సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ బిల్లుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మత విభజన ద్వారా ఓట్లు పొందేందుకు కేంద్రం ఆరాటపడుతోందని విమర్శించారు. గురువారం భారత కమ్యూనిస్టు నేత నీలం రాజశేఖర్ రెడ్డి 25వ వర్ధంతి కార్యక్రమాల్లో రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పౌరసత్వ బిల్లు ఆమోదంతో మైనార్టీలు అభద్రతా భావంలోకి వెళ్లిపోయారన్నారు. అన్నదమ్ముల్లా కలిసి ఉన్న మతాల మధ్య కేంద్రం చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. దేశం ఆర్థిక మాంద్యంతో అల్లాడుతుంటే పార్లమెంట్‌లో కనీస చర్చ జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక మాంద్యం విషయంలో బీజేపీ అనుకరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జనవరి 1 నుంచి 7వ తేదీ వరకు నిరసనలు చేపడుతామని రామకృష్ణ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment