బిచ్చగాళ్ల ఖాతాలు..రూ.లక్షల్లో లావాదేవీలు
అవాక్కయ్యారా!
అది బీహార్‌లోని ఓ గ్రామం.. ఓ కేసు దర్యాప్తులో భాగంగా బ్యాంకు ఖాతా వివరాల సేకరణకు సీసీఎస్ అధికారులు అక్కడికి వెళ్లారు. లక్షల్లో లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఇంకేముంది.. కేసు కొలిక్కి వచ్చేసినట్టేనని ఊపిరి పీల్చుకున్నారు. ఆ ఖాతాదారుడిని విచారిద్దామనుకున్న అధికారులు అవాక్కయ్యారు. ఎందుకంటే.. అతనో బిచ్చగాడు. ఈ వ్యవహారాన్ని లోతుగా ఆరా తీస్తే అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కథాకమామీషు ఏమిటంటే...
సాక్షి, సిటీబ్యూరో :
‘‘+92తో ప్రారంభమయ్యే ఫోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. లాటరీ తగిలిందని చెప్పడంతో నమ్మి నగదు బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేసి మోసపోయా’’... పోలీసులకు ఇటీవల వరుసగా వస్తున్న ఫిర్యాదులివి. ఇలాంటి ఓ కేసుకు సంబంధించి సీసీఎస్ అధికారుల దర్యాప్తులో పలు ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. ఫోన్ల ద్వారా లాటరీ తగిలిందంటూ, తక్కువ ధరకే వస్తువులంటూ సౌతాఫ్రికా దేశాలు కేంద్రంగా ప్రజలను మోసగిస్తున్న నైజీరియన్లు.. ఏ సందర్భంలోనూ ఇక్కడకు రాకుండా, పోలీసులకు ఆధారాలు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలాంటి స్కామ్స్‌లో బ్యాంకు ఖాతాలు ఎంతో కీలకం. వీటిని వారే నేరుగా తెరిస్తే పోలీసులకు దొరికే అవకాశాలు ఉంటాయి. దేశం బయట ఉన్న బ్యాంకులవి అయితే కస్టమర్లు అనుమానించే ప్రమాదం ఉంది. ఇలా కాకుండా ఉండేందుకు ఇక్కడివే, బోగస్ చిరునామాలతో ఉండేవి తప్పనిసరి. దీనికోసం నైజీరియన్లు భారీ పథక రచన చేస్తున్నారు. ముంబై, ఢిల్లీల్లో కొందరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతకు ఎరవేస్తున్నారు. ఈ ఏజెంట్లు చేయాల్సిందల్లా బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లోని గ్రామాలకు వెళ్లి బ్యాంకు ఖాతాలు తెరవడమే.
‘గుర్తింపు’న్న భిక్షగాళ్లతోనే..
ఆయా రాష్ట్రాలకు వెళ్తున్న ఈ ఏజెంట్లు అక్కడి గ్రామాల్లో సంచరిస్తూ ఆధార్ వంటి ధ్రువీకరణలు కలిగిన భిక్షగాళ్లు, పేదల్ని గుర్తిస్తున్నారు. ఒక రోజు కోసం ఆ గుర్తింపు పత్రాలతోపాటు వారి ఫొటోలు ఇస్తే రూ.2500 చెల్లిస్తామంటూ ఎర వేస్తున్నారు. ఇలా తీసుకున్న పత్రాలతో స్థానిక బ్యాంకుల్లో వారి పేర్లతోనే ఖాతాలు తెరుస్తున్నారు. అనంతరం గుర్తింపు పత్రాల్ని బిక్షగాళ్లు/పేదలకే ఇచ్చేస్తున్నారు. అయితే ఏటీఎం కార్డును మాత్రం సైబర్ నేరగాళ్లకు అప్పగిస్తున్నారు. ఈ ఖాతాల ఆధారంతో సైబర్ నేరగాళ్లు దేశవ్యాప్తంగా ఉన్న అనేకమందికి లాటరీలు, బహుమతుల పేరుతో ఫోన్లు, ఎస్సెమ్మెస్‌ల ద్వారా ఎర వేస్తున్నారు. ఇందుకోసం పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో తీసుకున్న ఇంటర్నేషనల్ రోమింగ్ కలిగిన సిమ్‌కార్డులు (+92 సిరీస్‌తో ఉంటాయి) ఉపయోగిస్తున్నారు.
ఎవరికీ చిక్కకుండా..
నమ్మినవారికి భిక్షగాళ్ల బ్యాంక్ ఖాతా నెంబర్లు ఇచ్చి అందులో నగదు వేయిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా మోసపోయిన వాళ్లు పోలీసుల్ని ఆశ్రయించినా... దర్యాప్తులో భాగంగా పాకిస్థాన్ నుంచి సెల్ నెంబర్ల వివరాలు తెలుసుకోలేరు. ఖాతా ఆధారంగా దర్యాప్తు చేసినా... అది భిక్షగాళ్లు/పేదల వరకు వెళ్లి ఆగిపోతుంది. ఖాతాలు తెరిచిన వారికి, ఏజెంట్లకు మధ్య... ఏజెంట్లకు సైబర్ నేరగాళ్లకు మధ్య ఎలాంటి లింకు లేకపోవడంతో దొరకడం కష్టమవుతుంది.
‘+92’తో బహుపరాక్
ఈ తరహా నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీసీఎస్ డీసీపీ జి.పాలరాజు నగర ప్రజలకు సూచించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇలాంటి నేరాల్లో మోసపోవడం ఎంత తేలికో... నిందితుల్ని పట్టుకోవడం, రికవరీలు చేయడం అంతకష్టమని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ ‘+92’ సిరీస్‌తో వచ్చే ఫోన్లు/ఎస్సెమ్మెస్‌ల విషయంలో ప్రమత్తంగా ఉండాలని కోరారు.