ఇక మహిళా సాధికార కార్పొరేషన్!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం రేపటి మంత్రిమండలి భేటీలో ఆమోదముద్ర!
- విద్యుత్ ఉద్యోగుల ఫిట్‌మెంట్, అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్న కేబినెట్
సాక్షి, హైదరాబాద్: డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. తర్వాత రుణాల మాఫీ కాకుండా మహిళా సంఘాల్లోని సభ్యులకు రూ.10 వేల చొప్పున మూలధనం కింద ఇస్తామన్నారు. వ్యవసాయ రుణాల మాఫీకి సంబంధించి రైతు సాధికార కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి.. తాజాగా మహిళా సాధికార కార్పొరేషన్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.
బుధవారం సాయంత్రం సచివాలయంలో సీఎం అధ్యక్షతన జరిగే మంత్రిమండలి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు సోమవారం అధికారులు ఫైలును రూపొందించారు. ఆర్థిక శాఖతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమోదం తీసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి ఆమోదంతో మహిళా సాధికార కార్పొరేషన్ ఏర్పాటు అంశాన్ని కేబినెట్ భేటీ ఎజెండాలో చేర్చారు.
గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్)ని ఈ కార్పొరేషన్‌లో విలీనం చేయనున్నారు. దీంతో సెర్ప్ ఉద్యోగులు, ఆస్తులు, అప్పులు అన్నీ.. ఈ కార్పొరేషన్ పరిధిలోకి రానున్నాయి. అయితే గతంలో చంద్రబాబు ప్రభుత్వమే ఒక సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను మరో సంస్థలోకి తీసుకోరాదంటూ చట్టం తీసుకురావడం గమనార్హం. ఆ చట్టానికి సవరణలు చేయకుండా సెర్ప్ ఉద్యోగులను కొత్తగా ఏర్పాటు చేసే కార్పొరేషన్‌లోకి తీసుకోవడం సాధ్యం కాదని ఆర్థిక శాఖ చెబుతోంది.
ఇలావుండగా విద్యుత్ ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని సిఫారసు చేస్తూ ఇంధన శాఖ సోమవారం ముఖ్యమంత్రికి ఫైలు పంపింది. దీనిపై మంత్రివర్గ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకుని, ప్రకటన చేసే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ నెల 18 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా కేబినెట్ చర్చించనుంది.
ప్రధానంగా రైతుల రుణ మాఫీని నామమాత్రంగా చేయడంపై, మహిళా సంఘాలకు రుణ మాఫీ చేయకపోవడంపై ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తే ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై చర్చించనున్నట్టు సమాచారం. వ్యాట్ చట్టంలో సవరణలు చేస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. వాస్తవానికి మంగళవారం జరగాల్సిన కేబినెట్ భేటీ.. తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ అంత్యక్రియలు ఇదేరోజున ఉండటంతో బుధవారానికి వాయిదా పడింది.