రావులపాలెం(కొత్తపేట): రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించి రవాణా చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ టి.రామ్మోహనరెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి కాకినాడ పోర్టుకు తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని ఆదివారం రాత్రి రావులపాలెం మండలం రావులపాడు వద్ద విజిలెన్స్ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. సోమవారం తెల్లవారు జామున 3.30 గంటల వరకు దీనిపై అధికారులు విచారణ నిర్వహించారు. ఈ లారీలో మొక్కజొన్న తరలిస్తున్నట్టు బిల్లులు పెట్టుకుని రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్టు నిర్ధారణ అయ్యింది.
దీంతో డ్రైవర్ రమావత్తు శివనాయక్‌ను అరెస్టు చేసి లారీని సీజ్ చేశారు. ఎంఎస్‌ఓ టి.సుభాష్, వీఆర్వో రవిశంకర్ సమక్షంలో విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రామ్మోహనరెడ్డి మాట్లాడుతూ సీజ్ చేసిన 17 టన్నుల బియ్యం విలువ రూ.12.50 లక్షలు ఉంటుందన్నారు. దీనిపై రావులపాలెం పోలీసులకు ఎంఎస్‌ఓ ద్వారా ఫిర్యాదు చేశామన్నారు. డ్రైవర్‌తోపాటు బియ్యం రవాణా చేయిస్తున్న వ్యక్తిగా డ్రైవర్ చెప్పిన యర్రంశెట్టి సాంబశివరావుపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. దాడుల్లో విజిలెన్స్ తహసీల్దార్ జి.గోపాలరావు, ఎస్.రామకృష్ణ, రావులపాలెం ఎస్సై సీహెచ్ విద్యాసాగర్, ఏఎస్సై ఆర్‌వీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment