ఏది బాసూ..పోలీసింగ్‌! | crimes increasing in prakasam district | Sakshi
Sakshi News home page

ఏది బాసూ..పోలీసింగ్‌!

Published Mon, Oct 30 2017 3:19 PM | Last Updated on Tue, Aug 21 2018 8:41 PM

crimes increasing in prakasam district - Sakshi

14 హత్యలు...10కిపైగా భారీ దొంగతనాలు.. కోట్ల రూపాయల సొత్తు అపహరణ..ఐదుకుపైగా లైంగికదాడులు.. ఇవన్నీ ఏ ఏడాది వ్యవధిలోనో జరిగాయనుకుంటే పొరపాటే. గత రెండు నెలల కాలంలో జిల్లాలో చోటుచేసుకున్న దారుణాలివి. జిల్లాలోని శాంతిభద్రతల తీరు ఏవిధంగా ఉందో చెప్పేందుకు ఇవే తార్కాణం. సాక్షాత్తు డీజీపీ సొంత జిల్లాలో పోలీసింగ్‌ గాడితప్పి ప్రజల రక్షణను ప్రశ్నార్థకం చేస్తోంది.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: సామాన్యుడు తప్పు చేస్తే ఏ శిక్ష ఉంటుందో..పోలీస్‌ తప్పు చేసినా అదే శిక్ష..ప్రకాశం జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రోజు ఎస్పీ బి.సత్య ఏసుబాబు మీడియాకు చెప్పిన మాటలివి. నాటికీ..నేటికీ..ఆయన మాటలకు, చేతలకు పొంతన కుదరటం లేదు. యువ ఎస్పీగా విధుల్లో చేరిన సత్య ఏసుబాబు ప్రకాశంలో పోలీసులను కొత్తపుంతలు తొక్కిస్తారని, నేరాలు అదుపు చేసి శాంతిభద్రతలను నెలకొల్పుతారని అందరూ భావించారు. అనుభవ రాహిత్యమో, మెతక వైఖరో తెలియదు గానీ ఏసుబాబు అనుకున్న స్థాయిలో పని చేయలేకపోతున్నారు. నేరాల అదుపులో ముందడుగు వేయలేకున్నారు. పోలీస్‌ సంక్షేమంపై చూపించిన శ్రద్ధ తప్పు చేసిన పోలీసులపైన చర్యలు తీసుకోవడంలోనూ... నేరాలు అదుపు చేయడంలోనూ... చూపించలేకున్నారన్న విమర్శలున్నాయి.

అధికార పార్టీ ఒత్తిళ్లకు ఆయన తలొగ్గి పని చేయాల్సి వస్తోందన్న ప్రచారమూ ఉంది. ఎస్పీ వచ్చే నాటికే జిల్లాలో పోలీస్‌ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. కొందరు పోలీస్‌ అధికారులే నేరాల్లో భాగస్వాములుగా ఉండిపోయారు. ప్రైవేట్‌ పంచాయితీల్లో తలమునకలుగా ఉన్నారు. అధికార పార్టీ సేవ తప్ప మరొకటి చేసే పరిస్థితి లేదు. సామాన్యుడి న్యాయం సంగతి పట్టించుకున్న దాఖలాల్లేవు. ఈ పరిస్థితుల్లో ఎస్పీగా వచ్చిన సత్య ఏసుబాబు తొలినాళ్లలో మీడియాతో చెప్పిన మాటలపై జిల్లావాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆదిలో పోలీస్‌ అవినీతిపైనా కొంత మేర దృష్టి పెట్టిన ఎస్పీ ఇప్పుడు అది కూడా తగ్గించారు. జిల్లాలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి.

జిల్లా కేంద్రంలో ఇటీవల జరిగిన జంట హత్యలు సంచలనం రేకెత్తించాయి. ఎస్పీ మొదలు పోలీస్‌ యంత్రాంగం మొత్తం ఉండే నగరంలోనే ఈ హత్యలు జరగడం గమనార్హం. దీంతో పాటు పలు హత్యలు చోటు చేసుకున్నాయి. జిల్లావ్యాప్తంగా దొంగలు విజృంభించారు. చైన్‌స్నాచింగ్‌లు మొదలుకొని ఇళ్లు లూటీ చేసే వరకు వాళ్ల దోపిడీ కొనసాగుతోంది. రోజు జిల్లాలో ఎక్కడో ఓ చోట దొంగతనం నమోదవుతోంది. దీంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. జీఎస్‌టీ పుణ్యమా అని వ్యాపారులు, మధ్య తరగతి ప్రజలు డబ్బులు, బంగారం బ్యాంకుల్లో పెట్టడం మాని ఇళ్లల్లోనే దాచుకుంటున్నారు. ఇదే అదునుగా దొంగలు విజృంభిస్తున్నారు. జనానికి కంటి మీద కునుకు లేకుండా పోతోంది.

ఇటీవల దర్శి గొంగటికొండ (పులికొండ) ప్రాంతంలో గుప్త నిధుల తవ్వకాలు జిల్లాలో సంచలనం సృష్టించాయి. వందలాది మంది దీంట్లో భాగస్వాములుగా ఉన్నారు. ఆరేడు నెలల పాటు సొరంగం తవ్వారు. వెలిగొండ టన్నెల్‌ తవ్వినంత స్థాయిలో అక్కడ వర్కర్లు పని చేశారు. పత్రికల్లో కథనాలు వచ్చేంత వరకు పోలీసులు స్పందించ లేదు. జిల్లావ్యాప్తంగా గుప్త నిధుల తవ్వకాల పేరుతో కొన్ని ముఠాలు చారిత్రక ప్రాంతాలు, దేవాలయాలను ధ్వంసం చేస్తున్నాయి.  

చీరాల ప్రాంతంలో ఇసుక దందా మొదలుకొని పలు అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇందులో కొందరు పోలీస్‌ అధికారులు, సిబ్బంది పాత్ర ఉందన్న ఆరోపణలు న్నాయి. సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ఇక్కడ కొందరు పోలీస్‌ అధికారులే డబ్బుల వసూళ్లకు పాల్పడిన సంఘటనలకు కొదువ లేదు.

తాజాగా మార్టూరు పోలీస్‌స్టేషన్‌ లాకప్‌డెత్‌ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇక్కడి పోలీస్‌ అధికారుల తీరును తెలియజెప్పింది. ఓ పోలీస్‌ అధికారిపై దొంగలు దాడి చేశారన్న అక్కసుతో కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు సాక్షాత్తు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి లోకేష్‌ పర్యటన సమయంలోనే లాకప్‌లో వేసి చితక్కొట్టారు. దెబ్బలు తాళలేక తెలంగాణ రాష్ట్రానికి చెందిన విజయ్‌రాథోడ్‌ అనే యువకుడు మృత్యువాతపడ్డాడు. లాకప్‌ డెత్‌ వ్యవహారం నుంచి తప్పించుకునేందుకు పోలీసులు తెలివితేటలన్నింటినీ ప్రదర్శించారు.

ఠాగూర్‌ సినిమా సన్నివేశాన్ని గుర్తుకు తెచ్చేలా చనిపోయిన వ్యక్తికి ట్రీట్‌మెంట్‌ ఇచ్చే ప్రయత్నమూ చేశారు. ఒళ్లు హూనమయ్యేలా దెబ్బలు కనిపిస్తుంటే హార్ట్‌ ఎటాక్‌ అంటూ కవరింగ్‌ ఇచ్చారు. పోలీసులు తమ తెలివితేటలను నేరాల అదుపునకు వాడితే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ లాకప్‌డెత్‌లో ఎస్సైయ్యే కాక ఆయనపై స్థాయి అధికారి కూడా పాల్గొన్నట్లు పోలీస్‌ వర్గాల నుంచి ప్రచారం ఉంది. మంత్రి లోకేష్‌ సాక్షాత్తు అదే పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉండగానే లాకప్‌డెత్‌ జరగడంతో ఈ విషయం బయటపడకుండా కప్పిపుచ్చుకునేందుకు పోలీసులకు అండగా స్థానిక ప్రజాప్రతినిధి రంగంలోకి దిగారు. మంత్రి ద్వారా ఏకంగా జిల్లా పోలీస్‌ బాస్‌పైనే ఒత్తిడి వచ్చినట్లు సమాచారం.

ఇటీవల కాలంలో అధికార పార్టీ ఒత్తిడులు ఎస్పీకి అధికమైనట్లు తెలుస్తోంది. ఇక లాకప్‌డెత్‌ వ్యవహారాన్ని కప్పి పుచ్చేందుకు అందరూ తలో చేయి వేశారు. ఈ లాకప్‌ డెత్‌ పోలీసులకు మచ్చను మిగిల్చే వ్యవహారమే. బాధ్యులైన పోలీస్‌ అధికారులపై చర్యలు సంగతి దేవుడెరుగు. కనీసం వీఆర్‌కు పంపించే ప్రయత్నం కూడా చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇంకొల్లు ప్రాంతంలో ఓ పోలీస్‌ ఉన్నతాధికారిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయినా అతనిపై చర్యలు లేవు. జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పలువురు పోలీస్‌ అధికారులు, సిబ్బందిపై ఇప్పటికీ ఆరోపణలు కొనసాగుతున్నాయి. అవినీతి ఆరోపణలున్న పోలీస్‌ అధికారులపై చర్యల్లేవు.

= జిల్లావ్యాప్తంగా నేరాల అదుపులో పోలీస్‌ అధికారులు, సిబ్బంది పూర్తిగా విఫలమయ్యారు. డీఎస్పీ పర్యవేక్షణలో ఉన్న సీసీఐ, సీసీఎస్‌ నేరగాళ్ల కదలికలను అంచనా వేసి అదుపు చేయడంలో విఫలమయిందన్న విమర్శలున్నాయి. అసలు నేరాల అదుపునకు వారు తీసుకుంటున్న చర్యలు శూన్యమన్న ఆరోపణలున్నాయి.

= ఇక స్పెషల్‌ బ్రాంచ్‌ కూడా రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఆందోళనల్లో, నేతల కదలికల నిఘాకే పరిమితమయ్యారు. పాస్‌పోర్టు ఎంక్వయిరీ వారి విధుల్లో ప్రధాన భాగమైపోయింది. దీంతో నేరాల అదుపును గాలికొదిలేశారు. మొత్తంగా పోలీస్‌ వ్యవస్థ సరిగ్గా పని చేయడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కొత్త ఎస్పీ సత్య ఏసుబాబుకు మచ్చ ఖాయం. ఇప్పటికైనా ఆయన పని తీరులో దూకుడు పెంచాలి. పోలీసులను సరైన దారిలో నడిపించి నేరాల అదుపునకు నడుం బిగించాల్సి ఉంది. అప్పుడే పోలీసులపై జనానికి భరోసా వస్తుంది.  

రెండు నెలల్లో 14కు పైగా హత్యలు
ఒంగోలు క్రైం: కేవలం సెప్టెంబర్, అక్టోబర్‌(28 వరకు) జిల్లాలో 14కు పైగా హత్యలు జరిగాయి. అందులో ప్రధానమైనది సెప్టెంబర్‌ 28న ఒంగోలు నగరంలో జరిగిన వ్యాపార వర్గానికి చెందిన పల్లపోతు శ్రీనివాసులు, ప్రమీలా రాణిల దంపతుల హత్యలు.

సెప్టెంబర్‌ 16న వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ పరిధిలోని రామానగర్‌లో లక్ష్మీ మణితేజను ప్రేమించిన ఆటో డ్రైవర్‌ వల్లెపు గోపీచంద్‌ కిరాతకంగా హతమార్చాడు. నేటికీ నిందితుడిని పోలీసులు పట్టుకోనేలేదు.

అక్టోబర్‌ ఒకటిన ఒంగోలు ఉత్తర బైపాస్‌లోని మంగమ్మ కాలేజికి సమీపంలో నేతాజి కాలనీ వద్ద దుగ్గిరాల వివేక్‌ వంశీరాజ్‌ను ఇరువురు యువకులు కలిసి హత్య చేశారు.

చినగంజాం రొయ్యల చెరువుల వద్ద సోమిల లక్ష్మణరావును హత్య చేశారు.

ముంగమూరు రోడ్డు ఆశ్రమం సమీపంలో అంజలిని భర్తే హతమార్చాడు

సీఎస్‌పురం మండలం అంబవరంలో వృద్ధురాలు రంగమ్మను కుటుంబ సభ్యులే హత్య చేశారు.

జిల్లాలో అక్కడక్కడా మరో ఏడుకు పైగా హత్యలు జరిగాయి

దొంగతనాలు:
 ఒంగోలు నగర నడిబొడ్డున హత్యలతో పాటు దొంగతనాలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఒంగోలు ఒన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో ఐదు రోజుల క్రితం  మహాలక్ష్మీ నిలయంలో భారీ దొంగతనం చోటు చేసుకుంది. కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు అపహరించుకుపోయారు.

గత నెలలో కందుకూరులో వ్యాపారి సోమిశెట్టి వెంకట సత్య నారాయణ ఇంట్లో వంద సవర్ల బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు.

వేటపాలెంలో చీరాల ఎమ్మెల్యే సోదరుడి ఇంట్లో 250 సవర్ల బంగారు ఆభరణాలు, 25 కేజీల వెండి వస్తువులు, రూ.16 లక్షల నగదు దోచుకెళ్లారు.

ఇవికాకుండా జిల్లాలో ఎనిమిది చోట్లకు పైగా దొంగతనాలు చోటుచేసుకున్నాయి.

ఇక జిల్లాలో ఐదుకు పైగా చైన్‌ స్నాచింగ్‌లు జరిగాయి.  ఈ సందర్భంగా 20 సవర్లకు పైగా బంగారు ఆభరణాలను లాక్కెళ్లారు.

ఐదుగురు బాలికలు, ఒక మహిళపై లైంగికదాడులు, లైంగికదాడి యత్నాలు చోటు చేసుకున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement