విత్తనోత్పత్తి రైతుల గగ్గోలు
వీణవంక: విత్తన కంపెనీల మాయాజాలంలో పడి విత్తనోత్పత్తి రైతులు గగ్గోలు పెడుతున్నారు. పదిరోజుల్లో ఇస్తామన్న విత్తన ధాన్యం డబ్బులు.. మూడు నెలలైనా అందకపోవడంతో ముప్పు తిప్పలు పడుతున్నారు. జిల్లాలో విత్తనోత్పత్తికి అనుకూలమైన వాతవరణం ఉండటంతో 42 దేశీ, విదేశీ విత్తనోత్పత్తి వరి ధాన్యం కంపెనీలు 22 ఏళ్లుగా పాగా వేశాయి. మొదట్లో రైతులకు ధాన్యం అమ్మిన వెంటనే డబ్బులు చెల్లించేవారు. కానీ రానురాను మాయాజాలం ప్రదర్శిస్తున్నారు.
గత రబీలో జి ల్లాలో లక్ష ఎకరాల్లో ఆడ, మగ వరి సాగైంది. వాతావరణం సహకరించడంతో అనుకున్నదాని కంటే ఎక్కువ దిగుబడి వచ్చింది. 1.50 లక్షల క్వింటాళ్ల ధాన్యం చేతికి వస్తుందని కంపెనీలు అంచనా వేయగా దాదాపు మూడు లక్షల క్వింటాళ్ల ధాన్యం పండింది. ఏప్రిల్‌లో కంపెనీలు కళ్లాల వద్దే కాంటాలు వేసి ధాన్యాన్ని కొని.. లారీల ద్వారా తమ ప్రాంతాలకు తరలించుకున్నాయి. రైతులకు దాదాపు రూ.వంద కోట్లు రావాల్సి ఉంది.
నిలువుదోపిడీ
క్వింటాల్‌కు రూ.5-10వేలు చెల్లిస్తామని ఆశ చూపడంతో ఆ ధాన్యం సాగు చేసేం దుకు రైతులు మొగ్గు చూపారు. పంట దిగుబడి వచ్చిన రాకపోయిన ఆ ధర చె ల్లిస్తామని నమ్మించారు. అంతేకాకుండా నేరుగా రైతు ఖాతాలోనే జమవుతాయని ఆశ పెట్టారు. ధాన్యం కొనే సమయంలో తరుగు పేరిలా క్వింటాల్‌కు పది కిలోల చొప్పున తీసివేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని కంపెనీలు డీలర్లకు డబ్బులు చెల్లించినా వారు సొంతానికి వాడుకున్న ఘటనలు ఉన్నాయి. ఇటీవల వీణవంక మండలం లస్మక్కపల్లికి చెందిన తిరుపతిరెడ్డి అనే ఏజెంట్‌ను మహదేవపూర్ మండల రైతులు కిడ్నాప్ చేయడం సంచలనం రేపింది. డబ్బులు సకాలంలో ఇవ్వకుండా తిప్పుకుంటున్నాడని రైతులు సదరు ఏజెంట్‌ను చితకబాదారు. కొన్ని కంపెనీలు బోర్డు తిప్పేసేటట్టు ఉన్నాయని తెలుసుకున్న రైతు లు కంపెనీ ప్రధాన కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మంథని, జగిత్యాల, శంకరపట్నం, హుజూరాబా ద్, వీణవంక, జమ్మికుంట, పెద్దపల్లి, సు ల్తానాబాద్, పొత్కపల్లి మండలాల్లో ఎక్కువగా సాగు చేశారు.