సాక్షి ప్రతినిధి, కడప :తక్కువ వడ్డీకే రుణం ఇస్తామని చెప్పి.. రుణం ఇవ్వకుండా అకౌంట్‌లోంచి ప్రాసెస్ ఫీజు వసూలు చేసుకుని ఓ ఖాతాదారునికి నగరంలోని ఇండస్ ఇండ్ బ్యాంక్ అధికారులు చుక్కలు చూపిస్తున్న వైనమిది. బాధితుని కథనం మేరకు వివరాలు.. పరుశురాం అండ్ సన్స్ పేరిట మైన్ ఓనర్ వి పరుశురాముడుకు ఇండస్ ఇండ్ బ్యాంకులో 2006 నుంచి అకౌంట్ ఉంది. అకౌంట్ నెం. 200007471951 ద్వారా బ్యాంకు నిబంధనల మేరకు లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో బ్యాంకు సిబ్బంది మీకు రూ.కోటి రుణం ఇస్తామని ఖాతాదారుడిని కలిశారు.
ఇప్పట్లో తనకు రుణం అవసరం లేదని ఆయన చెప్పాడు. అయినా వడ్డీ రేటు తక్కువ అంటూ పలు రకాలుగా వివరించి ఒప్పించారు. ఆ మేరకు డాక్యుమెంట్లు ఇవ్వడంతో రూ.70 లక్షలు రుణం మంజూరు చేయనున్నట్లు బ్యాంకు సిబ్బంది వివరించారు. ఆ మేరకు పరస్పరం అంగీకారంతో వ్యవహారం నడిచింది. అయితే పరుశురాముడికి రుణం అందక మునుపే ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.70 వేలు, రూ.8,652 సర్వీసు ట్యాక్స్ కింద అకౌంట్ నుంచి డ్రా చేశారు. 2014 జనవరి 1న ఇండస్ ఇండ్ బ్యాంకు డబ్బులు డ్రా చేసింది. బ్యాంకు అకౌంట్‌లో డబ్బులు తేడా రావడంతో ఖాతాదారుడు బ్యాంకు స్టేట్‌మెంట్ కోరారు. ఆ మేరకు రుణం ప్రాసెసింగ్ ఫీజు రూపేనా బ్యాంకు డ్రా చేసినట్లు రూఢీ అయ్యింది.రుణం ఇవ్వకుండానే ప్రాసెస్ ఫీజు ఎలా వసూలు చేస్తారంటూ ఖాతాదారుడు వాపోయారు. అనేక పర్యాయాలు బ్రాంచ్ మేనేజర్, రీజనల్ మేనేజర్‌లకు రాత పూర్వకంగా విన్నవించాడు.
న్యాయవాదిని ఆశ్రయించడంతో....
2014 జూలై నుంచి బ్రాంచ్ మేనేజర్, రీజనల్ మేనేజర్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఉపయోగం లేకపోవడంతో పరుశురాముడు న్యాయవాదిని ఆశ్రయించి బ్యాంకుకు లీగల్ నోటీసు జారీ చేశారు. అప్పటి వరకూ చూస్తాం, చేస్తాం అన్న బ్యాంకు అధికారులు.. విషయం లీగల్ వింగ్‌లోకి వెళ్లింది, మీరే తేల్చుకోండని చేతులు ఎత్తేశారు. రుణం తీసుకోండని, మీరే చెప్పారు, సరే అని ఒప్పుకుంటే రుణం ఇవ్వకుండానే ప్రాస్సెస్ ఫీజు రూపేనా రూ.78,652 డ్రా చేసుకున్నారు, అడిగితే చలనం లేదు, లీగల్ నోటీసు ఇస్తే మాకు సంబంధం లేదంటారా అని ఖాతాదారుడు వాపోయాడు.
వెనక్కు ఇచ్చే అధికారం లేకనే..
‘ఖాతాదారుడు పరుశురాముడు అకౌంట్ నుంచి రూ.78,652 డ్రా చేసిన మాట వాస్తవమే. వాస్తవానికి రూ.70 లక్షలు రుణం మంజూరైంది, బ్యాంకులో తాజాగా వచ్చిన నిబంధనల మేరకు ఖాతాదారుడికి అందలేదు. ఇదే విషయాన్ని బ్యాంకు తరుఫున పలుమార్లు హెడ్ ఆఫీసు దృష్టికి తీసుకెళ్లాం. హైలెవెల్లో ఆశించిన స్పందన లేదు. డబ్బులు వెనక్కు ఇచ్చే అధికారం మాకు లేదు. ఇప్పుడు ఖాతాదారుడు లీగల్‌గా వెళ్లడంతో ఆ అంశం మా చేతుల్లో లేదు. లీగల్‌గా పోరాటం చేయాల్సిందే’నని ఇండస్ ఇండ్ బ్యాంకు అధికారి రెహ్మన్ సాక్షి ప్రతినిధికి వివరించారు.
ఖాతాదారుడికి ఇండస్ ఇండ్ బ్యాంక్ వేధింపు!
Published Wed, May 6 2015 4:59 AM | Last Updated on Mon, Aug 13 2018 8:03 PM
Advertisement