సాక్షి కడప : గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి కరోనా సెగ తగులుతోంది. ఉపాధి అవసరాలకోసం వెళుతున్న వారికి ఈ వైరస్ శాపమైంది. మన జిల్లా నుంచి విదేశాలకు వెళ్లేవారికి పెద్ద కష్టమే ఎదురైంది. విమాన రాకపోకలకు నిలిపివేస్తుండటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిని కొన్ని కుటుంబాలు ఎదుర్కొంటున్నాయి. గల్ఫ్ దేశాలైన కువైట్, ఖత్తర్,దుబాయ్,సౌదీ,బెహరీన్ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇప్పటికే అనుమతి లేదు. లాయా దేశాలు విమానాల రాకపోకలపై నిషేధం విధించారు. దీంతో అక్కడికి వెళ్లాల్సిన అనేక మంది ఆగిపోయారు. ఈనెల మొదటివారంలో ఆ దేశాలకు పోవాల్సిన వారు ప్రస్తుతం అక్కడికి వెళ్లలేని పరిస్థితి. ఈనెలాఖరు నాటికి రాకపోకలు పునరుద్ధ్దరిస్తారని ఆశ పడుతున్నారు.
తడిసి మోపెడవుతున్న ఖర్చు
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఉపాధి నిమిత్తం ఇతర దేశలకు చాలామంది వెలుతుంటారు. వెళ్లడానికి అన్ని సిద్ధం చేసుకున్నప్పటికీ విమానాలు రద్దు కావడంతో ఖర్చుల భారం మీద పడింది. అప్పో సప్పో చేసి వీసా ఖర్చుల కోసం తెచ్చుకున్న సొమ్మంతా విమాన ప్రయాణాల నిషేధంతో బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది. వీసా తెచ్చుకున్న వారికి మెడికల్, స్టాంపింగ్, ఎమ్మిగ్రేషన్, తదితరఖర్చులన్నీ మీద పడేలా కనిపిస్తున్నాయి. డబ్బులు పోయినా పరవాలేదు చివరకు అక్కడికి వెళ్లేందుకు అవకాశం లేపోవడంతోనే వారు లబోదిబోమంటున్నారు.
రీఫండ్ చేసేవి కొన్ని..
జిల్లానుంచి వివిద పనులతో పాటు ఉపాధి నిమిత్తం అరబ్ దేశాలకు వెళుతున్న వారు ఎక్కువే. విదేశాలకు వెళ్లేందుకు ఈ రెండు వారాల వ్యవధిలో టికెట్లు బుక్ చేసుకున్న వారి పట్ల విమాన సంస్థలు కొంత దయ చూపిస్తుండటం ఊరట కలిగించే అంశం. టికెట్ మొత్తం రీఫండ్ చేయటానికి ముందుకు రాగా.. మరికొన్ని సంస్థలు టోకెన్లు అందిస్తున్నాయి. పేద కుటుంబాలకు వారికి ఇది కొంత ఊరటనిస్తోంది. మరోపక్క ట్రావెల్స్ యజమానులకు ప్రస్తుత పరిస్థితి తీరని వేదనను కలిగిస్తోంది.రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, కడప, బద్వేలు తదితర ప్రాంతాల నుంచి ప్రతిరోజు గల్ఫ్ దేశాలకు రాకపోకలు సాగుతుంటాయి.ఈనెల మెదటి వారంనుంచి విమాన రాకపోకలు గల్ఫ్ దేశాలకు ఆగిపోయాయి. మరికొంత కాలం రాకపోకలపై నిషేధం కొనసాగేలా కనిపిస్తోంది.ఏది ఏమైనా బడుగు బలహీన వర్గాలపై కరోనా గండం పెద్ద దెబ్బ తీసిందనే చెప్పవచ్చు.
గల్ఫ్‌కు వెళ్లలేకపోయా..
నా పేరు షేక్ అర్షద్ అహ్మద్. నేను కడపలోనే నివాసముంటున్నాను. కువైట్‌కు ఉపాధి నిమిత్తం ఈనెల 18న వెళ్లాల్సి ఉంది. అందుకు సంబంధించి రూ. 45 వేలు అన్నింటికీ ఖర్చు పెట్టాను. వీసా కూడా వచ్చింది. కరోనా వైరస్ నేపధ్యంలో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణం ఆగిపోయింది. మెడికల్, స్టాపింగ్, ఎమ్మిగ్రేషన్ పరీక్షలు కూడా పూర్తి చేశారు. ఇప్పుడు విమానాల రద్దు నేపద్యంలో మళ్లీ అన్ని పరీక్షలు చేయించుకుని టిక్కెట్ పొందాల్సిన అవసరం ఏర్పడింది.
ఎన్నో సమస్యలు
నా పేరు షేక్ షఫీ. జిల్లా కేంద్రమైన కడపలోని కృష్ణా సర్కిల్‌లో ఉన్న మహబూబ్ ట్రావెల్స్ నిర్వహిస్తున్నాం. కరోనా వల్ల మాకు ఉపాధి కరువైంది. నెలకు సరాసరిన 30 మంది వరకు గల్ఫ్ దేశాలకు టిక్కెట్లు బుక్ చేసుకునేవారు. ఎయిర్‌పోర్టు వరకు వాహనాలను కూడా అందుబాటులో ఉంచేవాళ్లం. కరోనా వైరస్ ప్రభావంతో కువైట్, దుబాయ్, ఖత్తర్, బెహారీన్ లాంటి దేశాలకు విమానాలు రాకపోకలు నిలిపివేయడంతో ఖాళీగా కూర్చోవాల్సి వస్తోంది. పైగా ఈనెల 10 నుంచి నెలాఖరు వరకు టిక్కెట్ బుక్ చేసిన వారితో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎవరో విమానాలు రద్దు చేస్తే టిక్కెట్లు, ఇతరత్రా గురించి ప్రశ్నిస్తుండడంతో ఏం చెప్పాలో అర్థం కావడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment