ప్రభుత్వ నిర్ణయాలన్నీ అమలు కావాల్సిందే | CS Neelam Sahni Said Government Decisions Are Must Be Implemented On Corona Virus | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ నిర్ణయాలన్నీ అమలు కావాల్సిందే

Published Tue, Mar 24 2020 7:02 AM | Last Updated on Tue, Mar 24 2020 7:07 AM

CS Neelam Sahni Said  Government Decisions Are Must Be Implemented On Corona Virus - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారిని పారద్రోలడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తప్పనిసరిగా అమలయ్యేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి వారు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించేలా చూడాలన్నారు. లేదంటే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పబ్లిక్, ప్రైవేట్‌ వాహనాలకు అనుమతి లేదని, అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. రాత్రి 8 గంటల తర్వాత నిత్యావసర వస్తువుల విక్రయానికి సైతం అనుమతి లేదన్నారు. పార్టీలు, ఫంక్షన్లు, వివాహాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. డాక్టర్లు, నర్సింగ్‌ సిబ్బంది, మున్సిపాలిటి, రెవెన్యూ శాఖల సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని చెప్పారు. అత్యవసర సమయాల్లో 100, 104 విరివిగా ఉపయోగించుకోవాలని సూచించారు. (పటిష్టంగా లాక్‌ డౌన్‌)

తాజాగా కీలక నిర్ణయాలు

  • ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పలు చెక్‌ పాయింట్ల ఏర్పాటు. 
  • ఒక కాలనీలో వాహనంపై రెండు లేదా మూడు కిలోమీటర్లు మించి ప్రయాణించకూడదు.
  • ప్రతి వాహనాన్ని పోలీసులు పరిశీలిస్తారు. ఒకే వాహనం పలుసార్లు తిరిగినట్లు తేలితే దానిని స్వాధీనం చేసుకుంటారు.
  • స్వాధీనం చేసుకున్న వాహనాలను వైరస్‌ తీవ్రత తగ్గిన తర్వాతే తిరిగి ఇస్తారు. 
  • నిత్యావసర వస్తువుల రవాణాకు మాత్రమే ప్రైవేటు వాహనాలకు అనుమతి ఉంటుంది. 
  • మీడియాపై ఎలాంటి ఆంక్షలు లేవు. ఎక్కడైనా తిరిగేందుకు అనుమతి.
  • కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యలను అతిక్రమిస్తే క్రిమినల్‌ కేసుల నమోదు.
  • వివిధ దేశాల నుండి రాష్ట్రంలోకి వచ్చిన విద్యార్థులు, టూరిస్టులు, ఉద్యోగులు కచ్చితంగా సంబంధిత అధికారులకు, డయల్‌ 100, 104 ద్వారా సమాచారం అందించాలి. 
  • అందుకు వారి కుటుంబ సభ్యులు, బంధువులు సహకరించాలి. సంబంధిత వ్యక్తుల సమాచారంపై గోప్యత పాటిస్తే కఠిన చర్యలు తప్పవు.
  • కొన్ని విద్యా సంస్థలు ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను బలవంతంగా బయటకు పంపిస్తున్నాయి. అటువంటి వాటిపై కఠిన చర్యలు. కళాశాల ప్రాంగణంలోనే విద్యార్థులు ఉండే విధంగా ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలి. (ప్రజల కోసమే పోలీస్‌ ఆంక్షలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement