రక్షకుడే.. భక్షకుడు | Court constables take bribe in chittoor | Sakshi
Sakshi News home page

రక్షకుడే.. భక్షకుడు

Published Fri, Jul 21 2017 6:41 AM | Last Updated on Tue, Mar 19 2019 6:01 PM

రక్షకుడే.. భక్షకుడు - Sakshi

రక్షకుడే.. భక్షకుడు

పోలీస్‌.. వృత్తిపై నిబద్ధత, క్రమశిక్షణ, నిష్పక్షపాతం, హుందాతనం, నిందితులతో మర్యాదగా మసులుకోవాల్సిన ఉద్యోగం. నైతికత, నియమాల పాటింపులో పదిమందికి ఆదర్శంగా నిలవాలి. అయితే ఇవన్నీ పక్కన పెట్టి అవినీతి, అక్రమాలకు పాల్పడడమే లక్ష్యంగా సాగుతున్నారు కోర్టు కానిస్టేబుళ్లు కొందరు. రక్షకుడే భక్షకుడై బాధితులను పీక్కుతింటున్నారు. పోలీసు శాఖకు మచ్చతెస్తున్నారు.

∙క్రిమినల్‌ కేసుల్లో చక్రం తిప్పుతున్న కోర్టు కానిస్టేబుళ్లు
∙నిందితులకు భరోసానిస్తూ మామూళ్లు వసూలు


పలమనేరు: బాధితుల అమాయకత్వమే పెట్టుబడి.. వారి బలహీనతే ఆదాయంగా మార్చుకుని నిత్యం రూ.వేలు ఆర్జిస్తున్నారు జిల్లాలోని కొందరు రాటుదేలిన కానిస్టేబుళ్లు. ఏదో కోర్టు కానిస్టేబులే కదా.. ఇదో చిన్న వ్యవహారం అనుకుంటే పప్పులో కాలేసినట్టే. చిన్నపాటి పెట్టీ కేసుల నుంచి నాన్‌ బెయిలబుల్‌ కేసుల దాకా వారు చక్రం తిప్పుతున్నారు. చేసేది తప్పు కాబట్టి ఈ దోపిడీపై కక్షిదారులు సైతం నోరుమెదపడం లేదు.

వాయిదా రోజు సంబంధిత కోర్టు కానిస్టేబుల్‌ను ప ట్టించుకోకుంటే ఆ రోజు వాయిదా కోసం సాయంత్రం దాకా కోర్టు వద్ద వేచి ఉండాల్సిందే. ఇలా ప్రతి విషయంలోనూ వీరు జోక్యం చేసుకుని రోజుకు నాలుగురాళ్లు వెనకేసుకుంటున్నారు. అత్యవసర పరిరస్థితుల్లోనూ వీరు సెలవులు పెట్టరంటే వీరికి ఈ ఉద్యోగం ఎం త లాభదాయకమో మరి.

వీరి విధులు ఇలా..
జిల్లాలోని ప్రతి పోలీస్‌ స్టేషన్‌కు కోర్టు కేసుల నిమిత్తం ఓ కానిస్టేబుల్‌ను నియమించారు. స్టేషన్‌లో నమోద య్యే కేసుల వివరాలను కోర్టుకు అప్పగించడం, చార్జి షీట్లను కోర్టుకు చేర్చడం, వాయిదాలను నోట్‌ చేసుకోవడం, కోర్టు జారీ చేసే ఆదేశాలను సంబంధిత పీఎస్‌ఎస్‌హెచ్‌వోకు తెలియజేయడం, చిన్నకేసులో జరి మానాలను కోర్టులో కట్టించడం, పీటీ వారెంట్లలో నిం దితులను కోర్టుకు తీసుకెళ్లడం తదితర పనులను చేయాల్సి ఉంటుంది.

జరుగుతున్న దందా ఇలా..
చిన్న నేరాలతో కోర్టులో కట్టే జరిమానాలు రూ.200 నుంచి రూ.500 అయితే కోర్టు పనులంటూ నిందితుల నుంచి కనీసం రూ.2 వేలు గుంజుతుంటారు. పేకాట, ట్రాన్స్‌పోర్ట్‌ చట్టం కేసులు, మద్యం తాగి పట్టుబడిన వారు తదితర కేసుల్లో అక్రమ వసూళ్లు సాగుతున్నాయి. ఇక క్రిమినల్‌ కేసుల్లో బాధితులకు సంబంధిత కోర్టులోని ఏపీపీ న్యాయవాదిగా ఉండగా నిందితులకు ప్రైవేటు వకీళ్లు వకాలత్‌ వేస్తుంటారు.

ఇలాంటి కేసులో అటు ప్రభుత్వ న్యాయవాదికి, ఇటు నిందితుని న్యాయవాదికి కోర్టు కానిస్టేబుళ్లు మధ్యవర్తులుగా ఉంటూ రెం డు చేతులా సంపాదించుకుంటున్నారు. వాయిదాలకొ చ్చే నిందితులు వీరికి టీ, కాఫీ, భోజనాలతో పాటు ఎంతో కొంత జేబులో పెట్టాల్సిందే. లేదంటే వచ్చే వాయిదాకు నిందితునికి సినిమా కష్టాలను చూపిస్తారు.

పెద్ద కేసుల్లో భారీగా డీల్‌
ఎర్రచందనం, స్పిరిట్, దొంగనోట్లు, అడవిలో వేట, హత్య, అత్యాచారం తదితర కేసుల్లో నిందితులకు సాయం చేస్తామంటూ భారీ డీల్‌ చేసేవాళ్లు ఉన్నారు. నిందితులకు బెయిల్‌ నుంచి కేసు ట్రయిల్స్‌ సాగే వర కు కోర్టుకానిస్టేబుళ్లని పోషించాల్సిందే. ఏదైనా కేసు కోర్టులో నమోదు కాగానే నిందితులకు న్యాయవాదులను ఏర్పాటు చేయడం నుంచి వీరి వసూళ్లు ప్రారంభమవుతాయి. రోడ్డు ప్రమాద కేసుల్లో లాయర్లకు కేసు పట్టించిన కానిస్టేబుల్‌కు నిర్ణయించిన మేర కమీషన్లు ఇవ్వాల్సిందే.

ఇంకొందరు చేయి తిరిగిన కానిస్టేబుళ్లు క్రిమినల్‌ కేసుల్లో మొత్తం తామే డీల్‌ చేస్తామంటూ జూనియర్‌ లాయర్‌ను ఏర్పాటు చేయడం కేసులోని సాక్షులను అనుకున్న వారికి అనుకూలం ప్రభావితం చేయడం వరకు తలమునకలై ఉంటారు. వారెంట్లను జారీ చేసేటపుడు వీరికి ఎంతో కొంత ముట్టజెప్పాల్సిందే. నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌లో అయితే భారీగా చేతివాటం చూపుతుంటారు. నిందితుడు వా యిదాలకు రాకున్నప్పటికీ సంబంధిత లాయర్ల ద్వారా పిటిషన్లు వేయించే సత్తా ఉన్న కోర్టు కానిస్టేబుళ్లు జిల్లాలో చాలా మందే ఉన్నారు.

ఏళ్ల తరబడి అదే పోస్టులో తిష్ట
ఒకసారి కోర్టు కానిస్టేబుల్‌ విధుల్లోకి వెళ్లిన వారు ఇక వేరే పనులు చేసేందుకు వెళ్లడం లేదు. ఇందులో మంచి ఆదాయం ఉండడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలోనే అన్ని స్టేషన్లలో ఈ విధులకు హాజరయ్యేందుకు పలువురు పోటీ పడుతుంటారు. అయితే ఎస్‌ఐకి నచ్చినవారు మాత్రమే ఈ పోస్టులో కొనసాగుతుంటారు. మొత్తం వ్యవహారాలు కోర్టు బయట జరగడం, వీరిపై బాధితులు ఫిర్యాదులు చేయకపోవడంతో ఇది చాలా సురక్షితమైన, లాభదాయక ఉద్యోగం అయినందున దీనికి మంచి డిమాండ్‌ ఉంది.

మామూలుగా హెడ్‌ కానిస్టేబుల్‌ స్థాయి అధికారే కోర్టు విధులకు హాజరు కావాలనే నిబంధనలను ఎక్కడా పాటించడం లేదు. దీంతో ఈ విధులకు హాజరైన వారు ఏళ్ల తరబడి కొనసాగుతున్నారు. కోర్టు వ్యవహారాల్లో అనుభవం ఉన్నవారినే నియమించాలనే ఉద్దేశంతో అధికారులు వీరినే కొనసాగించాల్సి వస్తోంది. ఇదే వీరికి వరంలా మారి అవినీతికి ఆజ్యం పోస్తోంది.  ఈ దందాపై కొత్తగా వచ్చిన ఎస్పీ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయమై పలమనేరు డీఎస్పీ శంకర్‌ను వివరణ కోరగా బా«ధితులెవరైనా లిఖితపూర్వకంగా తమకు ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఆరోపణలపై ఏమీ చేసేందుకు ఆస్కారం ఉండదన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement