తిరిగిరాని లోకాలకు కూడా ఒక్కటిగా చేరుకోవడంతో ఆ దంపతులు నివసిస్తున్న గ్రామమంతా ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది.
చినబోగిలి (సీతానగరం): సీతానగరం మండలంలోని చినబోగిలి గ్రామానికి చెందిన జరజాపు కృష్ణ (65), జరజాపు కాంతమ్మ (58) దంపతులు పచ్చగడ్డి కోసం ఆదివారం మధ్యాహ్నం తామరఖండి రెవెన్యూ పరిధిలో గల జె.కమలాకర్‌ప్రసాద్ చెరుకుమడిలో కి వెళ్లారు. గ్రామం నుంచి తామరఖండి వైపు వెళ్తు న్న హెచ్‌టీ విద్యుత్ లైను సిమెంటు స్తంభం ఇటీవ ల గాలులకు వాలిపోయి ఉంది, ఈ నేపథ్యంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి బురదమయమైన నేలలో విద్యుత్ స్తంభం పట్టుతప్పి ఆది వారం నేలకూలింది. నేలకొరిగిన స్తంభానికి అమర్చిన విద్యుత్ వైర్లు సమీపంలో పచ్చగడ్డి కోస్తున్న కృష్ణ, కాంతమ్మ దంపతులపై పడడంతో వారిద్దరికీ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయాన్ని పొలం యజమాని గుర్తించి గ్రామంలోని పెద్దలకు, మృతుల కుటుంబీకులకు తెలియజేశారు. మృతుల కుటుంబీకులు జీవనోపాధికోసం ఇతర రాష్ట్రానికి వెళ్లి జీవనం గడుపుతుండడంతో వారి మనుమరాలు (కొడుకు కుమార్తె)రాగి ణితోపాటు సమీప బంధువులందరూ సంఘటనా స్థలానికి చేరుకుని భోరున విలపించారు. అనంత రం సీతానగరం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఏస్సై దాసు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి కేసు నమోదు చేశారు.
జీవనోపాధి కోసం చెన్నై వెళ్లిన మృతుల పిల్లలు
విద్యుత్ తీగలు తగిలి మృతిచెందిన దంపతులకు నలుగురు సంతానం. వారిలో కుమారుడు మరియదాసు, కుమార్తెలు ముగ్గురితోపాటు వారి కుటుంబ సభ్యులంతా జీవనోపాధికోసం కొంతకాలం క్రితం చెన్నై వలసవెళ్లారు. ఇటీవలే కుమారుడు మరియదాసు తన కూతురు రాగిణిని తల్లిదండ్రులకు సహాయకురాలిగా విడిచి పెట్టి, వారికి ఓ పాడి గేదెను సమకూర్చి చెన్నై వెళ్లాడు. పాడిగేదెకు పచ్చగడ్డికోసం వెళ్లి దంపతులు మృతి చెందారని కుటుంబసభ్యులకు గ్రామస్తులు సమాచారాన్ని అందజేయడంతో వారు ఆగమేఘాలమీద చెన్నై నుంచి స్వగ్రామానికి పయనమయ్యారు.
విద్యుత్‌శాఖాధికారుల నిర్లక్ష్యం
మండలంలోని పంట పొలాల్లో వందలాది విద్యుత్ కనెక్షన్లు ఉన్నప్పటికీ ఆ శాఖాధికారులు నిర్లక్ష్యధోరణి అవలంబించడంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. కాంట్రాక్టర్ విద్యుత్ లైన్లు అమర్చినప్పుడు సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇటీవల విద్యుత్ స్తంభం ఎక్కిన ఓ వ్యక్తి షాక్‌కు గురై మృతిచెంది నెల రోజులు గడవకముందే తాజాగా విద్యుత్ వైర్లు తగిలి దంపతులు మృతి చెందా రు. పొలాల్లో విద్యుత్‌వైర్లు వేలాడుతున్నాయని వందలాది మంది రైతులు ఫిర్యాదులు చేస్తున్నా సంబంధిత ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం పట్ల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరుకు మడులలో చేతులకు అందేంత ఎత్తులో వైర్లు వేలాడుతున్నాయని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బందిని విద్యుత్ శాఖ నియమించకపోవడంతో సమస్య ఉత్పన్నమవుతోందని, ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదంటూ విద్యుత్ వినియోగదారు లు వాపోతున్నారు. ఇప్పటికైనా విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు వ్యవసాయ పంపుసెట్లకు సరఫరా అవుతున్న విద్యుత్‌లైన్లను పరిశీలించి సత్వర చర్యలు చేపట్టకపోతే మరిన్ని పెనుప్రమాదాలు సంభవించే పరిస్థితి లేకపోలేదని రైతులు వాపోతున్నారు.