‘పట్టిసీమ’పై శ్రద్ధ ‘హంద్రీ నీవా’పై ఏదీ? | Cpi leader jagadeesh fires on Cm chandrababu | Sakshi
Sakshi News home page

‘పట్టిసీమ’పై శ్రద్ధ ‘హంద్రీ నీవా’పై ఏదీ?

Published Sat, Jun 20 2015 2:48 AM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM

Cpi leader jagadeesh fires on Cm chandrababu

చంద్రబాబును ప్రశ్నించిన సీపీఐ జిల్లా కార్యదర్శి డి. జగదీష్
హంద్రీ-నీవా కార్యాలయం ముట్టడి
 
 అనంతపురం క్రైం : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు  కృష్ణా డెల్టాకు సాగునీరు అందించే పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌పై ఉన్న  శ్రద్ధ  కరువు ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించే హంద్రీ-నీవా ప్రాజెక్టుపై లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీష్ ఆరోపించారు. హంద్రీ-నీవా పథకాన్ని పూర్తి చేయకపోవడాన్ని నిరసిస్తూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం హంద్రీ-నీవా కార్యాలయాన్ని ముట్టడించారు. ఉద్యోగులను కార్యాలయం నుంచి బయటకు పంపి మూడు గంటల పాటు ఆందోళన చేశారు. జగదీష్ మాట్లాడుతూ  పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు మళ్లిస్తే ఆదా అయ్యే కృష్ణా జలాలను రాయలసీమకు కేటాయిస్తూ జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. 

హంద్రీ-నీవా ప్రాజెక్టు పూర్తి అయితే  రాయలసీమ నాలుగు జిల్లాలో 6 లక్షల ఎకరాలకు,  అనంతపురం జిల్లాలో 3.45 లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందుతుందన్నారు. దీనికి ముఖ్యమంత్రి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడంలేదన్నారు.  విస్తారంగా వర్షాలు కురిస్తే పుష్కలంగా నీరు లభ్యమయ్యే ప్రాంతానికి ఉపయోగపడే పట్టిసీమపై అత్యధిక శ్రద్ధ కనబరుస్తున్నారన్నారు. ఈ ఏడాది ఆగష్టు 15 నాటికి కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు అందిస్తామని చంద్రబాబు ప్రకటించడం ఆ పథకానికి ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తోందన్నారు. 

కొత్త ఎస్‌ఎస్‌ఆర్ రేట్లు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు  హంద్రీ-నీవా పనులు చేయలేమని చెతులెత్తేశారన్నారు.  పుష్కలంగా నీరు లభించే ప్రాంతాలు ముఖ్యమా.? తాగునీటి కోసం అలమటిస్తున్న కరువు జిల్లాలు ముఖ్యమా..? అని ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన ప్రశ్నించారు. వెనుకబడి ప్రాంతాల్లోని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.  సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జాఫర్, రైతు సంగం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శివన్న, కాటమయ్య, ఉపాధ్యక్షులు వెంకటేశులు, వన్నారెడ్డి, నాయకులు మహదశ్, సంగప్ప, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి కేశవరెడ్డి, మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మావతి, అనంతపురం రూరల్ మండల సీపీఐ కార్యదర్శి రఘురామయ్య, సీపీఐ నాయకులు, కార్యకర్తలు, వందలాది మంది రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement