
ఇంకానా..ఇకపై సాగదు
‘మాఫియా’ అంటే.. చట్టబద్ధమైన యంత్రాంగాల్ని ‘ఇసుక రేణువంత’ ఖాతరు చేయని నేరవ్యవస్థ. అలాంటి వ్యవస్థీకృత నేర కార్యకలాపాలకు సీతానగరం మండలంలోని ఏటిపట్టు (గోదావరి తీర) గ్రామాలు కొన్ని నెలలుగా విలవిల్లాడిపోతున్నాయి. అందుకు కారణమైన ఇసుక మాఫియాకు చట్టసభల ప్రతినిధులు, అధికారులే అండగా నిలవడంతో.. జనం గోడు ‘గోదావరి వరదహోరులో చిన్న పరిగె ఘోష’ మాదిరి ఎవరికీ పట్టలేదు. చివరికి.. వారి సహనానికి గండి పడింది. ఆగ్రహం వెల్లువెత్తి, ఇసుక రవాణాను ముంచెత్తింది.
సీతానగరం (రాజానగరం) :సీతానగరం మండలంలోని ఏటిపట్టు గ్రామాల నుంచి ఇష్టారాజ్యంగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణాపై ప్రజలు తిరగబడ్డారు. సింగవరం వద్ద గోదావరిలో తవ్విన ఇసుకను తరలిస్తున్న లారీల్ని గురువారం ఉదయం నుం చి అడ్డుకున్నారు. దీనితో పురుషోత్తపట్నం, పాపికొండలు, పోశమ్మ గండి వెళ్లే యాత్రికులు, ప్రయాణికులు, రాజమండ్రి ఆర్టీసీ డిపో నుంచి వచ్చే బస్సులు, స్కూల్ బస్సులు, ఆటోలు బారులు తీరి నిలిచిపోయాయి. పోలీసులు ఆందోళనకారులను శాంతింపజేసేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. మిగిలిన వాహనాలను విడిచిపెట్టిన ఆందోళనకారులు.. రాత్రయినా ఇసుక లోడుతో ఉన్న వాహనాలను కదలనివ్వలేదు.
మండలంలో కొందరు రైతులకు వారి లంక భూముల్లో మేట వేసిన ఇసుకను రవాణా చేసుకునేందుకు గనుల శాఖ అనుమతులు ఇచ్చింది. వాటిని అడ్డుపెట్టుకుని.. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారుల అండదండలతో ఇసుక మాఫియా నాలుగు నెలలుగా ఇసుకను అక్రమంగా తవ్వి, అమ్ముకుంటూ నిత్యం కోట్లు గడిస్తోంది. ఈ మొత్తం నుంచి అనేకులకు వాటాలందిస్తోంది. నిత్యం సామర్థ్యానికి మించి ఇసుకను నింపుకొని, వెళుతున్న వెయ్యికి పైగా వాహనాలతో రాజమండ్రి-సీతానగరం ప్రధాన రహదారి, పురుషోత్తపట్నం, పోశమ్మగండి ఆలయాలకు వెళ్లే రోడ్లు ఛిద్రమయ్యాయి. ప్రయాణం ప్రయాసభరితంగా మారడమే కాక ఇసుక వాహనాల మితిమీరిన వేగంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డెక్కాలన్నా, పిల్లలను ఆటోల్లో స్కూళ్లకు పంపాలన్నా హడలిపోవాల్సి వస్తోంది. దీనిపై గతంలో ఆందోళనలు, ఫిర్యాదులు చేసినా.. మాఫియాకు అధికార పార్టీ పెద్దలు, ఉన్నతాధికారుల అండ ఉండడంతో ఏటిపట్టు గ్రామాల వారి మొర ఎవరికీ పట్టలేదు.
పిడికిలి బిగించిన అయిదు ఊళ్లు..
ఈ నేపథ్యంలో ‘రోజూ భయపడి బతికే కన్నా.. తిరగబడితే మేలు’ అనుకున్న సింగవరం గ్రామస్తులు మూడు రోజుల క్రితం ఇసుక లారీల్ని ఆపి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అయినా ఇసుక మాఫియా ఖాతరు చేయకపోవడంతో గురువారం ఉదయం నుంచి ఆ ఊరి వద్ద ఆ గ్రామస్తులతో పాటు రామచంద్రాపురం, పురుషోత్తపట్నం, వంగలపూడి, సీతానగరం ప్రజలు ఇసుక లారీల్ని అడ్డుకున్నారు. పోలీసులు ఆందోళన మానాలని కోరినా తహశీల్దారు వచ్చి తమ సమస్యలకు సమాధానం చెప్పేవరకు విరమించబోమని నినదించారు. ఇసుక వాహనాలతో పాటు మిగిలిన వాహనాల్నీ నిలిపివేయడంపై ఇరుగుపొరుగు గ్రామాల వారి మధ్య గొడవ జరిగింది. సీతానగరం ఎస్సై పవన్‌కుమార్ చేసిన ప్రయత్నం విఫలం కాగా.. చివరకు వారే ఒక నిర్ణయానికి వచ్చి ఇసుకలారీలు మినహా మిగిలిన వాటిని వదిలేశారు. కాగా సబ్ కలెక్టర్ విజయరామరాజు సింగవరం వచ్చి ఇసుక తవ్వకాలు జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. ఆందోళనకారులు ఆయనకు ఇసుక అక్రమ రవాణాతో ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి విముక్తి కలిగించి, ప్రశాంతంగా జీవించేలా చూడాలని కోరారు. పరిశీలించి, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన సబ్ కలెక్టర్ సంబంధిత ఫైళ్లను తనకు పంపాలని తహశీల్దారును ఆదేశించారు.
కాగా అయిదు గ్రామాల వారి ఆందోళనతో ఇసుక అక్రమ రవాణా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇసుక మాఫియా ప్రతినిధులు ముగ్గళ్ల, మునికూడలి, తొర్రేడు ప్రాంతాలకు వెళ్లి అటు నుంచి ఇసుక కోసం వచ్చే లారీలను నిలిపివేయించారు. చీకటి పడి, ఆందోళనకారులు ఇళ్లకు వెళ్లాక లారీల్ని ఇసుక తవ్వకాల వద్దకు తీసుకువెళ్లి లోడు చేయించాల న్నది వారి ఆలోచన. అయితే గురువారం రాత్రి 9 గంటల సమయంలోనూ ఆందోళనకారులు సింగవరంలోనే ఉండి లారీలను కదలనివ్వడం లేదు. దాంతో మాఫియా ప్రతినిధులు ఇసుక కోసం వచ్చిన లారీల్ని ఓ ప్రైవేట్ పాఠశాల ప్రాంగణంలోకి తరలిస్తున్నారు.
మాఫియా వెనుక ప్రజాప్రతినిధులు,అధికారులు..
ఇసుక మాఫియా తమ ప్రాంతంలోని లంక భూముల్లో నిత్యం వేలాది లారీల ఇసుకను అక్రమంగా తవ్వుకుంటూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తోందని స్థానికులు అన్నారు. అక్రమ ఇసుక దందాను అడ్డుకోవాల్సిన ప్రభుత్వం మెతకగా వ్యవహరిస్తోందని, కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులే మాఫియాకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణాతో కోట్లాది రూపాయల వ్యయంతో వేసిన ఏటిపట్టు రోడ్డు పూర్తిగా పాడైపోయిందని, సింగవరంలోని నాగరత్నం కాలనీవద్ద రూ.40 లక్షల వ్యయంతో వేసిన కల్వర్టు కూలిపోయిందని రామచంద్రపురానికి చెందిన రైతు సంఘం నేత కలగర బాలకృష్ణ, సొసైటీ అధ్యక్షుడు గుర్రం ఉదయ్‌భాస్కర్, కోడేబత్తుల వెంకటదొరాజీ, మాచిన శ్రీరామకృష్ణ, కోడేబత్తుల సోమరాజు, యలమాటి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా అధికారులు నామమాత్రంగానైనా స్పందించలేదని విమర్శించారు.