కిర్లంపూడి :కిర్లంపూడి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన పలువురు దళితులు కాకినాడ ఎంపీ తోట నరసింహం తమను అవమానపరిచారంటూ శనివారం రాత్రి స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. ఎంపీ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. స్థానిక దళితులు పూల రాజుతోపాటు పలువురు దళితులు, మహిళల కథనం ప్రకారం.. నాలుగేళ్ల క్రితం అప్పటి మంత్రి, ప్రస్తుత ఎంపీ తోట నరసింహం కమ్యూనిటీహాలుకు నిధులు ఇచ్చారు. వీటితో తోట అనుచరులు భవన నిర్మాణం చేపట్టి అసంపూర్తిగా విడిచిపెట్టారు. ఎన్నికల అనంతరం కూడా దీని నిర్మాణంపై దృష్టిపెట్టకపోవడంతో గ్రామవాసీ, మండల జెడ్పీటీసీ సభ్యుడు వీరంరెడ్డి కాశీబాబును దళితులు ఆశ్రయించారు. దీంతో గత మార్చి 5న కమ్యూనిటీ హాలు నిర్మాణానికి రూ. 3 లక్షల జెడ్పీ నిధులు కేటాయించారు. అయితే వాటితో నిర్మాణం చేయకుండా అధికారులను ఆదేశించి ఎంపీ తోట ఆటంకం కలిగించారని దళితులు విమర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలో గత నెల 13న హడావుడిగా రూ. 2 లక్షల ఎంపీ నిధులు కేటాయించి శనివారం సాయంత్రం ఎంపీ తోట కమ్యూనిటీహాలు వద్ద కొబ్బరికాయ కొట్టడానికి వచ్చారు. నాలుగేళ్లుగా కమ్యూనిటీహాలును ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించారు. దీనిపై సమాధానం చెప్పకుండా వెళ్లిపోతున్న ఎంపీ కారును స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ సభ్యుడు కాశీబాబు కల్పించుకుని దళితులను వారించడంతో ఎంపీ తోట అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో రాజుతోపాటు దళితులు గండే సూర్యాకాంతం, గుండే మణిబాబు, పూల నాగేశ్వరరావు, దాసరి కొండబాబు, ముసలయ్య, గణసతి. గుండే కృప, దాసరి బుజ్జమ్మ, సింహాచలం, గుండే రాజబాబు, చెరుగుల అప్పారావు, చక్రరరావు, వెంకటలక్ష్మి తదితరులు అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేశారు.
ఎంపీ తోట అవమానించారంటూ దళితుల ఆందోళన
Published Sun, Sep 6 2015 1:06 AM | Last Updated on Sun, Sep 3 2017 8:48 AM
Advertisement
Advertisement