పోలవరానికి టీఆర్ఎస్సే అడ్డంకి
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవాలని టీఆర్ఎస్ యత్నిస్తోందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు దగ్గుపాటి పురందేశ్వరీ ఆరోపించారు. శుక్రవారం విజయవాడ నగరంలో జరిగిన ఆంధప్రదేశ్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గం సమావేశంలో పురందేశ్వరీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా పురందేశ్వరీ మాట్లాడుతూ... రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రకు బీజేపీ వల్లే మేలు జరిగిందన్నారు. విభజనతో సీమాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ అధిష్టానానికి ఎన్నో విజ్ఞప్తి చేశామని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. అయిన తమ విజ్ఞప్తులను అధిష్టానం పెడ చెవిన పెట్టిందని ఆరోపించారు.
బిల్లు రాజ్యసభలో చర్చకు వచ్చినప్పుడు తమ పార్టీ సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడు ఒత్తిడి చేయడంతో కాంగ్రెస్ అధిష్టానం దిగిరాక తప్పలేదన్నారు. సీమాంధ్రకు మేలు జరిగిందంటే అది బీజేపీ పుణ్యమేనని పురందేశ్వరీ స్పష్టం చేశారు. ఆ సభకు హాజరైన బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ ప్రకాశ్ జవదేకర్ కూడా మాట్లాడారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి బీజేపీతోనే సాధ్యమైందని అన్నారు. విభజన సందర్బంగా బిల్లులో సీమాంధ్ర కోసం ఉద్దేశించిన ప్యాకేజీలు అమలు కావాలంటే బీజేపీ అధికారంలోని రావాలని ఆయన ఉద్ఘాటించారు. విజయవాడలో ఈ రోజు ఉదయం ప్రారంభమైన బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు రాష్ట్ర అధ్యక్షుడు కె.హరిబాబుతోపాటు వివిధ జిల్లా పార్టీ అధ్యక్షులులతోపాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.