సరిహద్దుల్లో అలజడి | cumbing in andhra- chhattisgarh borders | Sakshi
Sakshi News home page

సరిహద్దుల్లో అలజడి

Published Mon, Jan 20 2014 4:06 AM | Last Updated on Sat, Aug 18 2018 4:23 PM

cumbing in andhra- chhattisgarh borders

చర్ల, న్యూస్‌లైన్  : ఆంధ్రా- ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. మావోయిస్టుల అన్వేషణ పేరుతో పెద్ద ఎత్తున చేరుకున్న ప్రత్యేక పోలీసు బలగాలు ఈ ప్రాంతంలో ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తుండడంతో సరిహద్దు గ్రామాల ఆదివాసీలు భయాందోళనలకు గురవుతున్నారు.

 చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని మారుమూల గ్రామాలలో ప్రత్యేక బలగాల భద్రతతో చేపట్టిన అబివృద్ధి పనులకు విఘాతం కలిగించడంతో పాటు, బలగాలను టార్గెట్ చేసేందుకు మావోయిస్టులు వ్యూహరచన చేసి సరిహద్దు ప్రాంతంలో సంచరిస్తున్నారనే పక్కా సమాచారంతో  ఈ కూంబింగ్ ఆపరేషన్‌ను చేపట్టినట్లు తెలిసింది. దీనికి తోడు ఈనెల 15న దుమ్ముగూడెం మండలం కొత్తపల్లి సమీపంలో గల బట్టిగుంపులో కోడిపందేలు చూసేందుకు వచ్చిన ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మాజీ ఎస్పీవో మడవి సోమయ్య ను మావోయిస్టు మిలిటెంట్లు  హతమార్చారు.

ఈ ఘటన మావోయిస్టులు సంచరిస్తున్నారన్న అనుమానానికి బలం చేకూరుస్తుండడంతో పోలీసు ఉన్నతాధికారులు కూంబింగ్‌ను తీవ్రతరం చేశారు. ఈ క్రమంలోనే దండకారణ్య ప్రాంతానికి భారీగా బలగాలను తరలించి గత మూడు రోజులుగా కూంబింగ్ చేపడుతున్నారు. పెద్ద ఎత్తున చేరుకున్న బలగాలను చూసిన సరిహద్దు ప్రాంతంలోని బత్తినపల్లి, ఎర్రంపాడు, చెన్నాపురం, కుర్నపల్లి, కొండెవాయి, నిమ్మలగూడెం, కరిగుండం, యాంపురం, జరుపల్లి, తోగ్గూడెం తదితర గ్రామాలకు చెందిన ఆదివాసీలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.

గతంలో పలుమార్లు పోలీసులు పలువురు ఆదివాసీలను అదుపులోకి తీసుకోవడం, తామెవరినీ అదుపులోనికి తీసుకోలేదంటూ ప్రకటించడం, ఆ తరువాత మళ్లీ వారిని అరెస్ట్ చేశామంటూ ప్రకటనలు చేయడం వంటి ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు కూడా వారు అలాంటి చర్యలకు పాల్పడతారేమోనని భయపడుతున్నారు.

 40 మందిని అదుపులోకి  తీసుకున్న పోలీసులు...!
 ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి సమీపంలో గల చర్ల మండలం ఎర్రంపాడు, చెన్నాపురం గ్రామాలకు చెందిన సుమారు 40 మంది ఆదివాసీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గత మూడు రోజులుగా కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు ఆదివారం తెల్లవారుజామున ఈ రెండు గ్రామాలలోకి చేరి నిద్రిస్తున్న ఆదివాసీలను లేపి బలవంతంగా అదుపులోనికి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం తామెవ రినీ అదుపులోకి తీసుకోలేదని ప్రకటిస్తుండడంతో ఆదివాసీల కుటుంబసభ్యులు  ఆందోళన చెందుతున్నారు.

ముందుగా ఎర్రంపాడు గ్రామంలోకి వెళ్లిన పోలీసులు.. అక్కడ తొమ్మిది మందిని, ఆ తర్వాత చెన్నాపురంలో 35 మందిని అదుపులోనికి తీసుకున్నట్లు తెలిసింది. వారిలో పురుషులు, మహిళలతో పాటు 10-15 సంవత్సరాల వయసున్న పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. వీరందరినీ ఆదివారం మధ్యాహ్నం మండలంలోని పెదమిడిసిలేరు శివారు గీసరెల్లి సమీపంలో గల జమాయిల్ తోటలోకి తీసుకొచ్చారని, అక్కడి నుంచి ఎర్రంపాడుకు చెందిన తొమ్మిది మందిలో గ్రామ పటేల్‌తో పాటు మరో ఇద్దరిని విడిచిపెట్టారని తెలిసింది.

అయితే పోలీసులు మాత్రం తామెవరినీ అదుపులోకి తీసుకోలేదని చెపుతున్నారు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారా లేక ఆదివాసీలే భయపడి గ్రామం విడిచి వెళ్లిపోయారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement