సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ) : రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 190కి చేరింది. ఒక్క శనివారం రోజే 26 కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా కృష్ణా జిల్లాలో తొమ్మిది కేసులు నమోదయ్యాయి. ఇక్కడ శుక్రవారం రాత్రి వరకు మొత్తం 23 కేసులు నమోదై ఉండగా ఇప్పుడా సంఖ్య 32కు చేరింది. దీంతో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో యంత్రాంగం అప్రమత్తమైంది. కడపలోనూ శనివారం మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. అలాగే, ఇప్పటివరకూ ఒకేఒక్క పాజిటివ్ కేసు ఉన్న కర్నూలు జిల్లాలో తాజాగా మూడు కేసులు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఒక్కరోజే 6 కేసులు నమోదు కావడంతో గుంటూరు జిల్లా వాసులూ ఉలిక్కిపడుతున్నారు. పెరిగిన వాటితో గుంటూరులో ఇప్పుడు మొత్తం కేసుల సంఖ్య 26కు చేరింది.
వారందరూ ఐసొలేషన్‌లో..
ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి ఏపీకి తిరిగొచ్చిన 90 మంది కరోనా పాజిటివ్ బాధితుల ఇళ్లను అధికార యంత్రాంగం పూర్తిగా అదుపులో ఉంచుకుంది. ఆ 90 మందితో పాటు వారిని కలుసుకున్న వారినీ ఇళ్లల్లో ఐసొలేషన్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. వీరందరిపై మున్సిపాలిటీ, ఆరోగ్యశాఖ, పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో నిఘా ఉంచారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో ఇప్పటివరకు 946మందిని ఢిల్లీ నుంచి వచ్చిన వారిగా గుర్తించారు. వీరితో కాంటాక్టు అయిన వారిని 1,118గా తేల్చారు. వీరిలో 879మంది నుంచి శాంపిల్స్ సేకరించారు. మిగిలిన వారి నుంచి రేపు లేదా ఎల్లుండి సేకరిస్తారు. కాగా, రాష్ట్రంలోని మొత్తం 190 పాజిటివ్ కేసులలో 169 కేసులు ఢిల్లీ నుంచి వచ్చిన వారివే కావడం గమనార్హం.
కరోనా నుంచి బయటపడ్డ యువకుడు
విజయవాడలో కరోనా తొలి కేసుగా నమోదైన యువకుడు పూర్తిగా కోలుకుని శనివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన యువకుడు పారిస్‌లో చదువుకుంటూ మార్చి 13న ఢిల్లీ వచ్చి, అక్కడి నుంచి హైదరాబాద్ మీదుగా విజయవాడ వచ్చాడు. 20న వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. పద్నాలుగు రోజుల చికిత్స అనంతరం పూర్తిగా కోలుకోవడంతోపాటు, నిర్ధారణ పరీక్షలో నెగిటివ్ రావడంతో వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. దీనితో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ వచ్చి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య ఐదుకు చేరింది.
ఏపీలో 190కి చేరిన పాజిటివ్‌లు
Published Sun, Apr 5 2020 3:37 AM | Last Updated on Sun, Apr 5 2020 10:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment