టీటీడీలో దళారుల దందా | Danda mediums in ttd | Sakshi
Sakshi News home page

టీటీడీలో దళారుల దందా

Published Wed, Jun 15 2016 12:59 AM | Last Updated on Mon, Sep 4 2017 2:28 AM

Danda mediums in ttd

మార్కెటింగ్ విభాగంలో కమీషన్ల పర్వం  
సరుకుల టెండర్లు, క్వాలిటీ పరీక్షల్లో మాయాజాలం
ముడుపులకు అలవాటు పడ్డ ఉద్యోగులు  
లోపించిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ

 

తిరుమల తిరుపతి దేవస్థానం మార్కెటింగ్ విభాగంలో అవినీతి వేళ్లూనుకుంటోంది. సరుకుల కొనుగోలు కోసం నిర్వహించే టెండర్లు, నాణ్యత పరిశీలన, సరఫరా వంటి  అంశాల్లో పలువురు దళారులు కీలకంగా మారారు. వీరితో చేతులు కలుపుతున్న కొందరు మార్కెటింగ్ విభాగం ఉద్యోగులు ఏటా కమీషన్ల రూపంలో అందే లక్షలాది రూపాయలను జేబుల్లో నింపుకుంటున్నారు. తిరుపతి మార్కెటింగ్ కార్యాలయంతో పాటు ఇక్కడున్న గోదాముల్లో దళారులదే పెత్తనంగా మారింది. వీరి సహకారాన్ని పొందుతున్న కొందరు కాంట్రాక్టర్లు టీటీడీ మార్కెటింగ్ విభాగానికి ఇష్టారాజ్యంగా సరుకులను రవాణా చేస్తున్నారు. నాణ్యత లేని సరుకును టీటీడీకి అంటగట్టి గుట్టుచప్పుడు కాకుండా కోట్లలో బిల్లులు పాస్ చేయించుకుంటున్నారు.

 

తిరుపతి: తిరుపతి రుయా ఆస్పత్రికి ఎదురు రోడ్డులో ఉన్న టీటీడీ మార్కెటింగ్ విభాగంలో ఏటా వందల కోట్ల విలువ చేసే సరుకు కొనుగోళ్లు జరుగుతాయి. టీటీడీ అన్నదానం, ప్రసాదాల తయారీ, వివిధ స్థానిక, అనుబంధ ఆలయాల్లో నైవేద్య సంబంధ పదార్థాల తయారీకి అవసరమైన ముడిసరుకులన్నీ ఇక్కడి నుంచే సరఫరా అవుతుంటాయి. ఆరు నెలలకోసారి మార్కెటింగ్ విభాగం అధికారులు సరుకుల వారీ సరఫరాకు టెండర్లు పిలుస్తుంటారు. ఆపైన కాంట్రాక్టరు నుంచి ఆయా సరుకులను నిర్ణీతప్రమాణంలో ప్రొక్యూర్ చేస్తుంటారు.  దేశంలోని అన్ని టీటీడీ సంస్థలన్నింటికీ ఇక్కడి నుంచే సరుకులు రవాణా అవుతుంటా యి. ఈ-ప్రొక్యూర్‌మెంట్ విధానంలో టెండర్లు పొందిన కాంట్రాక్టర్లు సరుకును తిరుపతి గోదాముల్లోనే దించాలి. ఏడాదికి సుమారు రూ.600 నుంచి రూ.800 కోట్ల విలువైన సరుకులు ఇక్కడి నుంచే వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతుంటా యి. ఈ నేపథ్యంలో టీటీడీలో మార్కెటిం గ్ విభాగం కీలకంగా మారింది. ఏళ్ల నాటి నుంచి ఇక్కడ విధులు నిర్వర్తిస్తోన్న కొందరు ఉద్యోగులు కమీషన్ల రూపంలో దక్కే ముడుపుల కోసం దళారులను పెం చిపోషిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.


అన్‌లోడ్ నుంచే కమీషన్ల పరంపర
ఈ-మార్కెటింగ్‌లో టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు సరుకును, తిరుపతి మార్కెటింగ్ గోడౌన్‌కు చేర్చి అన్‌లోడ్ చేసే ప్రక్రియ నుంచే కమీషన్ల పరంపర మొదలవుతున్నట్లు ఆరోపణలు ఉన్నా యి. ఈ విషయంలో దళారులు, ఉద్యోగులు మిలాఖత్ అయ్యి టీటీడీ సొమ్మును దండుకుంటున్నారని సమాచారం. అంతేకాకుండా సరుకు నాణ్యతలను గుర్తించే పనుల్లోనూ దళారులే కీలకంగా మారార ని విమర్శలున్నాయి. సరుకును బట్టి ఒక్కో లోడుకు ఒక్కో రేటు ప్రకారం కమీషన్ తీసుకుంటున్నారని తెల్సింది. వీరితో తలనొప్పెందుకన్న ధోరణిలో కాంట్రాక్టర్లు కమీషన్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. నెలకు అన్ని సరకుల మీదా దళారులు, కొందరు ఉద్యోగులు రూ.5 లక్షలకు పైగా కమీషన్లు దండుకుంటున్నారని సమాచారం.

 
నాణ్యతలోనూ మోసాలే...

టెండరులో ప్రస్తావించినట్టుగానే సరుకు నాణ్యత కలిగి ఉండాలి. అయితే బి య్యం, కందిపప్పు, మినుములు, పచ్చిపప్పు వంటి అపరాలతో పాటు యాల కులు, ఖర్జూర, లవంగాల వంటి సుగంధ ద్రవ్యాలు, నెయ్యి, పాలు వంటివి సరఫరాలో అప్పుడప్పుడూ నాణ్యత లోపిస్తోం ది. ఇటీవల కాలంలో మూడు నెయ్యి ట్యాంకర్లు నాణ్యత పరీక్షలో తిరస్కరణకు గురయ్యాయి. ఒక్కో ట్యాంకరు విలువ సుమారు రూ.45 లక్షలు. ఒక్కో సందర్భాల్లో పెద్ద మొత్తంలో సరుకు తిరస్కరణకు గురయినపుడు దళారులు రంగప్రవేశం చేసి కాంట్రాక్టరుతో బేరం కుదుర్చుకుని సరుకును తమకున్న పలుకుబడితో ఓకే చేయిస్తున్నారు. తమకు అనుకూలమైన అధికారి తనిఖీలు చేసే క్రమంలో ముందుగానే గుర్తుపెట్టుకున్న బస్తాలోంచి నాణ్యమైన సరుకు తీసి నాణ్యత పరీక్ష చేయిస్తారని తెల్సింది. ఈ తరహా మాయాజాలం వల్ల పెద్ద మొత్తంలో కమీషన్లు చేతులు మారుతున్నాయి.

 

టెండర్లలోనూ మాయాజాలమే...
ఆన్‌లైన్ టెండర్లలోనూ అవకతవకలు జరుగుతున్నట్లు తెల్సింది. ఇటీవల ఆరు నెలల కాలానికి టెంకాయలు, కందిపప్పు, మినప్పప్పు సరఫరా కోసం ఈ- టెండర్లు ఆహ్వానించారు. ఇందులో టీటీడీ పాలకమండలికి చెందిన ఓ ముఖ్య సభ్యుడి దగ్గర బంధువుకు కొబ్బరికాయల సరఫరా టెండరు దక్కింది. కందిపప్పు సరఫరా టెండరు నెల్లూరు కోఆపరేటివ్ సొసైటీకి దక్కినప్పటికీ దాని వెనుక ఉన్నది మాత్రం ఆ ముఖ్య సభ్యుడి బంధువులేనని తెల్సింది. ఈ రెండు టెండర్లకు సంబంధించి సరఫరా ఆర్డర్లు కూడా జారీ అయ్యాయి. సుమారు రూ.5 కోట్ల విలువైన ఈ టెండర్లను దక్కించుకోవడానికి చక్రం తిప్పిన కాంట్రాక్టరు మిగతా కాంట్రాక్టర్లను సిండికేట్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ-టెండర్ల దాఖల్లోనూ, వాటిని ఫైనల్ చేయడంలోనూ ఎలాంటి అవకతవకలు జరగలేదని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.  టీటీడీకి చెందిన పర్యవేక్షణ, క్వాలిటీ కంట్రోల్, విజిలెన్సు అధికారులు అవలంబిస్తోన్న ఉదాసీన వైఖరి వల్లనే ఈ తరహా అవినీతి హెచ్చుమీరుతోందని టీటీడీ వర్గాల్లోనే బహిరంగ విమర్శలు వినబడుతున్నాయి. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement