
మాకు బోర్డుపై ఫైనల్ స్కోరు కనిపిస్తోంది: డీఎస్
'లాస్ట్ బాల్ ఉందో..లేదో.. మాకు బోర్డుపై ఫైనల్ స్కోరు' ....కనిపిస్తుందని సీఎం కిరణ్ వ్యాఖ్యలపై పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ డీ శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు.
హైదరాబాద్ : 'లాస్ట్ బాల్ ఉందో..లేదో.. మాకు బోర్డుపై ఫైనల్ స్కోరు' ....కనిపిస్తుందని సీఎం కిరణ్ వ్యాఖ్యలపై పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ డీ శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం ఆయన 66వ జన్మదినోత్సవం సందర్భంగా అభిమానులు, పార్టీ నేతలు, భార్యతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్ మాట్లాడుతూ రాష్ట్రపతి ప్రసంగం, కాంగ్రెస్ మేనిఫెస్టోలో తెలంగాణ ప్రస్తావన ఉందన్నారు. ఇప్పటివరకూ జరిగిన ఒప్పందాలన్నీ అమలు కాలేదన్నారు.
ఇక రాష్ట్ర ఏర్పాటే పరిష్కారమని తెలంగాణవాదులు భావిస్తున్నారని డీఎస్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా సాధించిన అభివృద్ధి కన్నా... రెండు రాష్ట్రాలుంటే మరింత అభివృద్ధి, పాలన సౌలభ్యం కోసమ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అన్నారు. కొన్నేళ్లుగా చర్చలు జరిపి మెజార్టీ పార్టీల ఆమోదంతోనే కాంగ్రెస్ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తీసుకుందన్నారు. ఒక్క పెన్షన్దార్లకే విభజన ద్వారా కొంత ఇబ్బంది ఉంటుందని, చర్చల ద్వారా ఆ అంశాన్ని పరిష్కరించవచ్చని డీఎస్ అన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం చారిత్రాత్మకమని... కొత్త రాజధాని ఏర్పాటు కోసం రూ.5 లక్షల కోట్ల ప్యాకేజీ అడిగిన చంద్రబాబుది ఏ టర్నో అర్థం కావటం లేదని డీఎస్ వ్యాఖ్యానించారు.