కేటీపీఎస్ కాంప్లెక్స్
సాక్షి, పాల్వంచ: తెలంగాణా విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్‌ల సమస్యలపై కార్మిక సంఘాలు పోరుబాటకు సిద్ధమవుతున్నాయి. జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎన్‌పీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్ తదితర సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు సుమారు 23 వేల మందిని ఆర్టిజన్‌లుగా తీసుకుని రెండేళ్లు గడుస్తున్నా పర్మనెంట్ చేయలేదు. దీంతోపాటు సరైన విధి విధానాలు సైతం ప్రకటించకపోవడంతో కార్మిక సంఘాలు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్ ఫ్రంట్(టీ టఫ్)గా ఏర్పడి ప్రభుత్వంపై ఉద్యమ కార్యాచరణకు రంగం సిద్ధం చేశాయి. జెన్‌కో వ్యాప్తంగా పాల్వంచ కేటీపీఎస్ కాంప్లెక్స్‌లో అక్టోబర్ 4న ధర్నా నిర్వహించి పోరాటానికి శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రంలో సుమారు 23 వేల మంది కార్మికులను 2017 జూలై 17న ఆర్టిజన్ కార్మికులుగా తీసుకున్నారు. ఒక్క కేటీపీఎస్ కాంప్లెక్స్‌లోనే సుమారు 2 వేల మంది కార్మికులు ఉండగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరో 1,500 మంది కార్మికులను ఆర్టిజన్‌లుగా గుర్తించారు. వారిని పూర్తి స్థాయి ఉద్యోగులుగా పరిగణించాలని, అందుకు ఏపీఎస్‌ఈబీ రూల్స్‌ను పరిగణలోకి తీసుకోవాలని నాలుగు దఫాలుగా లేబర్ కమిషనర్ గంగాధర్ వద్ద సమావేశాలు నిర్వహించారు. కానీ తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఉద్యమ బాటే శరణ్యమని కార్మికులు భావిస్తున్నారు.
దశలవారీ కార్యాచరణ..
పోరాడితే తప్ప కార్మిక సమస్యలు పరిష్కారం కావని టీ టఫ్ నాయకులు అంటున్నారు. ఈ క్రమంలో జెన్‌కో, ట్రాన్స్ కో, ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్ తదితర సంస్థల కార్మిక సంఘాల నేతలు ఏకమయ్యారు. జెన్‌కో ఆధ్వర్యంలో పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్(కేటీపీఎస్) అంబేద్కర్ సెంటర్‌లో అక్టోబర్ 4న ధర్నా నిర్వహించనున్నారు. ఈ ధర్నాకు రాష్ట్రంలోని అన్ని కార్మిక సంఘాల ప్రధాన నేతలు, కార్మికలు తరలిరానున్నారు. 11న ఎస్‌పీడీసీఎల్ హన్మకొండ ప్రధాన కార్యాలయం ఎదుట, అక్టోబర్ 16న ఎన్‌పీడీసీఎల్ హైదరాబాద్ ప్రధాన కార్యాలయం ముందు, అక్టోబర్ 23న హైదరాబాద్‌లో మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే విద్యుత్ ఉత్పత్తి స్తంభించేలా ఉద్యమాలు కొనసాగిస్తామని నేతలు తెలిపారు.
ప్రధాన డిమాండ్లు ఇవే..
కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేసే విషయంలో నాడు ఏపీఎస్‌ఈబీ అనుసరించిన విధానాన్నే ఇప్పుడు కూడా అమలు చేయాలనేది ఆర్టిజన్ల ప్రధాన డిమాండ్. అంతేకాక పెన్షన్ సౌకర్యం, కార్మికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, 24 గంటల నిరంతర విద్యుత్ అలవెన్స్, మెడికల్ పాలసీ, నివాస సముదాయాల నిర్మాణం వంటి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment