సాక్షి, సంగారెడ్డి : భారీ వర్షాలు, వడగండ్ల వానలు, కరువు కాటకాలతో జరిగిన పంట నష్టంపై అంచనాల తయారీ భారం అధికారుల నెత్తిపై పడింది. నష్టపోయిన రైతులకు సంబంధించిన సమగ్ర సమాచారంతో కంప్యూటరైజ్డ్ జాబితాలు, నివేదికలు తయారీకి ఖర్చులు క్షేత్ర స్థాయి వ్యవసాయ అధికారులే భరిస్తున్నారు. గత నెలలో కురిసిన వర్షాలతో సంభవించిన పంట నష్టంపై జిల్లా వ్యాప్తంగా గణన జరుగుతోంది. దీనికయ్యే ఖర్చు విషయమై గత నెల 28న కలెక్టర్ స్మితాసబర్వాల్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలువురు తహశీల్దార్లు, వ్యవసాయ అధికారులు ఈ అంశాన్ని ప్రస్తావించారు కూడా.
2009-10 మధ్య కాలంలో తహశీల్దార్లు, మండల వ్యవసాయ అధికారు లు సంయుక్తంగా బాధితులకు చెక్కులు పంపిణీ చేసేవారు. ఆ తర్వాత కాలం నుంచి కంప్యూటరైజ్డ్ జాబితాల తయారీ (హార్డ్, సాఫ్ట్ కాపీలు) ప్రారంభమైంది. అదే విధంగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఇన్‌పుట్ సబ్సిడీని బదిలీ చేసే విధానం అమల్లోకి వచ్చింది. దీంతో అధికారులకు పని భారం పెరిగింది. రైతుల పేర్లు, నష్టపోయిన పంటలు, విస్తీర్ణం, ప్రతిపాదించిన పరిహారం, బ్యాంకు ఖాతా నంబర్లు, బ్రాంచ్ పేరు తదితర సమాచారంతో గ్రామాల వారీగా జాబితాలు రూపొందిస్తేనే ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేస్తున్నారు. వ్యవసాయ శాఖ జేడీ కార్యాలయానికి రెండు సెట్లు, జిల్లా ఖజానా కార్యాలయం, మండల వ్యవసాయ శాఖాధికారి కార్యాలయం, తహశీల్దార్ కార్యాలయాలకు ఒక్కో సెట్ చొప్పున ఈ జాబితాల హార్డ్ కాపీలను సమర్పించాల్సి ఉంటుంది. దీంతో ఒక్కో గ్రామానికి సంబంధించి మొత్తం ఆరు సెట్ల జాబితాలు తయారీ చేయాల్సి వస్తోంది.
కంప్యూటర్‌లో డాటా ఎంట్రీ, ఆ తర్వాత జాబితాల ప్రింటింగ్‌కు అయ్యే ఖర్చులను ఇప్పటి వరకు మండల వ్యవసాయ అధికారులే భరిస్తూ వస్తున్నారు. జాబితాల తయారీకి ఒక్కో రైతుపై రూ.3 నుంచి రూ.5 వరకు వ్యయం అవుతోందని జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. 2009 నుంచి 2012 వరకు తొమ్మిది పర్యాయాలు జరిపిన సర్వేలకు సంబంధించి మొత్తం రూ.36,55,134 ఖర్చు చేసినట్లు అధికారులు లెక్క కట్టారు. ప్రస్తుతం పంట నష్టంపై గణన జరుగుతున్న నేపథ్యంలో గతంలో ఖర్చు చేసిన ఈ నిధులను తక్షణమే విడుదల చేయాలని జేడీఏ కార్యాలయం ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాసింది.
వీడియో అ‘ధన’పు భారం
ఇదిలా ఉండగా.. ఈ సారి గణనలో నష్టపోయిన పంటల వీడియోలు తీయాలనే నిబంధన అమల్లోకి తెచ్చారు. వీడియో రికార్డింగ్‌కు అయ్యే ఖర్చులపై సైతం క్షేత్ర స్థాయి అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ముందే గ్రామాలకు వెళ్లి పంట నష్టపోయినట్లు ధ్రువీకరించుకున్న తర్వాతే అక్కడికి ప్రైవేటు వీడియో గ్రాఫర్లను తీసుకెళ్తున్నారు. ఈ ఖర్చులపై సైతం క్షేత్ర స్థాయి అధికారులు జిల్లా వ్యవసాయ కార్యాలయానికి నిత్యం సంప్రదిస్తున్నారు. మరి ప్రభుత్వం చెల్లిస్తుందో లేదో చూడాలి.