మెతుకు సీమలో మెతుకు కరువు | weather drought in medak district | Sakshi
Sakshi News home page

మెతుకు సీమలో మెతుకు కరువు

Published Tue, Apr 26 2016 11:02 AM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

మెతుకు సీమలో మెతుకు కరువు - Sakshi

మెతుకు సీమలో మెతుకు కరువు

కరువు కోరల్లో మెదక్ జిల్లా విలవిల
 ఎక్కడికక్కడ ఎండిపోయిన చెరువులు, ప్రాజెక్టులు    
 ఎడారిని తలపిస్తున్న మంజీరా నది పరీవాహక ప్రాంతం
 పంటలు ఎండి.. అప్పులు పెరిగి రైతన్న దిగాలు.. రోజుకోచోట బలవన్మరణం!
 కుప్పకూలిన సాగు.. అనుబంధ రంగాలు, చేతి వృత్తులకు కష్టకాలం    
 చుక్కనీటి కోసం తల్లడిల్లుతున్న తండాలు.. నీటి కోసం మైళ్ల కొద్దీ నడక

 

మెతుకు సీమ.. మెదక్‌కు మరో పేరు. అంటే  బువ్వ పెట్టే ప్రాంతమని అర్థం! ఇప్పుడా మెతుకు సీమలో కరువు ఉరుముతోంది. సాగు చతికిలబడింది. పాడి పాడెక్కుతోంది. జిల్లాలో ఏ పల్లెను చూసినా, ఏ ప్రాంతానికి వెళ్లినా కరువు రక్కసి కర్కశ కోరలే కనిపిస్తున్నాయి. వ్యవసాయం కుప్పకూలడంతో దాని అనుబంధ రంగాలు, కుల వృత్తులపై ఆధారపడ్డ బతుకులు ఛిద్రమవుతున్నాయి. చివరికి పశువులకు నీళ్లు కూడా పైసలు పెట్టి కొనాల్సిన దుస్థితి నెలకొంది.
 
  అటు పంటలు చేతికందక, అప్పులు మీద పడి రైతులు తనువులు చాలిస్తున్నారు. జిల్లాలో ప్రతిరోజూ ఏదో ఒక మూలన రైత న్న ప్రాణాలు తీసుకుంటున్నాడు. గడిచిన రెండేళ్ల కాలంలో దాదాపు 600పైగా రైతులు చనిపోయారు. లక్షల మంది యువత ఉన్న ఊరును వదిలి వలసబాట పట్టారు. మెతుకు సీమలో కరువు ధాటికి విలవిల్లాడుతున్న పల్లె బతుకులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
 - వర్ధెల్లి వెంకటేశ్వర్లు, సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి
 
 
 ఇది 110 ఏళ్ల చరిత్ర గల ఘనపురం ప్రాజెక్టు! ఇన్నేళ్లలో ఎన్నడూ ఎండిపోలేదు. కానీ ఇప్పుడు చుక్కనీరు కూడా కనిపించడం లేదు. ఈ ప్రాజెక్టు నిండితే 30 వేల ఎకరాల వరిపంటకు సాగునీరు అందేది. నీళ్లు లేకపోవడంతో దీని పరిధిలోని పంటలన్నీ ఎండిపోతున్నాయి. ఇదే కాదు.. 35 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనిది మంజీరా కూడా ఎడారిని తలపిస్తుండడంతో నదీ తీరంలోని అనేక పల్లెలు కళ తప్పాయి!
 
 
 చెప్పుకుంటే గుండె ‘చెరువు’..
 జిల్లాలో మొత్తం 7,972 చెరువులు ఉన్నాయి. సమృద్దిగా వర్షాలు కురిసి ఇవి నిండితే దాదాపు 47 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంటాయి. నడి వేసవిలో కూడా చెరువుల్లో కనీసం 10 నుంచి 12 టీఎంసీల నీళ్లు ఉండేవని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. అలాంటిది వరుసగా రెండేళ్ల నుంచి అసలే వర్షాలు లేకపోవటంతో చెరువుల్లోకి చుక్క నీరు చేరలేదు. దీంతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. మంజీరా లాంటి జీవ నదులు ఎండిపోయాయి. ఘనపురం ప్రాజెక్టు ఎడారిలా మారింది. సింగూర్ నుంచి ఏటా 4 టీఎంసీల నీరు ఈ ప్రాజెక్ట్‌కు వస్తుంది. ఈ నీటితో వరి పంట పండితే ఏటా 6.25 లక్షల వరి ధాన్యం దిగుబడి వచ్చేది. కానీ ఇప్పుడు పూర్తిగా ఎండిపోవడంతో సాగుభూములన్నీ బీడుగా మారిపోయాయి. జిల్లాకే కడుపు నిండా బువ్వ పెట్టే ఈ మంజీరా తీరం వెలవెలబోతోంది.
 
 ఈ తీరంలో పండే వరి పంటల ద్వారా సుమారు 50 లక్షల గడ్డిమోపుల వ్యాపారం సాగేది. పశువులకు కడుపు నిండా గడ్డి దొరికేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. నదీ తీరంలో ఒకప్పుడు సిరిసంపదలతో వెలుగు వెలిగిన కొంపల్లి, చీకోడ్ లింగాయపల్లి, డాక్యాతండా, గాజులగూడెం, గాజిరెడ్డిపల్లి, తిమ్మానగర్, మక్తభూపతిపూర్, సాధుతండా తదితర పల్లెలన్నీ కళ తప్పాయి. ఈ పల్లెల రైతులు పొట్ట చేత పట్టుకొని పట్ణణానికి వలస పోయారు.
 
 అప్పులిచ్చేవాళ్లూ వెళ్లిపోతున్నారు
 దౌల్తాబాద్ మండలం ఎల్కల్ గ్రామం. ఎద్దు, ఎవుసంతో ఒకప్పుడు వరి కంకిలా ఎదిగిన పల్లె. వరుస కరువుతో ఇప్పుడా పల్లె రూపే మారిపోయింది. ఎల్కల్ దాని చుట్టు పక్కల పల్లెల్లో కలిపి ఈ ఐదేళ్ల కాలంలో 70 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులు అప్పులు తిరిగిచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఇంతకాలం రైతులకు అప్పులిచ్చి వడ్డీ వ్యాపారం చేసుకునే ఊరి షావుకార్లు కూడా తమ వ్యాపార స్వరూపం మార్చుకున్నారు. సమీప పట్టణాలక పోయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అటు బ్యాంకుల నుంచి అప్పులు అందక, ఇటు అప్పులిచ్చే షావుకార్లు లేకపోవడంతో రైతుకు ఎక్కడా అప్పు పుట్టడం లేదు.
 
 ఎడ్లనూ అమ్మేసుకున్నాం..
 ‘‘రెండున్నర ఎకరాల్లో  పొలం పెట్టినం. ఎకరా 30 గుంటల్లో పంట ఎండిపోయింది. ఇంకో ఎకరంలో బొందు మిగిలింది. ఉన్న రెండు ఎడ్లను మెదక్ అంగట్లో అమ్ముకున్నాం. ఎండిన పంటను కోసి గడ్డి కోసం అమ్ముతున్నం. గత ఏడాది బిడ్డపెళ్లి చేశాం. ఈసారి పంట పండితే మొదటి బిడ్డ పెళ్లికి అయిన అప్పులు తీర్చి మరో బిడ్డపెళ్లి చేద్దామనుకున్న. కాని దేవుడు సక్కగ చూడలేదు. ఎండిన పంట చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి’’
 - రత్నయ్య, కాంతమ్మ దంపతులు, అన్నారం, మెదక్
 
 చుక్కనీటి కోసం మైళ్ల నడక
 నీళ్ల కోసం పల్లెలు తల్లడిల్లుతున్నాయి. నారాయణఖేడ్ లాంటి ప్రాంతాల్లో నీళ కోసం జనం మైళ్ల దూరం నడిచివెళ్తున్నారు. ఇక  తండాల పరిస్థితి మరీ దారుణం. నీళ్లు లేక జిల్లాలో దాదాపు 30 శాతం ఊళ్లు వలస వెళ్లాయి. మంజీరా ఎండిపోవటం, దానిపై నిర్మించిన రక్షిత మంచినీటి పథకాలకు నీరు లేకపోవడంతో జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రతరమవుతోంది. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో నీటి కొరత కనిపిస్తోంది. గతేడాది 18.92 మీటర్లు లోతులో ఉన్న భూగర్భ జలాలు ప్రస్తుతం 24.22 మీటర్ల లోతుకు పడిపోవడంతో బోర్లన్నీ ఎండిపోయాయి.
 
 మూగజీవాల
 కబేళా బాట..!
 పంట పోయి, కుంటలు ఎండిపోవడంతో రైతులకు పశువులు భారమయ్యాయి. మూగజీవాలను పోషించలేక కబేళాలకు అమ్ముకుంటున్నారు. మెదక్ జిల్లాలో 8.81 లక్షల పశువులున్నాయి. ప్రతి పశువు రోజూ కనీసం 4 కిలోల గడ్డి తింటుంది. ఈ లెక్కన ఏడాదికి  7.92 లక్షల టన్నుల పశుగ్రాసం కావాలి. అయితే వరిసాగు పూర్తిగా పడిపోవటంతో గ్రాసానికి కొరత ఏర్పడింది. ఈ వేసవి నుంచి గెట్టక్కడానికి కనీసం 50 వేల టన్నుల పశుగ్రాసం అవసరం. అయితే పశు సంవర్థక శాఖ అధికారులు 5 వేల ఎకరాల్లో గడ్డి పెంచేందుకు ప్రణాళికలు వేశామని చెప్తున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితి చూస్తే అది కూడా వాస్తవ విరుద్ధంగానే ఉంది. కనీసం వెయ్యి ఎకరాల్లో కూడా గడ్డి పెంచిన దాఖాలు కనిపించలేదు.
 
 అధికారిక లెక్కల ప్రకారం ఇప్పుడున పశుగ్రాసం కొరత తీరాలంలే కనీసం 15 నుంచి 20 వేల ఎకరాల్లో  రెండు నెలల పాటు గడ్డి పెంచాలి. కానీ ప్రస్తుతానికి బోర్ల నుంచి చుక్కనీళ్లు రావక పోవటంతో గడ్డి పెంచే పరిస్థితులు లేవు. పశుపోషణ భారమై రైతులు మూగజీవాలను తెగనమ్ముకుంటున్నారు. గడిచిన మూడేళ్ల కాలంలో జిల్లాలో పశుసంపద 60 శాతానికి పడిపోయిందని పశువైద్యులు కొందరు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు.
 
 టీకొట్టూ మూతపడింది
 ఈ పాడుబడిన ఈ గుడిసె మెదక్ మండలం గాజిరెడ్డిపల్లె బతుకు చిత్రానికి నిదర్శనం. ఒకప్పుడు ఇది ఓ టీకొట్టు. కలకుంట్ల శ్రీహరి అనే వ్యక్తికి జీవనాధారం. ఈ హోటల్‌తోనే బతుకుబండిని నెట్టుకొచ్చేవాడు. వరుస కరువు ఊరు మీద పడడంతో ఉపాధి లేక యువత వలస వెళ్లింది. 150 కుటుంబాలున్న ఈ ఊళ్లో 70 శాతం కుటుంబాలు దుబాయి, మస్కట్, హైదరాబాద్ వెళ్లాయి. హోటల్‌కు వచ్చేవారే కరువవడంతో శ్రీహరి కూడా కొట్టును మూసేసి కుటుంబంతో హైదరాబాద్ బాటపట్టాడు.
 
 కూలిపోతున్న కులవృత్తులు
 వరుస కరువు చేతి వృత్తులు, కుల వృత్తులను కూడా బాగా దెబ్బతీసింది. కుమ్మరి, కమ్మరి, గౌడ కుల వృత్తులు కుదేలయ్యాయి. నీళ్లు లేక ఈత వనాలు ఎండిపోయాయి. దీంతో గీత కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్ ఈత వనాలకు పెట్టింది పేరు. ఎక్సైజ్ లెక్కల ప్రకారం 80 వేల ఈత చెట్లు ఈ ఊరి సొంతం. ఈ ఊరితోపాటు పక్కన ఉన్న ముస్లాపూర్, పోతుల బోగుడ, బరెందిబ్బ, బిజిలీపూర్, మరవెల్లి, నాగులపల్లి తదితర గ్రామాల నుంచి గీత కార్మిక కుటుంబాలు ఇక్కడ కల్లు తీసేవి.
 
 రోజుకు 4 లారీల కల్లు హైద్రాబాద్, నర్సాపూర్ తదితర ప్రాంతాలకు సరఫరా చేసేవాళ్లు. ప్రస్తుతం ఇక్కడ 10 వేలకు మించి చెట్లు లేవు. గడిపెద్దాపూర్‌లో గీత కార్మిక కుటుంబాలు ఒకప్పుడు 70 వరకు ఉండేవి. ఇప్పుడు 20 మాత్రమే ఉన్నాయి. మిగతావారు హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. గీతపై ఆధారపడే కుమ్మరి వృత్తి ఉంటుంది.
 
  కల్లు నిల్వకు, కొలమానానికి కుమ్మరులు తయారుచేసే కుండలు వాడుతారు. గీత వృత్తి దెబ్బతినడంతో మట్టి పాత్రలకు డిమాండ్ పడిపోయింది. సారె పని చేసే కుమ్మరి యాదయ్యను పలకరించగా..‘‘మా నాయిన కుండలు చేసినప్పుడు ఏడాది రూ.70 వేల దాకా వచ్చేయి. రూ.40 వేలు మేం తింటే 30 వేలు ఎనకేసుకునేటోళ్లం. ఇప్పుడు కల్లు పోయింది. కరవొచ్చింది. కుండల గిరాకీ పూర్తిగా పడిపొయింది’’ అని ఆయన చెప్పారు.
 
 తుడిచిపెట్టుకుపోయిన పంటలు..
 రెండేళ్ల నుంచి కరువుబారిన పడిన రైతన్నపై ఈసారి కూడా దెబ్బ పడింది. జిల్లాలో 5.47 లక్షల హెక్టార్ల సాగు భూమికిగాను ఖరీఫ్ లో 4.15 లక్షల హెక్టార్లలో మాత్రమే విత్తనాలు వేశారు. వానల్లేక పంటలు ఎక్కడికక్కడ ఎండిపోయాయి. సుమారు ఒక లక్ష ఎకరాల ఆరుతడి పంటల నుంచే కాస్తోకూస్తో దిగుబడి వచ్చింది. ఇక రబీ అయితే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. కేవలం 39 వేల హెక్టార్లలో మాత్రమే రైతులు పంటలు వేయగా.. అందులో 10 వేల హెక్టార్లలో మాత్రమే పంట  చేతికి వచ్చింది. టెక్మాల్ మండలం దనూరు గ్రామానికి చెందిన రూతు డాకూరి మొగులయ్యను పలకరించగా.. ‘‘30 ఏండ్ల సంది ఇటువంటి కాలం సూడలేదు. విత్తనం ఏసుడేకాని చేతికైతే ఇత్తు రాలే. నాకు ఏడెకరాల భూమి ఉంటే. ఆరేండ్ల నుంచి బోర్లు వేస్తూనే ఉన్నా. ఒక్క బోరు కూడా పడ్తలేదు. ఇప్పటికి 30 బోర్లు వేసిన. నీళ్లు పడితే ఉన్న 7 ఎకరాలు సాగు చేసుకుందాం అనుకున్నా. ఇప్పుడు రెండు ఎకరాల్లో మొక్కజొన్న  వేసిన కానీ పెట్టుబడులు కూడా వచ్చేటట్టు లేవు. భూమిని నమ్ముకున్న మాకు అప్పులే మిగులుతున్నాయి’’ అంటూ గోడు వెల్లబోసుకున్నాడు.
 
 పశువులకు నీళ్లు కొనాల్సిందే..
 మెదక్ మండలం రాయిన్‌పల్లి పంచాయతీ పరిధి మల్కాపూర్ గిరిజన తండా వాసులు నీళ్లు కొని పశువులకు తాపుతూ కనిపించారు. 20 కుటుంబాలున్న ఈ తండాలో ఒక్కో ఇంట్లో 20 నుంచి 50 వరకు పశువులున్నాయి. నీటికి కరువు రావడంతో తండావాసులంతా ఇంటికి కొంత డబ్బులు వసూలు చేసి తండా సమీపంలోని ఓ రైతు బోరును అద్దెకు తీసుకున్నారు. ఓ జేసీబీతో గుంత తోడి రోజూ అందులో నీళ్లు నింపి పశువులకు తాపుతున్నారు. నారాయణఖేడ్, మనూరు, కంగ్టీ, మెదక్, శివ్వంపేట, ఆందోల్ మండలాల్లో ఈ పరిస్థితి కనిపించింది.
 
 మధ్యాహ్న భోజనానికి తిప్పలే
 మధ్యాహ్న భోజనానికి నీటి  తిప్పలు తప్పటం లేదు. జిల్లాలో 2,358 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. దాదాపు 2 వేల పాఠశాలల్లో మంచినీటి కటకట ఉంది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని చూసేందుకు ‘సాక్షి’ ఢాక్యా తండాలో ప్రాథమిక పాఠశాలకు వెళ్లింది. ఇక్కడ రెండు బోర్లున్నా.. చుక్కనీరు కూడా రావటం లేదు. ఒకప్పుడు ఈ తండాలో 200లకుపైగా వ్యవసాయ బోర్లు ఉండేవట. ఇప్పుడు 3 బోర్లలోనే నీళ్లు వస్తున్నాయి. పాఠశాలలో మొత్తం 73 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంటి నుంచి విద్యార్థులు తెచ్చుకున్న బాటిల్ నీళ్లు భోజనానికి ముందు చేతులు, గిన్నె కడుక్కునేందుకు సరిపోయాయి. అన్నం తిన్నాక గొంతు తడుపుకునేందుకు, గిన్నె కడుక్కునేందుకు నీళ్లు లేవు. విద్యార్థులంతా ఎంగిలి చేతితోనే వెళ్లిపోవటం కనిపించింది. సోమ్లా తండా, అమ్రియాతండా, రాజ్యాతండా, అర్కెల తండా, మొదల్లకుంట తండా, ధూంలా తండా, మల్లంపేట, పొడిచన్‌పల్లి, మదిర కొత్తపల్లి, ఆరెపల్లి, చిన్నహరిజనవాడ తదితర పాఠశాలలో ఇదే పరిస్థితి కనిపించింది.
 
 అన్ని మండలాల్లో  కరువు పరిస్థితులు
 జిల్లాలో అన్ని మండలాల్లో కరువు ఉంది. కరువు సాయం కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపాం. ఆ నిధులు రాగానే రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తాం. మన ఊరు-మన వ్యవసాయం కింద గ్రామాల్లో జన సభలు ఏర్పాటు చేస్తున్నాం. పత్తితో పెట్టుబడికి తగిన గిట్టుబాటు లేదు. అందుకే ఈ పంట స్థానంలో సోయాబీన్ లాంటి పంటలు వేయాలని రైతులను ప్రోత్సహిస్తున్నాం.
 
 వేసవి నీటి ఎద్దడిని ఎదుర్కోవడం కోసం పక్కా ప్రణాళికతో ముందుకు పోతున్నాం. తాగునీటి కోసం రోజూ రూ.12 లక్షల చొప్పున ఖర్చు చేస్తున్నాం. నారాయణఖేడ్ పట్టణానికి నల్లవాగు నుంచి, కంగ్టి పట్టణానికి హోలాస్ నుంచి నీటి సరఫరా చేస్తున్నాం. నీటి కొరతను అధిగమించేందుకు రూ.37 కోట్ల నిధులు సిద్ధంగా ఉంచాం. త్వరలోనే గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలకు మిషన్ భగీరథ నీళ్లు అందుతాయి. నారాయణఖేడ్ నియోజకవర్గంలో పశు క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. ఈ క్యాంపుల్లో నీళ్లతోపాటు, పశుగ్రాసం అందిస్తాం.
 - రోనాల్డ్‌రాస్, మెదక్ కలెక్టర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement