
మామిడిపై తుపాన్ల ఎఫెక్ట్
=డిసెంబర్ చివరి వారానికి కనిపించని పూతలు
=15 శాతం తోటల్లో కూడా రాని వైనం
=ఈ ఏడాది దిగుబడి ఆలస్యమయ్యే అవకాశం
నూజివీడు, న్యూస్‌లైన్ : ఈ ఏడాది మామిడి రైతుల ఆశలు నెరవేరే సూచనలు కనిపించటం లేదు. డిసెంబర్ చివరి వారం వచ్చేసినా మామిడి తోటలలో పూత కనిపించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది ఇదే సమయంలో అధిక శాతం తోటల్లో పూత పూర్తిస్థాయిలో వచ్చింది. పలుచోట్ల పిందెలు కూడా ఏర్పడ్డాయి. ఈ ఏడాది అందుకు విరుద్ధంగా ఉండటంతో ఏంచేయాలో తెలియక రైతులు తలమునకలవుతున్నారు.
దిగుబడిపై అనుమానాలు...
నూజివీడు డివిజన్‌లో వరి తరువాత ప్రధాన వాణిజ్య పంటగా మామిడి సాగవుతోంది. బంగినపల్లి, తోతాపురి (కలెక్టర్), పెద్ద రసాలు, చిన్న రసాలు తదితర రకాలు సాగవుతున్నాయి. డివిజన్ పరిధిలోని నూజివీడు, ముసునూరు, ఆగిరిపల్లి, రెడ్డిగూడెం, విస్సన్నపేట, చాట్రాయి, ఎ.కొండూరు, తిరువూరు, గంపలగూడెం మండలాల్లో కలిపి దాదాపు 1.20 లక్షల ఎకరాల్లో ప్రధాన పంటగా మామిడి విస్తరించి ఉంది. ఈ మండలాల్లోని మామిడి తోటల్లో ఈ ఏడాది పరిస్థితులు విభిన్నంగా ఉండటంతో రైతులు, వ్యాపారులు పంట దిగుబడి ఎలా ఉంటుందనేదానిపై అంచనాలు వేయలేకపోతున్నారు. పూతలు ఆలస్యంగా రావడం వల్ల తోటల్లో దిగుబడి సరిగా రాదని రైతులు అంటున్నారు. ఉద్యానవన అధికారులు మాత్రం వాతావరణం పూత రావడానికి అనుకూలంగానే ఉందని చెబుతున్నారు.
అధిక వర్షాలే కారణమా...
అక్టోబర్, నవంబర్ నెలల్లో తుపానులు, అల్పపీడన ప్రభావంతో అధిక వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. మామిడి అనేది బెట్ట పంట కావడంతో చెట్లు బెట్టకు వచ్చినప్పుడే పూతలు వస్తాయి. దాదాపు నెలరోజులపాటు కురిసిన వర్షాల వల్ల తోటలు బెట్టకు రావడానికి ఇంకా రెండు వారాలకు పైగా సమయం పట్టనుందని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పూత ఆలస్యమవడం వల్ల దిగుబడి కూడా ఆలస్యంగా వచ్చే అవకాశముందని పేర్కొంటున్నారు.
పూత కోసం మందుల పిచికారీ...
మరోపక్క పూతలు ముందుగా రావాలనే ఆతృతతో పలువురు రైతులు పురుగుమందులను పిచికారీ చేస్తున్నారు. పూత కోసం మల్టీకే, కరాటే(ఇమిడాక్లోప్రిడ్) లేదా సల్ఫర్, కరాటేలు కలిపి వాడుతున్నారు. మామిడి తోటల పరిస్థితి ఇలా ఉండటంతో బేరసారాలు కూడా ఏమీ జరగడం లేదు. పూత రాకుండా కొనుగోలుచేసి నష్టపోయే కంటే వచ్చాకే పరిశీలించుకొని కొనడం మంచిదనే ఆలోచనలో బేరగాళ్లు ఉన్నారు.
పూతలు చాలా తక్కువ
ఈ ఏడాది డివిజన్‌లో మామిడి పూతలు చాలా తక్కువగా ఉన్నాయి. తిరువూరు, విస్సన్నపేట, నూజివీడు ప్రాంతాలలో ఎక్కడా పూతలు కనిపించడం లేదు. కేవలం 5 నుంచి 10 శాతం లోపే పూతలు కనిపిస్తున్నాయి. అధిక వర్షాల వల్లనే ఈ ఏడాది పూత ఆలస్యమైంది. పూతలు రావడానికి ఇంకా 15 రోజులు పట్టే అవకాశం ఉంది.
- ధూళిపాళ్ల అపర్ణ, మామిడి శాస్త్రవేత్త, నూజివీడు