సాక్షి, విశాఖపట్నం : తితిలీ తుపాను సృష్టించిన బీభత్సం నుంచి తేరుకోక ముందే ఆంధ్రప్రదేశ్‌ను మరో తుపాను వణికించేందుకు సిద్దమవుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది. ప్రస్తుతం ఇది శ్రీహరి కోటకు 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ నెల 14 నుంచి 17 వరకు రాష్ట్రంలో తుపాను ప్రభావం ఉంటుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. తీవ్ర తుపానుగా మారిన వాయుగుండం ఈ నెల 15 నాటికి తమిళనాడులో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. కాగా ఈ తుపానుకు శ్రీలంక దేశం సూచించిన ‘గజ’ పేరును ప్రకటించారు. గజ తుపాను ప్రస్తుతం దక్షిణ చెన్నైకి 250 కిలో మీటర్ల వేగంతో కదులుతోందని స్పష్టం చేసింది.
తుపాను ప్రభావంతో రానున్న 24 గంటల్లో నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే వేటలో ఉన్న వారు వెనక్కి రావాలని ఆదేశాలు జారీ చేసింది. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ సహాయచర్యలపై దృష్టి సారించింది.
Comments
Please login to add a commentAdd a comment