రేషన్ బియ్యానికి కొత్తరంగు
–పేదలకు ఇచ్చే బియ్యానికే మరో ధర కిలో రూ.23.50
- తెల్లకార్డు లేనివారిపై ప్రభుత్వం చూపుతున్న ఉదారత
– జిల్లాకు 6 వేల టన్నుల కోటా విడుదల
అనంతపురం అర్బన్ : తెల్లకార్డు లేని వారికి ఆధార్ కార్డు ద్వారా కిలో బియ్యం రూ.23.50 పైసలకు ఇస్తామని ప్రభుత్వం ఎంతో ఉదారత చూపింది. ఈ ప్రకటన వినగానే ప్రజలు కూడా ఎంతగానో సంతోషించారు. మార్కెట్ ధర కంటే తక్కువగా వస్తాయని ఆశించారు. అయితే అసలు తిరకాసు ఇక్కడే ఉంది. ఆధార్ కార్డుకి ఇచ్చేది మసూరి బియ్యమో లేక బీపీటీ రకం కాదు.... అసలు సిసలైన రేషన్ బియ్యం. ప్రస్తుతం దారిధ్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు తెల్లరేషన్ కార్డుకు కిలో రూపాయి ఇస్తున్న బియ్యాన్ని కార్డు లేనివారికి రూ.23.50 పైసలకు ఇచ్చేందుకి సిద్ధపడింది. ఈ ధరతో విక్రయించేందుకు జిల్లాకు ఆరు వేల టన్నలు బియ్యం విడుదల చేసింది. కిలో రూ.23.50 ప్రకారం చూస్తే వీటి విలువ రూ.14.10 కోట్లు.
ఇదో రకం ప్రభుత్వ వ్యాపారం
రేషన్ బియ్యాన్ని కార్డులు లేని ప్రజలకు ఇచ్చేందుకు ప్రభుత్వం తన తరహాలో వ్యాపారానికి తెరలేపినట్లు స్పష్టమవుతోంది. రూపాయికి ఇస్తున్న బియ్యాన్ని అధిక ధరకు విక్రయించేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. వాస్తవంగా తెల్లకార్డులకు ఇస్తున్న బియ్యాన్ని ప్రభుత్వం కిలో రూ.27తో కొనుగోలు చేస్తుంది. రూ.26 సబ్సిడీతో రూపాయికి అందజేస్తోంది. ఈ లోటును పూడ్చుకునేందుకు తెల్లకార్డు లేనివారికి ఆధార్ కార్డు ద్వారా కిలో బియ్యం రూ.23.50 పైసలకు ఇవ్వాలనే నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా జిల్లాకు 6 వేల టన్నుల బియ్యం కోటాని విడుదల చేసింది. ఈ మేరకు జిల్లాలో రూ.14.10 కోట్ల వ్యాపారానికి శ్రీకారం చుట్టింది. కిలో బియ్యం రూ.23.50 ప్రకారం ఆరు వేల టన్నులు విక్రయిస్తే రూ.14.10 కోట్లు వస్తుంది. ఇలా సబ్సిడీ ద్వారా వచ్చే మొత్తంతో లోటును ప్రభుత్వం భర్తీచేయనుంది.