నిధులు పారలె
నీటిపారుదల ప్రాజెక్టులకు పాత బడ్జెటే
జలయజ్ఞంపై చిన్నచూపు
ఖర్చుల్లో జీతభత్యాలదే సింహభాగం
వివరాల్లేని చిన్న నీటిపారుదల బడ్జెట్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ
సార్వత్రిక ఎన్నికలు ముంగిట్లో నిలిచిన దశలో.. సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ జిల్లాకు మోసుకొచ్చిన వరాలేమీ లేవు. ఒకవిధంగా ఇది ఎన్నికల బడ్జెట్ అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అయ్యింది. ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కావడం, ఎన్నికల తర్వాత కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెడుతుంది కాబట్టి కేటాయింపుల విషయంలో పెద్దగా కసరత్తు చేసిన దాఖలాల్లేవన్న అభిప్రాయమూ వ్యక్తమయ్యింది. ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి శాసనసభలో సోమవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ (2014-15)లో జిల్లాకు జరిగిన కేటాయింపులు నివ్వెర పరిచేలా ఉన్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మాత్రమే గత బడ్జెట్ కంటే కొంత మెరుగైన కేటాయింపులు జరిగాయి. సాగునీటి ప్రాజెక్టుల కేటాయింపులను పరిశీలిస్తే ఏమాత్రం మార్పుల్లేకుండా బడ్జెట్ విదిల్చినట్లు కనిపిస్తుంది. నాగార్జునసాగర్, ఎస్ఎల్బీసీ, ఎస్సారెస్పీ-2, తదితర ప్రాజెక్టులకు కేటాయించిన బడ్జెట్ నామమాత్రంగానే ఉంది. పులించింతల ప్రాజెక్టు కేటాయింపుల్లోనూ మార్పులేదు. మధ్యతరహా, చిన్న నీటి ప్రాజెక్టులకు కేటాయింపులపై స్పష్టత లేని కారణంగా, ఆ రెండు రంగాలకు పెద్దగా ఒరిగేదేమీ లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
నాగార్జునసాగర్‌కు రూ.43కోట్లు అధికం
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించలేదు. గత బడ్జెట్లో రూ.700 కోట్లివ్వగా, ఈ బడ్జెట్లో కొద్దిగా పెంచుతూ రూ.743కోట్లు కేటాయించింది. సాగర్ ఆధునికీకరణ పనుల కోసం రూ.4,444 కోట్ల అంచనా వ్యయంతో పనులు ఎప్పుడో మొదలయ్యాయి. ప్రపంచబ్యాంకు, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో చేపడుతున్న పనులు కొనసాగుతున్నాయి. కానీ, ఆధునికీకరణ పనులు మొదలైనప్పటి నుంచి అరకొరగా బడ్జెట్ కేటాయిస్తుండడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇక ప్రాజెక్టు నిర్వహణ, ప్రపంచ బ్యాంకు పనులు మొదలుపెట్టక ముందు ప్రారంభించిన పనులు, సిబ్బంది జీతభత్యాలు, కరెంటు చార్జీలు ఇతరత్రా ఖర్చుల కోసం సాగర్ సీఈ పరిధిలో ఈ సారి కేటాయింపులను ప్రకటించలేదు.
ఎస్సారెస్పీ -2
తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలకు సాగునీరు అందించాల్సిన శ్రీరాంసాగర్ (ఎస్ఆర్ఎస్పీ) రెండోదశకు బడ్జెట్ కేటాయింపులు నిరాశాజనకంగానే ఉన్నాయి. గత ఏడాది బడ్జెట్లో రూ.40కోట్లు మాత్రమే ఇవ్వగా, ఈ సారి బడ్జెట్లోనూ రూ.40కోట్లే కేటాయించింది. రెండోదశ పనులు పూర్తయితే, నాలుగు నియోజకవర్గాల్లో 2.21లక్షల పైచిలుకు ఎకరాలకు సాగునీరు అందుతుంది. రూ. 1,043కోట్ల పైచిలుకు అంచనా వ్య యంతో మొదలు పెట్టిన ఈ పనులను సకాలంలో పూర్తిచేయడానికి అవసరమైనం తగా నిధుల కేటాయింపు మాత్రం ఉండడం లేదు.
కేటాయింపుల ఊసే లేని చిన్న నీటి పారుదల రంగం
మీడియం ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్‌కు చేసిన కేటాయింపులపై స్పష్టత లేదు. జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టులైన డిండి, మూసీ ప్రాజెక్టులకు ఎంత కేటాయించారన్న ప్రకటన లేదు. చిన్ననీటి పారుదల విభాగంలోని పిలాయిపల్లి కాల్వ, కోటప్పమత్తడి, బునాదిగాని కాల్వ, శేషులేటి వాగు, వేమూలూరు ప్రాజెక్టు, భీమలింగం, ఆసిఫ్‌నహర్ వంటి ప్రాజెక్టుల కేటాయింపుల ప్రకటన లేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 556 (వంద ఎకరాల విస్తీర్ణం పైబడినవి)చెరువులు , 4076 (వంద ఎకరాల విస్తీర్ణానికి లోబడి) కుంటలు ఉన్నాయి. వీటికి కేటాయించిన బడ్జెట్ వివరాలు కూడా అందాల్సి ఉంది. కొత్త ప్రభుత్వం ఆ తర్వాత ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్లో జరిగే కేటాయింపులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని, ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయినందున పెద్దగా నిరాశపడాల్సిన అవసరం కూడా లేదన్న అభిప్రాయం అధికారవర్గాలు వ్యక్తం చేశాయి. మున్ముందు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సి ఉన్నందున ఆయా ప్రాజెక్టుల ఉన్నతాధికారుల నుంచి కూడా ఎలాంటి ప్రతిపాదనలనూ స్వీకరించలేదని జిల్లాలోని ఓ ప్రాజెక్టు సీఈ ‘సాక్షి’కి వివరించారు.
కాకులను కొట్టి గద్దలకు..
కాకులను కొట్టి గద్దలకు వేసేలా ఈ బడ్జెట్ ఉంది. పరిశ్రమాధిపతులకు, కార్పొరేట్ సంస్థలకు, కాంట్రాక్టర్లకు లబ్ధి కలిగించేలా కేటాయింపులు జరిగాయి. బడ్జెట్ పరి మాణం పెంచి ప్రజలపై పెనుభారం మోపింది. దళిత, గిరిజన, మైనార్టీ, బలహీన వర్గాల సంక్షేమానికి నిధులు కేటాయించకుండా ఏ రకంగా సంక్షేమాన్ని కాపాడుతారు. ఎస్ఎల్బీసీ, ఏఎమ్మార్ ప్రాజెక్టులు, శ్రీరాం సాగర్ రెండు, మూడో దశలు, ఉదయసముద్రం ఎత్తిపోతల పథకాలకు నిర్ణయిం చిన కాలవ్యవధి పూర్తయ్యింది. వీటిని ఇంకెప్పుడు పూర్తి చేశారు? నక్కలగండి ఎత్తిపోతల పథకం కాగితాలకే పరిమితమైంది.
- నంద్యాల నర్సింహారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి
ప్రాజెక్టులపై శీతకన్ను
సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరిగింది. ఇప్పటికే నిధులు లేక పనులు మందగించాయి. అప్పుల సంద్రంలో నట్టేట మునిగిన రైతులకు ఇది శరాఘాతమే. చివరకు సంక్షేమ పథకాలపై కూడా శీతకన్ను వేసింది. నాలుగేళ్లుగా చతికిలపడ్డ సంక్షేమ పథకాల అమలు గాడిలో పడే పరిస్థితి కనిపించడంలేదు. కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కొండంత బడ్జెట్‌ని చూపిస్తున్నారు. ఓట్లు రాల్చుకోవాలని చూస్తున్నారు. అంతేతప్ప సామాన్యుడికి ఊరటనిచ్చే ఒక్క అంశమూ బడ్జెట్లో లేదు.
-గట్టు శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు
ఎన్నికల బడ్జెట్
ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అంకెల గారడీ చేసింది. ఏ ప్రాజెక్టుకు ఎంత కేటాయించారో స్పష్టంగా చెప్పడం లేదు. కనీసం ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశారో లెక్కలు లేవు. ప్రణాళికేతర వ్యయాన్నే చూపిస్తున్నారు. మున్సిపాలిటీల్లో కన్నా అధికంగా పన్నులు పెంచి సామాన్యుల నడ్డి విరగొట్టింది. కనీసం మైనర్ ఇరిగేషన్‌కూ పూర్తిస్థాయిలో నిధులు కేటాయించలేదు.
- బండా నరేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
ఓటర్లకు గాలం వేయడానికే
రాబోయే ఎన్నికల్లో ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు ఉంది. పెరుగుతున్న ధరలను అదుపులో పెట్టేందుకు బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన చేయలేదు. గత బడ్జెట్లో కేటాయించిన నిధులనే సక్రమంగా ఖర్చు చేయలేదు. ఇప్పుడు నిధులను పూర్తిగా ఖర్చు చేస్తారనడం నమ్మశక్యంగా లేదు. పేరు గొప్ప ఊరుదిబ్బ అన్న చందంగా... బడ్జెట్ ఎంత కేటాయించామన్నది కాదు. వాటిని ఖర్చు చేస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది.
- బిల్యా నాయక్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్ఎల్బీసీకి అరకొరే..
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో చొరవతో ప్రారంభించిన శ్రీశైలం ఎడమగట్టు బ్రాంచ్ కెనాల్ (ఎస్ఎల్బీసీ- టన్నెల్) పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం ఏ కోశానా ఆలోచిస్తున్నట్లు కనిపించడం లేదు. గత బడ్జెట్లో *420కోట్లు ఇవ్వగా, ఈ సారి కూడా ఒక్క రూపాయి పెంచకుండా అంతే మొత్తం కేటాయించారు. రూ.2813కోట్ల పరిపాలనా అనుమతి ఉన్న ఈ ప్రాజెక్టుకు అరకొరగా నిధులు ఇస్తుండడంతో 2010లో పూర్తి కావాల్సిన ప్రాజెక్టుకు 2014వరకు గడువు పెంచారు. అయినా, నిధుల కేటాయింపు నిరాశాజనకంగా ఉండడంతో అసలు ఈ ప్రాజెక్టు పూర్తవుతుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రూ.232కోట్లు ఖర్చు కాగల డిండి ఎత్తిపోతల పథకం ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో అంతర్భాగంగానే ఉంది. ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం (ఏఎమ్మార్పీ) నిర్వహణ సైతం ఎస్ఎల్బీసీలో అంతర్భాగం. అదే మాదిరిగా రూ.561.96 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఉదయసముద్రం ఎత్తిపోతల పథకం కూడా ఎస్ఎల్బీసీలో అంతర్భాగమే. మరి ఇంత పెద్ద ప్రాజెక్టుకు పెద్దమొత్తంలో నిధులు అవసరం పడుతుండగా ప్రభుత్వం కంటి తుడుపుగా రూ.420కోట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం.
పులిచింతలకు కాస్త ఊరట
పులిచింత ప్రాజెక్టు ద్వారా ముంపు మినహా, జిల్లాలో ఒక్క ఎకరాకూ సాగునీరు అందే పరిస్థితి లేదు. ముంపు పరిహారం, పునరావాసం విషయంలో మాత్రమే పులిచింతల ప్రాజెక్టు కేటాయింపులకు జిల్లాకు సంబంధం. గత బడ్జెట్లో రూ. 208కోట్ల బడ్జెట్ కేటాయించగా, ఈ సారి అదనంగా మరో రూ.94లక్షలు పెంచి రూ.208.94కోట్లు కేటాయించింది. ఈ నిధులను ప్రాజెక్టు పెండింగ్ పనులు, పునరావాసం, ముంపు పరిహారం కోసం ఖర్చు చేయనున్నారు.