హిట్ వికెట్ | Cricket Betting | Sakshi
Sakshi News home page

హిట్ వికెట్

Published Tue, Mar 3 2015 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 10:11 PM

హిట్ వికెట్

హిట్ వికెట్

క్రికెట్ బెట్టింగ్‌తో వీధిన పడుతున్న పలు కుటుంబాలు
ఇప్పటికే భారీగా నష్టపోయిన యువకులు
స్టార్ హోటళ్లు కేంద్రాలుగా సాగుతున్న వైనం
మామూళ్ల మత్తులో పోలీసులు

 
 క్రికెట్, జీవితం ఇంచుమించూ ఒకటే. ఊరించే బౌన్సర్లూ ఉంటాయి. తికమక పెట్టే గుగ్లీలూ ఉంటాయి. ఏమరుపాటుగా ఉంటే హిట్ వికెట్ తప్పదు. వైకుంఠపాళిలో ఉన్నట్లు క్రికెట్‌లో బెట్టింగ్ పాము పొంచి ఉంటుంది. కుటుంబాన్ని వీధికి లాగి విషం చిమ్ముతుంది. తేలిగ్గా వచ్చే డబ్బు కోసం అత్యాశకు పోతే నెట్ ప్రాక్టీస్ లేని బ్యాట్స్‌మన్‌లా జీవితంలో డకౌట్ కాక తప్పదు.    
 
తిరుపతి: జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ఊపందుకుంది. బెట్టింగ్ మత్తులో పడి కొందరు తెల్లారేసరికే బికారులుగా మారుతున్నారు. ఇప్పటికే భారత్‌తో జరిగిన పాకిస్తాన్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌లపై బెట్టింగ్‌లు పెట్టి పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారు. బుకీలు యువతను బెట్టింగ్ ఊబిలోకి దించి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా కప్ గెలిచే దేశంపైన భారీ బెట్టింగ్‌లకు యువతను పురిగొల్పుతూ బుకీలు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని అరికట్టాల్సిన పోలీసులు సైతం మాముళ్ల మత్తులో జోగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 ‘నారాయణ.. (పేరు మార్చాం). తన దగ్గరున్న డబ్బుతోపాటు, రూ.25 లక్షలు అప్పు తీసుకుని ఇండియా-దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలుస్తోందని బెట్టింగ్ పెట్టారు. రూ.30 వేలకు లక్ష రూపాయలుగా ఆన్‌లైన్‌లో బుకీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తీరా మ్యాచ్‌లో ఇండియా గెలిచింది. రూ.25 లక్షలు పోయాయి. అప్పు ఎలా తీర్చాలో తెలియక అతను కనీసం సొంత ఊరికికూడా పోలేక ముఖం చాటేస్తూ కుమిలిపోతున్నారు’.

‘రమాకాంత్..(పేరుమార్చాం) తాను కొత్త వ్యాపారం ప్రారంభిస్తున్నానని, పెట్టుబడి కావాలని తల్లిదండ్రుల చేత బలవంతంగా పొలం అమ్మించడంతో పాటు ఉన్న కొద్దోగొప్పో బంగారును సైతం తాకట్టు పెట్టించి దాదాపు రూ.10 లక్షలు జమ చేసుకున్నారు. ఇండియాతో జరిగిన పాకిస్తాన్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌లపై ఇండియా ఓడిపోతుందని పందెం కాశాడు. రెండు మ్యాచ్‌లో ఇండియా గెలిచింది. డబ్బులన్నీ పోయాయి. కుటుంబం వీధిన పడింది. ఇప్పుడు అతనికి దిక్కు తోచడం లేదు.’ ఇలా జిల్లా వ్యాప్తంగా వందలాది మంది ఈ మహమ్మారి మత్తులో చిక్కుకుని విలవిలాడుతున్నారు. ఈ వ్యసనానికి అమ్మాయిలు సైతం బానిసలు కావడంతోపాటు, కమీషన్ ఏజెంట్లుగా అవతారం ఎత్తడం విశేషం.

నగరంలో దందా ఇలా...

 తిరుపతి ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఓ లాడ్జిలో ఈ వ్యవహారం సాగుతోంది. ఓల్డ్ తిరుచానూరు రోడ్డులోని ఇంకొక లాడ్జిలో.. ఇలా నగరంలో ప్రముఖ హోటళ్లలో బెట్టింగ్ వ్యవహారం జోరుగా నడుస్తోంది. బెట్టింగ్ వ్యవహారం అంతా ఆన్‌లైన్‌లో జరగడం గమనార్హం. ఏజెంట్లు, బుకీలు అంతా సెల్‌ఫోన్ ద్వారానే వ్యవహారాన్ని నడుపుతున్నారు. పోలీసులు కొద్దిపాటి నిఘా పెడితే ఈ వ్యవహారాన్ని గుట్టురట్టు చేసే అవకాశం ఉంది.
       
 బెట్టింగ్‌లు ఇలా...


 జిల్లాలో ఎక్కువ మంది ఇండియా ఓడిపోతుందని పాకిస్తాన్, దక్షిణాఫ్రికా జట్లు గెలుపొందుతాయని బెట్టింగ్ కాసి నిండా మునిగారు. పోయిన సొమ్మును సంపాదించాలని ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టి పందేలు కాసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పుడు నగరంలో తాజాగా కప్ గెలిచే దేశంపైనే బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆస్ట్రేలియా గెలుస్తుందని రూ.10 వేలకు రూ.20 వేలు, దక్షిణాఫ్రికా గెలుస్తుందని రూ.10 వేలకు రూ.30 వేలు, ఇండియా గెలుస్తుందని రూ.10 వేలకు రూ.50 వేలు బెట్టింగ్ జరుగుతున్నట్లు వినికిడి. పోలీసులు క్రికెట్ బెట్టింగ్‌ను కట్టడి చేయాలని నగర వాసులు, బాధిత తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement