ఆన్‌లైన్‌లో పడేదెలా? | crops in online | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో పడేదెలా?

Published Tue, Nov 24 2015 1:30 AM | Last Updated on Sun, Sep 3 2017 12:54 PM

crops in online

రికార్డులు అస్తవ్యస్తం కొనుగోలు ఎలా ?
 ఒకరి భూములు మరొకరి పేరున
 ధాన్యం కొనుగోలు  ప్రక్రియపై  రైతుల     ఆందోళన
 గత ఏడాది కొనుగోలు చేసిన ధాన్యం 2.80 లక్షల మెట్రిక్ టన్నులు
 రైతులకు చెల్లించిన సొమ్ము రూ.360కోట్లు  
 ఈ ఏడాది  లక్ష్యం 2.50 లక్షల మెట్రిక్ టన్నులు
 రైతులకు చెల్లించనున్న సొమ్ము సుమారు రూ.340 కోట్లు
 భూముల ఆన్‌లైన్‌కోసం వచ్చిన  దరఖాస్తులు లక్షా25వేలు
 పరిష్కరించామని చెబుతున్నవి నూరుశాతం
 పేరు మార్పు, తప్పుల సరికోసం అందినవి 70 శాతం   
 పరిష్కారం జరిగినవి  కాకిలెక్కలే !

 
 పక్క చిత్రంలో కనిపిస్తున్నది బాడంగి మండలం పిండ్రంగి వలస వీఆర్యే.  ఏం చేస్తున్నారంటే...ఈ క్రాప్ విధానంలో పంట రకాన్ని, విస్తీర్ణాన్ని, రైతు పేరును ట్యాబ్‌లో పొందుపరుస్తున్నారు.  రైతులకు ఉన్న భూముల్లో వారి చిత్రాన్ని పెట్టి తీయాల్సిన ఈ క్రాప్ ఫొటోను ఇలా రైతు లేకుండా తీస్తున్నా రు. ఎందుకంటే భూముల పేర్లు ఒకరివయితే అనుభవిస్తున్నది మరొకరు.  ఇప్పటికీ భూములు మాత్రం తాజా రికార్డులకు నోచుకోలేదు.
 
 ఈ చిత్రంలో వ్యక్తి బాడంగి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన జామి కృష్ణ . తెంటువలసలో తాను కొనుగోలు చేసిన ఎకరన్నర పల్లపు భూమిలో  వరి  పండించారు. అక్కడ అతనిని పెట్టి ఫొటో తీసేందుకు సంబంధిత రెవెన్యూ అధికారి రమ్మంటే వెళ్లారు. ఫొటో తీసి సర్వే నంబ ర్ చూస్తే పాత యజమాని పేరు వచ్చింది. దీంతో ఆయన తెల్లబోయారు.
 
 గత ఏడాది జరిగిన అక్రమాలకు తావివ్వకుండా ఈ సారి పక్కాగా ధాన్యం కొనుగోలు చేస్తామని,  ఎట్టి పరిస్థితుల్లోనూ గింజ కూడా తేడా రాదని,  ఆన్‌లైన్‌లో భూముల వివరాలుంటాయనీ వాటి ద్వారా నేరుగా వారి అకౌంట్లకే బిల్లులు జారీ చేస్తామని అధికారులు చెబుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆన్‌లైన్‌లో భూముల నమోదు సక్రమంగా జరగకపోవడమే ఇందుకు కారణం.  గత ఏడాది బిల్లుల చెల్లింపులోనే తీవ్ర జాప్యం జరిగింది.   ఇప్పుడు  ఆన్‌లైన్ అంటుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
 
 విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలో ఇటీవల ఈ క్రాప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ ఏలు...రైతుల భూముల వద్దకే వెళ్లి వారి భూముల్లో ఏ  పంట ఉందన్న విషయాన్ని ఆన్‌లైన్ చేశారు.  ఇప్పటికే వెబ్‌ల్యాండ్‌లో ఉన్న భూముల వివరాల ఆధారంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. భూమి ఒకరి పేరున ఉంటే అక్కడ అనుభవిస్తున్న రైతు మరొకరుగా ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లోనూ పరిస్థితి ఈ విధంగానే ఉంది.  వీటిని పరిష్కరించడానికి జిల్లాలో   మీ ఇంటికి మీ భూమి కార్యక్రమాన్ని రెండు విడతల్లో నిర్వహించారు.  గ్రామ సభల ద్వారా లక్షా 25వేల వినతులు వచ్చాయి.

ఇందులో  ఆన్‌లైన్  చేయాలని, రికార్డులు మార్చాలని, పేరు తప్పులు సరిదిద్దాలనే వినతులే దాదాపు 70 శాతం ఉన్నాయి. అయితే  సంబంధిత  సమస్యలను పరిష్కరించకుండా   మీ సేవల ద్వారా చేయించుకోవాలని రైతులకు ఉచిత సలహా ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు.  దీంతో  ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు.  తప్పులతడకలతో భూ రికార్డులు ఉన్నప్పుడు ఆన్‌లైన్‌లో ఉన్న భూముల పేర్ల ద్వారా ధాన్యం కొనుగోళ్లు ఎలా విజయవంతం చేస్తారో అధికారులే చెప్పాలి.
 
 సెప్టెంబర్ వరకూ అందని బిల్లులు

 గత ఏడాది సుమారు 2.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, దాదాపు రూ.360 కోట్లు రైతులకు చెల్లించారు.   అయితే చాలా మంది రైతులకు సెప్టెంబర్ వరకూ  బిల్లులు అందలేదు.  కలెక్టరేట్  గ్రీవెన్స్‌సెల్ లో పలుమార్లు రైతులు ఫిర్యాదు చేశారు. బియ్యం విక్రయించిన రైతుల పేరున వారికి బిల్లులు పెడితేనే ఏడాదంతా   ప్రహసనం కొనసాగింది. ఇప్పుడు మొత్తంగా ఆన్‌లైన్‌లో ఉన్న రైతుల పేర్లకే బిల్లులు చేస్తామంటే వారికి ఎంత మేరకు న్యాయం జరుగుతుందో అధికారులకే తెలియాలి.
 
 సరిచేయాలని ఆదేశాలిస్తాం
 తప్పులున్న మాట వాస్తవమే.  అయితే ధాన్యం తీసుకు వచ్చిన రైతు తన భూమి ఆన్‌లైన్‌లో నమోదు కాలేదని, వేరు వ్యక్తి పేరుందనీ చెబితే వెంటనే మార్చి ఆన్‌లైన్ చేయాలని సంబంధిత తహశీల్దార్‌లకు సూచనలు చేస్తాం. వారు యుద్ధప్రాతిపదికన ఆన్‌లైన్ చేస్తారు. లేదంటే మాన్యువల్‌గా సర్టిఫికెట్‌ను తహశీల్దార్ ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త ధాన్యం కొనుగోలు విధానం వల్ల  మీ ఇంటికి మీ భూమి, ఈ క్రాప్ నమోదులోని తప్పొప్పులను కూడా సవరించుకునే వీలుంది. ఓ పక్క కొనుగోలు జరుగుతుండగానే మరో పక్క రికార్డులు అప్‌డేట్ అవుతుంటాయి.
                                                                              -ఎం గణపతిరావు, జిల్లా మేనేజర్, పౌరసరఫరాల సంస్థ, విజయనగరం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement