సాక్షి, అమరావతి బ్యూరో : విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆగడాలు, భూ కబ్జాలు, దోపిడీలు రోజురోజుకు పెరిగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. స్వాతంత్య్ర సమరయోధుడికి ఇచ్చిన స్థలాన్ని నిస్సిగ్గుగా ఆక్రమించిన ఉమాపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి. బాబూరావు డిమాండ్ చేశారు. ఫోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లతో ఓ స్వాతంత్య్ర సమరయోధుడి స్థలాన్ని కబ్జా చేసిన ఘటనలో ఎమ్మెల్యే బొండా, అతని భార్య సుజాతతో సహా తొమ్మిది మందిపై కేసు నమోదు చేయాలని ఉమ్మడి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి బొండా రాజీనామా చేయాలని బాబూరావు డిమాండ్ చేశారు. విజయవాడ నగరంలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉమా ఆగడాలపై ఆయన బుధవారం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కబ్జాకోరులకు తెలుగుదేశం ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని.. భూ ఆక్రమణలు, అరాచకాలతో విజయవాడను తన గుప్పెట్లోకి తీసుకున్న బొండాను జనం ఛీ కొడుతున్నారని చెప్పారు. ఇలాంటి వ్యక్తిని టీటీడీ బోర్డు మెంబర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించడం సిగ్గు చేటన్నారు.
బెజవాడను భ్రష్టు పట్టిస్తున్న బొండా..
బొండా ఉమా భూ ఆక్రమణల వల్ల విజయవాడ బ్రాండ్ ఇమేజ్ పాతాళంలోకి పడిపోయిందని బాబూరావు ఆవేదన వ్యక్తం చేశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి సాయిశ్రీ మరణానికి కారణమైన బొండాను ఊరికే వదిలేయవద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే ఇంద్రకీలాద్రిని తమ గుప్పెట్లోకి తీసుకునేందుకు టీడీపీ నాయకులు ఆరాటపడుతున్నారని... దసరా ఉత్సవాల్లో వెలుగు చూస్తున్న సంఘటనలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. దేవస్థానాలను స్వప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్న చరిత్ర టీడీపీ నాయకులదేనని తెలిపారు. నాలుగున్నరేళ్ల టీడీపీ పాలనతో ఏం ఒరగబెట్టారో చెప్పకుండా ... నిస్సిగ్గుగా మళ్లీ నువ్వే రావాలి సీఎం అంటూ చంద్రబాబు ఫ్లెక్సీలను, హోర్డింగులను ప్రదర్శించడం నీతిమాలిన చర్యగా ఆయన అభివర్ణించారు. భూ ఆక్రమణల నేపథ్యంలో బొండాపై వెంటనే చర్యలు తీసుకోవాలని, అతన్ని అన్ని పదవుల నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజా సంఘాలతో చర్చించి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నేతలు డీవీ కృష్ణ, కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment