విద్యార్థులకు చిత్రలేఖనంపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్న గొల్లపల్లి శ్రీనివాస్
సాక్షి, రాజోలు (తూర్పు గోదావరి): నిరుపేద కుటుంబం.. రోజువారీ పనిచేస్తే తప్ప పూట గడవని పరిస్థితి. చిన్నతనం నుంచి చిత్రలేఖనంపై ఆసక్తి. బొమ్మలు గీస్తూ ఇరుగుపొరుగు, స్నేహితుల మన్ననలు పొందుతూ చిత్రలేఖనంపై ఆసక్తి పెంచుకుని దానినే జీవనాధారంగా మలచుకున్నాడు తాటిపాకకు చెందిన గొల్లపల్లి శ్రీనివాస్. చిన్న చిన్న సైన్‌బోర్డులు, స్టిక్కరింగ్ చేయడం వంటి పనులు చేస్తూ నాలుగేళ్ల క్రితం క్రాఫ్ట్ టీచర్‌గా సర్వశిక్షాభియాన్‌లో కూనవరం ఉన్నత పాఠశాలలో శ్రీనివాస్ కొలువు పొందాడు. చిత్రలేఖనంపై ఉన్న ఆసక్తికి డ్రాయింగ్ టీచర్ పోస్టు తోడు కావడంతో విద్యార్థులను చిత్రకారులుగా తీర్చిదిద్దేందుకు నిరంతర శ్రామికుడిగా మారాడు. ప్రతి విద్యార్థిలో ఏదో ఒక ఆసక్తిని గమనించి వాటిపై చిత్రాలను గీయడం నేర్పిస్తున్నాడు. చిత్రలేఖనం పోటీలు ఎక్కడ జరిగినా విద్యార్థులను వాటిలో పాల్గొనేలా తర్ఫీదు ఇచ్చి ప్రొత్సహిస్తునాడు.
అచ్చుగుద్దినట్టు ‘పెన్సిల్ చిత్రాలు’
పెన్సిల్‌తో శ్రీనివాస్ గీచిన చిత్రాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పాస్‌పోర్టు సైజు ఫొటో ఇస్తే చాలు శ్రీనివాస్ తన పెన్సిల్‌కు పని చెప్పి అద్భుతమైన కళాఖండాన్ని సృష్టిస్తాడు. అలా చిత్రలేఖనంలో బహుమతులు పొందిన విద్యార్థినులు, స్నేహితుల చిత్రాలను పెన్సిల్‌తో ఇట్టే చిత్రీకరించాడు. ఓపిగ్గా కదలకుండా కూర్చుంటే లైవ్ చిత్రాన్ని కూడా తన పెన్సిల్‌తో గీస్తానని శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. శ్రీనివాస్ గీచిన చిత్రాలను కూనవరం ఉన్నత పాఠశాలలో ప్రదర్శనకు ఉంచారు. విద్యార్థుల్లో చిత్రలేఖనంపై ఆసక్తి పెంచడం ద్వారా చేతిరాత చక్కదిద్దవచ్చునని, నిరంతరం చదువుతో ఒత్తిడికి గురికాకుండా విద్యార్థులకు చిత్రలేఖనం ఎంతో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుందని శ్రీనివాస్ పేర్కొన్నారు. అందుకే ఎంఈఓ జొన్నలగడ్డ గోపాలకృష్ణ, ప్రధానోపాధ్యాయుడు పట్టా భాస్కరరావుల ప్రోత్సాహంతో విద్యార్థులకు చిత్రలేఖనంపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment