మృత్యు ఘంటికలు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోజూ 100 మంది మృతి
- గత డిసెంబర్‌లో పెద్దాసుపత్రుల్లో 4 వేల మంది వరకూ మృతి
- వెంటిలేటర్లు, ఐసీయూ, వైద్యులూ అన్నీ కొరతే
- స్వైన్‌ఫ్లూ బాధితులకూ వెంటిలేటర్లు లేని పరిస్థితి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాసుపత్రుల్లోనే ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే ఇక పేద రోగులకు దిక్కెవరు? పెద్దాసుపత్రుల్లోనే వసతులు లేకపోతే ప్రాథమిక వైద్యం మాటేమిటి? ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే స్థోమత లేక, మందులు కూడా కొనలేని పరిస్థితిలో..ప్రభుత్వాసుపత్రులకు వెళుతున్న పేద రోగులు మృత్యువాత పడుతున్నారు. సరాసరిన రోజూ ప్రభుత్వాసుపత్రుల్లో వందమందికి పైగా ఇన్‌పేషెంటు రోగులు మృతి చెందటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం.
డాక్టర్లకు స్టెతస్కోపులూ లేవు..
ఉచితంగా వైద్య సదుపాయాలు పొందుతున్నారు కదా.. చెప్పినట్టు వింటారని పేద రోగుల పట్ల వైద్యులు లెక్కలేనితనంతో వ్యవహరిస్తున్నారు. కనీసం రోగి ఏ పరిస్థితిలో వచ్చాడన్నది కూడా చూడకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. పేద రోగుల ఊపిరి ఆగిపోయే సన్నివేశాలు పెద్దాసుపత్రుల్లో నిత్యకృత్యంగా మారాయి. నడవ లేనిస్థితిలో ఉన్న రోగిని తీసుకెళ్లేందుకు స్ట్రెచర్, ట్రాలీలు కనిపించవు. డాక్టరుకు స్టెతస్కోపూ అందించలేని దుస్థితిలో ఆస్పత్రులున్నాయి. ఎక్కడ చూసినా విరిగిపోయిన మంచాలు, దుర్వాసన వెదజల్లే పరుపులు దర్శనమిచ్చే పెద్దాసుపత్రులకు వస్తున్న రోగుల ఆశలు అడియాసలవుతున్నాయి. రాష్ట్రంలో వేళ్లమీద లెక్కించే పెద్దాసుపత్రులే ఉన్నా వసతులు మాత్రం సున్నా. చివరకు స్వైన్‌ఫ్లూ బాధితులకు కూడా వెంటిలేటర్లు అందించలేని పరిస్థితి నెలకొంది.
నెలలో 4 వేల మంది మృతులు
రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో సరాసరిన రోజుకు 100 మంది వరకు రోగులు చనిపోతున్నట్లు నిర్ధారణ అయింది. ఒక నెలలో సుమారు 45 వేల మంది ఇన్‌పేషెంట్లుగా చేరుతుండగా అందులో 4 వేల మంది ప్రాణాలు వదులుతున్నారంటే సుమారు 9 నుంచి 10 శాతం మంది ఇన్‌పేషెంట్లు చనిపోతున్నట్టు లెక్క. ఇందులో ఎక్కువగా ప్రమాద బాధితులు, హృద్రోగ, నరాల జబ్బుల బాధితులు, విష జ్వరాలతో బాధపడుతున్నవారు, కాలేయ జబ్బు బాధితులు, కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. ఊపిరితిత్తుల జబ్బులతో బాధపడుతున్న వారూ ఎక్కువగానే ఉన్నారు.
ఏటా వేల మందిని కాటేస్తున్న క్యాన్సర్
పెద్దాసుపత్రుల్లో ఇన్‌పేషెంట్లుగా చేరుతున్న వారు పెద్ద ఎత్తున చనిపోతుండగా క్యాన్సర్ మరణాలు వేరేగా నమోదవుతున్నాయి. ఏపీలో ఒక్క క్యాన్సర్ ఆస్పత్రీ లేకపోవటంతో బాధితులంతా వైద్యం కోసం హైదరాబాద్ రావాల్సిందే. దీని వల్ల రాష్ట్రంలోని పెద్దాసుపత్రుల్లో క్యాన్సర్ మృతు లు నమోదు కావడం లేదు. క్యాన్సర్ మృతులు ఏపీలో నెలకు 500 నుంచి 700 మంది వరకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏటా 8 వేల మందిని క్యాన్సర్ కబళిస్తున్నట్లు తెలుస్తోంది.