సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్/బూర్జ: ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలో థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయబోయే ప్రాంతాన్ని సందర్శించి ప్రజలు, రైతుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి వచ్చిన సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి. మధును ఆమదాలవలస (శ్రీకాకుళం రోడ్డు) రైల్వే స్టేషన్‌లో బుధవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. రైల్వే స్టేషన్‌లో సీపీఎం జిల్లా నాయకులను, శ్రేణులను కలవనీయకుండా బూర్జ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆయన ఎవరితో మాట్లాడకుండా ముందస్తుగానే సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టు సమయంలో సీఐ నవీన్‌కుమార్, మధు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌కు వద్దకు వచ్చిన మీడియా ప్రతినిధులు, జిల్లా పార్టీ నేతలను మధుతో మాట్లాడనివ్వలేదు. నేతలు పోలీసులతో వాదనకు దిగడంతో వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
హుటాహుటిన చేరుకున్న శ్రేణులు
మధు అరెస్టు వార్త తెలియడంతో జిల్లా పర్యటనలోనే ఉన్న పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దడాల సుబ్బారావుతో పాటు జిల్లా నలుమూలల నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు పోలీసు స్టేషన్ వద్దకు వచ్చి బైఠాయించి, మధు అరెస్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ సమయంలో పలువురు నాయకుల్నీ పోలీసులు అరెస్టు చేశారు. మధును 151, 120బి,188, 34 రెడ్‌విత్ సెక్షన్లపై అరెస్టు చేసినట్లు రాత్రి 7.45 సమయంలో మీడియాకు తెలిపారు. అప్పటి వరకూ మీడియాను కూడా అనుమతించలేదు. ఆ తర్వాత మధును విడుదల చేశారు.
పొలిట్‌బ్యూరో ఖండన
మధును అరెస్ట్ చేయడాన్ని సీపీఎం పొలిట్‌బ్యూరో బుధవారం ఒక ప్రకటనలో ఖండించింది. విద్యుత్ కేంద్రానికి బలవంతంగా భూమిని సేకరిస్తున్నారన్న విషయం తెలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించేందుకు వెళుతున్న మధును రైల్వే స్టేషన్‌లోనే అరెస్ట్ చేయడం దుర్మార్గం, అప్రజాస్వామికమని పేర్కొంది. తమ పార్టీ నేతల్ని, కార్యకర్తల్ని అరెస్ట్ చేసి ప్రభుత్వం భావప్రకటనా స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తోందని విమర్శించింది.