విశాఖ (లీగల్) : ముగ్గుర్ని హత్య చేసిన దంపతులకు యావజ్జీవ జైలు శిక్ష, రూ.5,000 జరిమానా విధిస్తూ నగరంలోని నాల్గవ అదనపు జిల్లా న్యాయమూర్తి గుత్తుల గోపి శుక్రవారం తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఏడాది సాధారణ జైలు శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి ఆ తీర్పులో పేర్కొన్నారు. కేసు వివరాలను అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నమ్మి సన్యాసిరావు ఇలా వివరించారు. నిందితులు యనమల చిన్నారావు, అతని భార్య చిన్న ఎలియాస్ రేఖ శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం మాకవరం గ్రామానికి చెందిన వారు.
మృతులు కివిటి లక్ష్మీనారాయణ , భార్య మహాలక్ష్మి వారి కుమార్తె ధన కూడా ఆ గ్రామస్తులే. లక్ష్మీనారాయణ మొదటి భార్య చనిపోవడంతో నేరం జరగటానికి పదిహేనేళ్ల ముందు మహాలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరికి సంతోష్, ధన సంతానం. మొదటి నిందితుడు చిన్నారావు లక్ష్మీనారాయణకు అల్లుడు. నిందితురాలు రేఖ మొదటి భార్య కుమార్తె. వీరందరూ హైదరాబాద్‌లో భవన నిర్మాణ కార్మికులుగా పని చేసేవారు. ఏడాది క్రితం లక్ష్మీనారాయణ మొదటి భార్య కుమారై బోడమ్మ భవనం కూలిన ప్రమాదంలో మృతి చెందింది. పరిహారంగా రూ. 2లక్షలు వచ్చాయి.
అందులో రూ. 50 వేలు తనకు ఇవ్వాలని అతను కోరాడు. దీంతో కక్ష పెంచుకున్న చిన్నారావు, రేఖ ఎలాగైనా కుటుంబాన్ని అంతం చేయాలని పథకం సిద్ధం చేశారు. నేరం జరగడానికి మందు రోజు అందరూ సింహాచలం వచ్చారు. శ్రీకృష్ణా లాడ్జిలో బస చేశారు. 2010 జూన్ 5న ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రి పథకం ప్రకారం అందరూ నిద్రిస్తున్న సమయంలో లక్ష్మీనారాయణ, మహాలక్ష్మిని అతి కిరాతకంగా హత్య చేసి శవాలను మాయం చేశారు. మర్నాడు చిన్నారులు సంతోష్, ధన తమ తల్లిదండ్రులు ఏరీ అని అడగటంతో వారు మాకవరం వెళ్లినట్లు చెప్పారు.
అనంతరం పిల్లల్ని గాజువాక తీసుకు వెళ్లారు. అక్కడ ఇద్దర్ని హత్య చేసేందుకు యత్నించారు. ఈ పథకంలో సంతోష్ కొన ఊపిరితో బయటపడ్డాడు. ధన మృతి చెందింది. సంచలనం సృష్టించిన ఈ కేసును గోపాలపట్నం పోలీసు ఇన్‌స్పెక్టర్ యు.రవి ప్రకాష్ దర్యాప్తు చేశారు. నేరం రుజువు కావడంతో హత్యా నేరానికి యావజ్జీవం, హత్యాయత్నానికి ఏడేళ్లు, సాక్ష్యాలను తారుమారు చేసినందుకు ఏడేళ్లు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.
దంపతులకు యావజ్జీవం
Published Sat, Feb 27 2016 12:24 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
Advertisement