పొలాలనన్నీ..హలాలతో..దున్ని..ఆరుగాలం శ్రమించి కష్ట సేద్యం చేసి పంటను అమ్ముకున్నా..వారి కష్టానికి అందాల్సిన సొమ్ము అందక రైతులు దీనంగా ఎదురు చూస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ధాన్యం అమ్మిన రెండురోజుల్లో రైతుకు సొమ్ము చెల్లిస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు వారికి చుక్కలు చూపిస్తోంది. ధాన్యం అమ్మిన సొమ్ముకోసం కొనుగోలు కేంద్రాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూ రైతులు ఉసూరుమంటున్నారు.
నాపేరు వేచలపు రాంబాబు. మాది గం ట్యాడ మండలం పెదవేమలి గ్రా మం. నేను మా మండలంలోని రావి వలస ధాన్యం కొనుగోలు కేంద్రానికి గత నెల 23వతేదీన 10 క్విం టాళ్ల ధాన్యం తీసుకుని వెళ్లాను. నాకు రూ.14, 144 డబ్బులు వస్తాయని ట్రక్‌షీట్ రాసి ఇచ్చారు. కొనుగోలు కేంద్రం వారు అడిగిన ధ్రువపత్రాలు అన్నీ అందజేశాను. ఇంతవరకు డబ్బులు పడలేదు. ఇప్పటికి ఐదు సార్లు కొనుగోలు కేంద్రానికి వెళ్లాను. ఎప్పుడు వెళ్లినా ఇదిగో పడతాయి, అదిగో పడతాయని చెబుతున్నారు
నాపేరు కోరుపోలు రాము. మాది గంట్యాడ మండలం లక్కిడాం గ్రామం. నేనుగత నెల22వతేదీన రావివలస కొనుగోలు కేంద్రానికి 30 క్వింటాళ్ల ధాన్యం తీసుకుని వెళ్లాను. నాకు రూ.41,344 వస్తాయని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ట్రక్‌షీట్ ఇచ్చారు. ఇప్పటికి ఆరు సార్లు కొనుగోలు కేంద్రానికి వెళ్లాను. ఎప్పుడు అడిగినా డబ్బులు పడతాయనే చెబుతున్నారు. ఎప్పుడు అందు తాయోనని ఎదురుచూస్తున్నాను. ఇది ఈఇద్దరి రైతుల పరిస్థితే కాదు.
జిల్లాలోని వందలాదిమంది రైతులు ఎదుర్కొంటున్న సమస్య.
విజయనగరంవ్యవసాయం: కొనుగోలు కేంద్రాలకు ధాన్యం అమ్మిన రైతులు డబ్బుల కోసం వాటి చుట్టూ తిరగలేక అవస్థలు పడుతున్నారు. దళారులతో సంబంధం లేకుండా రైతులకు లబ్ధిచేకూర్చాలనే ఉద్దేశంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించారు.
రైతులు ధాన్యం ఇచ్చిన రెండు రోజుల్లో డబ్బులు వారిబ్యాంకు ఖాతాలో జమచేస్తామని ప్రకటించారు. అయితే రైతులు ధాన్యం ఇచ్చి నెలకు పైగా అవుతున్నా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమకాలేదు. దీంతో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు రైతులకు సమాధానం చెప్పలేకపోతున్నారు. బిల్లులు రాకపోవడంతో రెండు రోజులుగా ధాన్యం కొనుగోలును నిలిపివేశారు. అష్టకష్టాలు పడి పండించిన ధాన్యం డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం చుక్కలు చూపిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు.
రూ.కోట్లలో బిల్లుల బకాయిలు
జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి సుమారు రూ.2 కోట్లకు పైగా బిల్లులు బకాయిలు చెల్లించాల్సి ఉంది. అన్ని కొనుగోలు కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఒక రావివలస కేంద్రంలోనే రూ.20 లక్షల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారం.
చెమట చుక్కకు దక్కని రొక్కం
Published Sat, Feb 7 2015 3:23 AM | Last Updated on Sat, Sep 2 2017 8:54 PM
Advertisement