విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న అర్బన్ ఎస్పీ ఐశ్వర్య రస్తోగి
సాక్షి, రాజమహేంద్రవరం రూరల్: రాజానగరం, సీతానగరం పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన రెండు హత్య కేసులను గంటల వ్యవధిలోనే ఛేదించి, నిందితులను అరెస్టు చేశామని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్యా రస్తోగీ తెలిపారు. మినీ వ్యాన్ డ్రైవర్ హత్య కేసులో ముగ్గురిని, వృద్ధురాలి హత్య కేసులో ఇద్దరిని అరెస్టు చేశామని, నిందితుల్లో ఇద్దరు బాల నేరస్తులున్నారని వివరించారు. తన కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం..
వేలిముద్రే పట్టించింది
పిఠాపురానికి చెందిన మినీ వ్యాన్ డ్రైవర్ ఒగ్గు నాగేంద్ర (32) ఈ నెల 26న తాడేపల్లిగూడెం వెళ్లి కమలా ఫలాల లోడు వేసుకుని తిరిగి వెళుతున్నాడు. తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో నన్నయ యూనివర్సిటీ సమీపానికి వచ్చేసరికి ఆ వ్యాన్‌ను రాజమహేంద్రవరం శంభూనగర్‌కు చెందిన మద్ది వెంకట సాయి (వెంకట్), కడియం మండలం వేమగిరికి చెందిన తూము ముత్యాలు, ఓ బాల నేరస్తుడు కలిసి ఆపారు. నాగేంద్రను బెదిరించి డబ్బులు, సెల్‌ఫోన్ లాక్కొనేందుకు ప్రయత్నించారు. అతడు ప్రతిఘటించడంతో ముద్దాయిలు చాకులతో అతడిపై దాడి చేసి, తీవ్రంగా గాయపరచి పరారయ్యారు. జీఎస్‌ఎల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాగేంద్ర మృతి చెందాడు. ఈ కేసును రాజానగరం ఇన్‌స్పెక్టర్ ఎంవీ సుభాష్ క్షుణ్ణంగా దర్యాప్తు చేశారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఓ నిందితుడి వేలిముద్రల ఆధారంగా 48 గంటల్లో ఈ కేసు మిస్టరీని ఛేదించారు. ముద్దాయిలను ఆదివారం అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు. నాగేంద్రను హత్య చేసిన తరువాత నిందితులు విశాఖకు పారిపోయారు. తిరిగి వస్తూ కత్తిపూడిలో ఓ స్కూటర్ దొంగిలించారు. వారి నుంచి ఒక మోటార్ సైకిల్, ఒక స్కూటర్, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిల్లో మద్ది వెంకట సాయిపై చోరీ కేసులతో పాటు సస్పెక్ట్ షీటు కూడా ఉంది. అలాగే తూము ముత్యాలుపై ఒక కేసు, బాల నేరస్తుడిపై రెండు కేసులు ఉన్నాయి. ఈ కేసును చాకచక్యంగా విచారించి, నిందితులను అరెస్టు చేసిన ఇన్‌స్పెక్టర్ సుభాష్, క్లూస్ టీం ఎస్సై ప్రవీణ్, ఎస్సైలు ఎండీ జుబేర్, సుధాకర్, హెడ్ కానిస్టేబుళ్లు రమణ, ఎం.ప్రసాద్, కానిస్టేబుళ్లు బి.విజయకుమార్, కె.పవన్‌కుమార్, సూరిబాబు, ఆర్‌వీ రమణ, ఎన్.రాంబాబులను ఎస్పీ అభినందించి, ప్రశంసాపత్రాలు అందజేశారు.
చదవండి: (ఊరి చివర పాడుబడిన బావిలో పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య)
తాగి తందనాలాడుతుంటే తిడుతోందని..
సీతానగరం మండలం వంగలపూడిలో ఈ నెల 24న జరిగిన కోదేళ్ల నాగమ్మ అలియాస్ చింతాలమ్మ (72) హత్య కేసు మిస్టరీని కూడా పోలీసులు ఛేదించారు. నాగమ్మ మృతదేహంపై గాయాలుండటంతో ఆమె బంధువు కొండయ్య ఫిర్యాదు మేరకు సీతానగరం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. వివిధ కోణాల్లో విచారించినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ పరిస్థితుల్లో పదో తరగతి చదువుతున్న ఓ బాలుడు ఇచ్చిన ముఖ్య సమాచారం ఆధారంగా వంగలపూడికే చెందిన యువకుడు ఇండుగుమిల్లి నవీన్‌ను, ఓ బాల నేరస్తుడిని వీఆర్‌వో ద్వారా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని తమదైన శైలిలో విచారించారు. ప్రతి రోజూ మద్యం తాగి ఊళ్లో బలాదూర్‌గా తిరుగుతున్న వీరిని నాగమ్మ తరచూ అసభ్య పదజాలంతో తిట్టేది.
ఈ నెల 24న పుట్టిన రోజు సందర్భంగా మద్యం తాగి వస్తున్న వారిద్దరినీ చూసిన నాగమ్మ తీవ్రమైన పదజాలంతో దూషించింది. ఈ నేపథ్యంలో ఆమెను చంపాలని నిందితులిద్దరూ నిర్ణయించుకున్నారు. వెంటనే నాగమ్మ ఇంట్లోకి వెళ్లి చెంబుతో ఆమె ముఖంపై కొట్టారు. ఆమె ఇంట్లోనే ఉన్న గునపంతో ఆమె ఛాతి మీద బాది హతమార్చారు. నిందితులను అరెస్టు చేసి, కోర్టుకు తరలించారు. వృద్ధురాలి హత్యకు వారు ఉపయోగించిన చెంబు, గునపం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులలో ప్రతిభ చూపిన కోరుకొండ ఇన్‌స్పెక్టర్ పీఈ పవన్‌కుమార్‌రెడ్డి, సీతానగరం ఎస్సై కె.శుభశేఖర్, కానిస్టేబుళ్లు పి.రాము, ఎస్.ప్రసాద్, సీహెచ్ గోవిందు, బి.వెంకటేష్‌లను ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. విలేకర్ల సమావేశంలో శాంతిభద్రతల ఏఎస్పీ లతామాధురి, నార్త్‌జోన్ డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు కూడా పాల్గొన్నారు.
చదవండి: (భార్య మరో వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతోందని ఉరేసి చంపి.. ఏమీ ఎరగనట్లు!)
Comments
Please login to add a commentAdd a comment