- మరో రెండు నెలల్లో పూర్తి
- 200 ఎకరాలకు సాగునీరు
- ఏళ్లనాటి కల నెరవేరుతున్న వేళ
కశింకోట, న్యూస్‌లైన్ : విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు రైతు జనబాంధవునిగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. రైతులకు డెయిరీ ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సాగునీరు అందించే చిన్న జలాశయాల (మినీ రిజర్వాయర్) నిర్మాణం కూడా చేపట్టారు. కశింకోట మండలంలోని చెరకాంలో సుమారు రూ.కోటి ఖర్చుతో చిన్న జలాశయాన్ని నిర్మిస్తున్నారు.
చెరకాం రైతులకు వర్షపునీరే ఆధారం. దీంతో ఏటా వాతావరణం అనుకూలిస్తే పంటలు పండటం, లేదంటే నష్టపోవడం జరుగుతోంది. సాగునీరు లేక చెరకు, వరి, కాయగూరలు వంటి పంటలకు రైతులు చాలా వరకు స్వస్తి పలికే పరిస్థితులు ఏర్పడ్డాయి. కొందరు ప్రత్యామ్నాయంగా సరుగుడు సాగుపై మళ్లిపోయారు.
ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలోని ఎగువన ఉన్న కొండల ప్రాంతంలో కురిసిన వర్షపు నీరు వృధాగా పోకుండా జలాశయాన్ని నిర్మించి పంట భూములకు సాగునీరు అందించాలని రైతులు కోరుతూ వస్తున్నారు. విశాఖ డెయిరీ చైర్మన్ తులసీరావు దృష్టికి కూడా రైతులు ఈ విషయాన్ని దృష్టికి తెచ్చారు. దీంతో రైతుల కోరిక మేరకు జలాశయం నిర్మించాల్సిన ప్రాంతాన్ని సందర్శించి అందుకు డెయిరీ ఆధ్వర్యంలో రూ. 50 లక్షల అంచనా వ్యయం తో నిధులు మంజూరు చేశారు.
ఇప్పటికే జలాశయ ప్రాంతంలో సుమారు 50 ఎకరాల్లో నీరు నిల్వ చేయడానికి అడ్డుగా గట్టును నిర్మించారు. ఆయకట్టుకు రెండు కాలువల ద్వారా సాగునీరు అందించడానికి రెండు ఖానాలను, మిగు లు నీరు పోవడానికి పొర్లుకట్టు నిర్మాణానికి పునాదులు తీశారు. ఇంకా నెల రోజుల్లో దీన్నిపూర్తి చేయనున్నారు. ఇది పూర్తయితే సుమా రు 200 ఎకరాలకు సాగునీరు అందనుంది.
రెండు నెలల్లో పూర్తి చేస్తాం
జలాశయం ప్రధానమైన పనులు నెల రోజుల్లోగా పూర్తి అవుతాయి. చిన్నా చితకా పనులు మరో నెల రోజుల్లో పూర్తి చేసి ఆయకట్టుకు ఈ ఏడాది సాగునీరు అందివ్వాలని చూస్తున్నాం. ప్రధానంగా జలాశయం నిర్మాణం వల్ల పంట భూములకు సాగునీరు అందడమే కాకుండా చెరకాం ప్రాంత వ్యవసాయ బోర్ల భూగర్భంలో నీటి మట్టం పెరిగి రైతులకు ప్రయోజం కలుగ నుంది. కొండల్లో కురిసిన నీరు వృథాగా పోకుండా దీని కోసం జలాశయంలో నిల్వ ఉండేందుకు వీలుగా దీన్ని లోతు చేస్తున్నాం.
- కె.సత్యనారాయణ, డెయిరీ జీఎం