విద్యుత్ ఉద్యోగుల 72 గంటల సమ్మె
Published Thu, Sep 12 2013 3:13 AM | Last Updated on Fri, Sep 1 2017 10:37 PM
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్:సమైక్యాంధ్రకు మద్దతుగా నేటి నుంచి జిల్లాలోని విద్యుత్ ఉద్యోగులందరూ సమ్మె బాట పట్టనున్నారు. ఇప్పటికే దశలవారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన విద్యుత్ ఉద్యోగులు, సమైక్య రాష్ట్రంపై కేంద్రం నుంచి ఎటువంటి ప్రకటన రాకపోవడంతో 72 గంటల పాటు సమ్మె చేయాలని నిర్ణయించారు. తమ సిమ్‌కార్డులు సైతం అధికారులకు అందించారు. ఈ మేరకు బుధవారం స్థానిక కర్నూలు రోడ్డులోని సబ్‌స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యుత్ జేఏసీ నాయకులు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులంతా సమ్మెలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ ఎం హరిబాబు మాట్లాడుతూ రాష్ట్ర విభజనను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల నుంచి పలు ఆందోళనలు నిర్వహించామని, అలాగే సమ్మెలోకి వెళ్తామని పలుమార్లు సమ్మె నోటీసులు ఇచ్చామని తెలిపారు.
అయినా ప్రభుత్వం స్పందించని కారణంగానే నేటి నుంచి 72 గంటల సమ్మెలోకి వెళ్తున్నట్లు చెప్పారు. జేఎల్‌ఎం స్థాయి ఉద్యోగి నుంచి చీఫ్ ఇంజినీర్ స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరూ సమ్మెలోకి వస్తారని వివరించారు. జిల్లా వ్యాప్తంగా 1500 మంది డిపార్టుమెంట్ ఉద్యోగులు, 1200 కాంట్రాక్టు ఉద్యోగులు కలిపి మొత్తం 2700 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని తెలిపారు. ఉద్యోగుల సమ్మె వల్ల విద్యుత్ సరఫరాకు కలిగే అంతరాయాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
సీడబ్ల్యూసీ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు, వెంటనే సమైక్యాంధ్ర ప్రకటన చేయాలన్నదే తమ ఏకైక నినాదం అని వివరించారు. గత 60 ఏళ్లలో విద్యుత్ ఉద్యోగులు సమ్మె చేసిన సందర్భాలు లేవని, ప్రస్తుత సమ్మెకు పూర్తిగా ప్రభుత్వాలదే బాధ్యత అన్నారు. నెల రోజులుగా జీతాలు లేకుండా సమ్మె చేస్తున్న ఉద్యోగుల ఆందోళనకు అండగా ఉంటామని చెప్పారు. అలాగే నేటి నుంచి స్థానిక ఎస్‌ఈ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా చైర్మన్ ఎన్ జయాకరరావు, కన్వీనర్ టి సాంబశివరావు, స్టాలిన్‌కుమార్, శివప్రసాద్, నరశింహారావు, ఉదయ్‌కుమార్, బీ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ వినియోగదారుల కోసం రౌండ్ ది క్లాక్ సేవలు
సాక్షి, తిరుపతి : సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యుత్ జేఏసీ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో డిస్కం పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకున్నామని చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ హెచ్‌వై.దొర బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే ఆయా జిల్లాల పరిధిలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే లోడ్ మోనటరింగ్ సెల్ (ఎల్‌ఎంసి)కు ఫోన్ చేస్తే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ప్రకాశం జిల్లా పరిధిలోని విద్యుత్ వినియోగదారులు 9440817491 నంబర్‌కు ఫోన్ చేయవ చ్చని వెల్లడించారు. కార్పొరేట్ ఆఫీసులో ఉన్న 9440814319కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
Advertisement
Advertisement