తాడిపత్రి, న్యూస్‌లైన్ : పట్టణంలో ఇటీవల మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఏటీఎంల నుంచి నగదును తస్కరిస్తున్న సైబర్ నేరస్తులు మధుసూదన్‌రెడ్డి, శివకంచిరెడ్డి బుధవారం పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.40,150 నగదు, 4 సెల్‌ఫోన్లు, 8 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణ పోలీసు స్టేషన్‌లో తాడిపత్రి డీఎస్పీ నాగరాజు, సీఐ లక్ష్మినారాయణతో కలిసి విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన నిందితులు ఇద్దరూ కంప్యూటర్ డిప్లొమో కోర్సు చేశారు. జల్సాలకు అలవాటు పడ్డ వీరు సులభంగా డబ్బు సంపాదించాలన్న దురాశతో కొత్తగా వచ్చిన ఎయిర్‌టెల్ మనీ ట్రాన్స్‌ఫర్ సైట్‌ను ఉపయోగించడంతో పాటు నకిలీ సిమ్‌కార్డుల సహాయంతో ఇతరుల బ్యాంకు ఖాతాల్లోని నగదును ఇంటర్‌నెట్ ద్వారా వారి ఖాతాల్లోకి మార్చుకుంటున్నారు.
చోరీ చేసేది ఇలా..
ఈ బ్యాంకింగ్ వ్యవస్థపై పట్టు సాధించిన వీరు... ఓటర్ల ఐడీ నంబరు సేకరించి, ముందుగా వారి పేరున మీ సేవా కేంద్రాల్లో ఓటరు కార్డును సంపాదిస్తున్నారు. వాటి ద్వారా కొత్త సిమ్‌కార్డులు పొందుతున్నారు. అనంతరం బ్యాంకుల ఏటీఎం కేంద్రాల్లో నగదు డ్రా చేస్తున్న వారి వెనుక వినియోగదారుల తరహాలో వీరిద్దరూ నిలుచుని, వారి కార్డు పిన్, కార్డు నెంబరు, ఖాతాదారుని పేరు వంటి వివరాలను అనుమానం రాకుండా సేకరించేవారు. తర్వాత ఎయిర్‌టెల్ మనీ ట్రాన్స్‌ఫర్ సైట్‌లో లాగిన్ అయి సేకరించిన వివరాలను నమోదు చేసి, వారి ఖాతాల్లో నిల్వ ఉన్న నగదును తమ ఖాతాల్లోకి మార్చుకుని డ్రా చేసుకుంటారు. ఇలాంటి సంఘటనలపై తాడిపత్రిలో 8 మంది బ్యాంకు అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో ఏటీఎం కేంద్రాల్లో వినియోగదారులు నగదు డ్రా చేస్తున్న సమయంలో నిఘా పెంచామని, కొంతమంది అజ్ఞాత వ్యక్తులు వారిని గమనిస్తున్నట్లు తేలిందని డీఎస్పీ తెలిపారు. బాధితులున్న ప్రతిచోటా మధుసూదన్‌రెడ్డి, శివకంచిరెడ్డి ఉండటాన్ని పసిగ ట్టి దర్యాప్తు అధికారిగా పట్టణ సీఐ.లక్ష్మినారాయణను నియమించామన్నారు. ఈ క్రమంలో నిందితులు పట్టుబడ్డారన్నారు. వీరు పులివేందుల, అనంతపురము ప్రాంతాల్లో ఏటీఎం చోరీల్లో నిందితులని, గతంలో వీరిపై కేసులు కూడా ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. ఏటీఎం కేంద్రాల్లో నగదు డ్రా చేసుకునే సమయంలో తమ వెనుక వైపు ఏవరూ లేకుండా జాగ్రత్త పడాలని, వివరాలను నమోదు చేసేటపుడు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఖాతాదారులను కోరారు. నిందితులను పట్టుకున్న సీఐని, పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
సైబర్ నేరగాళ్ల అరెస్టు
Published Thu, Sep 5 2013 2:50 AM | Last Updated on Fri, Sep 1 2017 10:26 PM
Advertisement
Advertisement