ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం) అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. ఐదు నెలల క్రితం పుస్తకాలు మారితే ఇప్పుడు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడమేమిటనే విమర్శ లు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు 50 శాతం సిలబస్ కూడా అయిపోయింది. ఈ శిక్షణలు నిధుల వృథాకు తప్పితే ప్రయోజనం ఉండద ని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. వేసవిలో ఇచ్చి ఉంటే మేలు జరిగేదని వారు పేర్కొంటున్నారు.
సిలబస్‌పై ప్రభావం
విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లో మార్పు చేసింది. ఇందులో భాగంగా నాలుగో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు తెలుగు, ఆంగ్లం, హిందీ, గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రం పాఠ్యాంశాలు మారాయి. వీటికోసం ఈనెల 4 నుంచి డిసెంబర్ 14 వరకు ప్రాథమిక స్థాయిలో బోధించే ఉపాధ్యాయులకు, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు ఈనెల 27 వరకు శిక్షణ ఇస్తున్నారు. ఒకే పాఠశాల నుంచి ఆంగ్లం, తెలుగు, హిందీ, గణితం, సామాన్య, సాంఘికశాస్త్రం బోధించే ఉపాధ్యాయులు శిక్షణ తరగతులకు వెళ్లడంతో పాఠశాలల్లో ఒకరిద్దరు ఉపాధ్యాయులే ఉంటున్నారు. దీంతో విద్యార్థులపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. వీరిలో కొందరు పదో తరగతి బోధించేవారు ఉండడంతో సిలబస్ వెనుకబడిపోతుంది. అదేవిధంగా ఏకోపాధ్యాయ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు కూడా శిక్షణ కల్పించడంతో పాఠశాలలు మూతబడుతున్నాయి. ఇవే శిక్షణలు వేసవి సెలవుల్లో ఇచ్చిఉంటే విద్యార్థులకు మేలు ఉండేది. శిక్షణకు వస్తున్న ఉపాధ్యాయులు కూడా నామమాత్రంగా వచ్చి వెళ్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పూర్తిస్థాయిలో శిక్షణ పొందకుండా, విద్యార్థులకు సిలబస్ పూర్తి చేయకుండా పోతోంది. ఇప్పటికే డైట్ కళాశాల ఆధ్వర్యంలో సైన్స్ ఉపాధ్యాయులకు కౌమర విద్యపై మూడురోజులపాటు శిక్షణ నిర్వహించారు. శిక్షణ తరగతులన్నీ ఒకేసారి నిర్వహించడంతో సిలబస్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది.
నిధులు వృథా
ఆర్వీఎం ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల శిక్షణ కోసం కేటాయించిన నిధులు వృథా అవుతున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో బోధిస్తున్న 2,500 మంది ఉపాధ్యాయులకు 24 మండలాల్లో శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. మండలానికి సుమారు రూ.40 వేల చొప్పున నిధులు కేటాయించారు. వీటికి సంబంధించి రూ.10 లక్షలు కేటాయించారు. అదే విధంగా ప్రాథమికోన్నత పాఠశాలల్లో సైన్స్, సాంఘికశాస్త్రం, గణితం బోధిస్తున్న ఉపాధ్యాయులు 3,600 మందికి ఐదు డివిజన్ కేంద్రాల్లో శిక్షణ తరగతులు కొనసాగుతోంది. ఒక్కొక్క డివిజన్‌కు రూ.లక్ష వరకు కేటాయించారు. ఉపాధ్యాయులకు భోజనంతోపాటు బస్సు చార్జీలు కూడా ఇస్తున్నారు. ఒక్కో ఉపాధ్యాయునికి మూడు రోజులపాటు శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణకు మొత్తం రూ.25 లక్షల వరకు నిధులు కేటాయించినట్లు ఆర్వీఎం అధికారులు పేర్కొంటున్నారు.
‘ఆర్వీఎం’ ఆలస్యం గురూ..
Published Sat, Nov 23 2013 5:40 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement